Shiv Grewal: చనిపోయాడు.. తిరిగి బతికి వచ్చాడు.. 2013లో మరణించిన బ్రిటిష్ రంగస్థల నటుడు శివ్ గ్రేవాల్ కథ ఇది. ప్రస్తుతం అతను పెయింటింగ్స్ వేసుకుంటూ భార్యతో కాలం గడుపుతున్నాడు. ఫిబ్రవరి 9, 2013.. రాత్రి 9గంటలు.. లండన్‌లో నివాసముండే శివ్ గ్రేవాల్ ఎప్పటిలాగే తన భార్య అలిసన్‌తో కలిసి డిన్నర్ చేశాడు. కలిసి కబుర్లు చెప్పుకుంటున్నారు. ఇంతలోనే శివ్ గ్రేవాల్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అలిసన్‌కి ఏం జరుగుతుందో అర్థంకాలేదు. వెంటనే అంబులేన్స్‌కి ఫోన్ చేసింది. ఆస్పత్రి సిబ్బంది వచ్చారు.. గుండె అప్పటికీ ఆగిపోయి ఉంది. ఆస్పత్రికి తీసుకెళ్తే బ్రెయిన్‌కు ఆక్సిజన్ అందడం లేదని తెలిసింది. గుండెని తిరిగి కొట్టుకునేలా చేయాల్సింది చేస్తూనే, ఆఖరి ప్రయత్నంగా శస్త్రచికిత్స చేశారు వైద్యులు. మెయిన్ ఆర్టరీకి స్టెంట్ అమర్చారు. మెదడులో ఆక్సిజన్ కొరత కారణంగా నెల రోజుల పాటు కోమాలో ఉన్నాడు. తర్వాత శివ్ గ్రేవాల్ బతికాడు. ఆయన గుండె దాదాపు 7 నిమిషాలు ఆగిపోయింది. అయినా బతికి వచ్చాడు.
ఆ 7 నిమిషాల్లో ఏం జరిగింది..?
గుండె ఆగిపోయిన తర్వాత శివ్ గ్రేవాల్‌కి ఏం అనిపించింది? ఈ విషయాలను స్వయంగా ఆయనే మీడియాతో పంచుకున్నారు. ‘నేను చనిపోయిన విషయం నాకు అర్థమైంది. నేను పూర్తిగా నా శరీరం నుంచి వేరు అవుతున్నట్టు స్పష్టంగా అనిపించింది. బౌతిక ప్రపంచంతో నా సంబంధం తెగిపోయింది. జరుగుతున్నవి నాకు వినిపిస్తున్నాయి. కొన్ని కనిపిస్తున్నట్టు అనిపించాయి. తిరిగి బతకాలనుకున్నాను. నా భార్య కోసం ఇలా జరగకూడదనుకున్నాన.. స్విమ్మింగ్ చేస్తున్నట్టుగా అనిపించింది. వెయిట్‌లెస్‌గా ఫీల్ అయ్యాను. ఒకానొక సమయంలో నక్షత్రాలు కనిపించాయి. చంద్రునిపై ప్రయాణిస్తున్నట్టు అనిపించింది. ఉల్కలతో మొత్తం అంతరిక్షాన్ని చూశాను” అని చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తనకు తెలియదని శివ్ గ్రేవాల్ చెప్పాడు.
కళలే బతికిస్తున్నాయి
జీవితంలో అలాంటి రోజు వస్తుందని శివ్ గ్రేవాల్ ఊహించలేదు. తర్వాత బతకడం కూడా ఓ మిరాకిలే. ఈ పరిణామాల నుంచి శివ్ బయటకు రావడానికి చాలా ఏళ్లు పట్టింది. ప్రస్తుతం అతని వయసు 60. 10ఏళ్ల క్రితం జరిగిన వాటి గురించి శివ్ గ్రేవాల్ తలుచుకున్నాడు. తన భార్యతో పాటు కళ (ఆర్ట్స్)లే తనని మాముల స్థితికి తీసుకొచ్చాయని శివ్ గ్రేవాల్ చెప్పాడు. ప్రస్తుతం లండన్‌లోని కర్మా శాంక్ సోహో హోటల్‌లో “రీబూట్” పేరుతో ఒక ఎగ్జిబిషన్‌ను శివ్ గ్రేవాల్ నిర్వహిస్తున్నాడు. గుండె ఆగిపోయినప్పుడు జరిగినదంతా గుర్తుకు వచ్చిందని, దాన్ని పెయింటింగ్‌గా ప్రజలకు చూపించే ప్రయత్నం చేస్తున్నట్టు చెప్పాడు.