PM Modi: చంద్రయాన్-3ని చంద్రుడి దక్షిణ దృవంపై విజయవంతంగా ల్యాండ్ చేయడం, ఆదిత్య మిషన్‌ను సక్సెస్‌ఫుల్‌గా లాంచ్ చేయడంతో అంతరిక్ష రంగంలో భారత ఖ్యాతి మరింత పెరిగింది. ప్రపంచ దేశాలు భారత్ వైపు చూసేలా చేశాయి ఈ రెండు మిషన్‌లు. ఆ విజయ పరంపరను కొనసాగిస్తూ.. రాబోయే 20 ఏళ్లకు మరిన్ని ప్రతిష్ఠాత్మక లక్ష్యాలను నిర్దేశించుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారత శాస్త్రవేత్తలకు సూచించారు. మరో పదేళ్లలో భారత అంతరిక్ష కేంద్రం ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేయాలన్నారు.
2040 నాటికి చంద్రుడిపై తొలి భారతీయులు అడుగుపెట్టేలా లక్ష్యం పెట్టుకోవాలని దిశానిర్దేశం చేశారు. దీని కోసం ఇప్పటి నుంచే పరిశోధనలు మొదలుపెట్టాలంటూ సూచించారు. ఇందులో భాగంగా.. గగన్‌యాన్ మిషన్‌లో భాగంగా మొట్టమొదటి వెహికల్ డెవలప్‌మెంట్ ఫ్లైట్.. టీవీ-డీ1.. క్రూ ఎస్కేప్ సిస్టమ్‌ను అక్టోబరు 21న పరీక్షించనున్నారు. ఆ కార్యక్రమ సన్నద్ధత, ప్రయోగ ఏర్పాట్లపై ప్రధాని మోదీ నేతృత్వంలో ఉన్నతస్థాయి సమీక్ష జరిగింది. ఈ సమావేశంలో భవిష్యత్ అంతరిక్ష పరిశోధనా ప్రయోగాలపై శాస్త్రవేత్తలకు ప్రధాని పలు సూచనలు చేశారు. శుక్రగ్రహంపై ఆర్బిటర్ మిషన్, అంగారకుడిపై ల్యాండర్ వంటి ప్రయోగాల దిశగా శాస్త్రవేత్తలు కృషి చేయాలన్నారు మోదీ. చంద్రయాన్-3, ఆదిత్య-ఎల్1 విజయాలు అందించిన ఉత్సాహంతో భారత్ ఇప్పుడు మరిన్ని కొత్త, ప్రతిష్ఠాత్మక లక్ష్యాలను నిర్దేశించుకోవాలన్నారు. 2035 నాటికి భారతీయ అంతరిక్ష కేంద్రం ఏర్పాటు, 2040 నాటికి చంద్రుడిపైకి తొలి భారతీయుడిని పంపించే విధంగా ప్రయోగాలు చేపట్టాలని కోరారు.
2025 నాటికి గగన్‌యాన్‌లో మిషన్‌ను ప్రయోగించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ మిషన్ విజయవంతమైతే.. భారత్ చేపట్టే మొదటి మానవసహిత అంతరిక్ష యాత్ర ఇదే కానుంది. ఈ మిషన్‌తో ముగ్గురు ఆస్ట్రోనాట్స్‌ను అంతరిక్షంలో పంపి.. ఏడు రోజుల తర్వాత వారిని తిరిగి భూమికి చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు శాస్త్రవేత్తలు. గతంలో భారత తొలి వ్యోమగామి రాకేశ్ శర్మ అంతరిక్షంలోకి వెళ్లినప్పటికీ.. రష్యాలోని రాకెట్ లాంచింగ్ సెంటర్ నుంచి ఆయన వెళ్లారు. కానీ ఇప్పుడు మాత్రం మన శ్రీహరి కోట నుంచి భారత వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపేందుకు భారత్ రెడీ అవుతోంది.