చంద్రుడిపై సముద్రం సంచలన డేటా పంపిన చంద్రయాన్‌-3

  • Written By:
  • Publish Date - August 22, 2024 / 04:39 PM IST

చంద్రుడిపై శిలా ద్రవం ఉందా లేదా. ఉంది అనే వాదన చాలా కాలం నుంచి ఉన్నా.. అది నిజమే అని చెప్పేందుకు పెద్దగా ఆధారాలు లేవు. కానీ ఇస్రో పంపిన చంద్రయాన్‌-3 నుంచి వచ్చిన డేటా ప్రకారం.. చంద్రుడిపై శిలాద్రవం ఉండేది అనే వాదనను మరింత బలంగా చేస్తోంది. చంద్రుడి ఉపరితలం మొత్తం ఒకప్పుడు శిలాద్రవ సముద్రమే అనే వాదనను ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్‌-3 డాటా సైతం ధ్రువీకరించింది. అహ్మదాబాద్‌లోని ఫిజికల్‌ రిసెర్చ్‌ ల్యాబొరేటరీతో పాటు పలు సంస్థ అధ్యయన వివరాలు ‘నేచర్‌’ జర్నల్‌ పబ్లిష్‌ చేసింది. గతంలో నాసాకు చెందిన అపోలో, సోవియెట్‌ యూనియన్‌కు చెందిన లూనా చంద్రుడి నాడీమండల, మధ్య అక్షాంశ ప్రాంతాల నమూనాలను సేకరించాయి. వీటిని అధ్యయనం చేసిన తర్వాత చంద్రుడిపై ఒకప్పుడు శిలాద్రవం ఉండేదనే అభిప్రాయానికి శాస్త్రవేత్తలు వచ్చారు. అయితే, చంద్రయాన్‌-3లో భాగంగా ప్రజ్ఞాన్‌ రోవర్‌ మాత్రం చంద్రుడి దక్షిణ ధ్రువం నుంచి డాటాను పంపించింది. ఈ డాటాను అధ్యయనం చేసిన పరిశోధకులు దక్షిణ ధ్రువంపై కూడా శిలాద్రవమే ఉండేదని గుర్తించారు. అంతేకాదు, చంద్రుడి ఉపరితలం మొత్తం ఫెర్రోన్‌ అనార్థోసైట్‌ అనే ఒకే రకమైన రాయితో ఏర్పడిందని సైంటిస్ట్‌లు గుర్తించారు. శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్న దాని ప్రకారం.. రెండు ప్రోటోప్లానెట్లు ఢీకొనడం వల్ల చంద్రుడు ఏర్పడ్డాడు. ఫలితంగా చంద్రుడు చాలా వేడిగా మారిపోయాడని, వేడికి ఉపరితలం కరిగి శిలాద్రవ సముద్రంగా మారిందని సైంటిస్ట్‌లు చెప్తున్నారు.