China: చైనా గుప్పిట్లో శ్రీహరికోట రహస్యాలు ? బయటపెడుతున్న డ్రాగన్ కుట్రలు

హిందీ చీనీ భాయ్ భాయ్ అన్న రోజులు పోయాయి. చైనా ప్రతి చర్యను అనుమానంతో చూడాల్సిన రోజులు వచ్చాయి. ప్రపంచానికి తానే సూపర్ పవర్‌గా ఉండాలని భావిస్తున్న చైనా ఆధిపత్యపు, దురాక్రమణ వైఖరి ప్రపంచ దేశాలకు ముప్పుగా మారుతోంది. ముఖ్యంగా మనదేశానికి చైనా నుంచి నిత్యం ముప్పు పొంచే ఉందని చెప్పాలి. వరుస యుద్ధ విన్యాసాలతో తైవాన్‌పై కాలుదువ్వుతున్నచైనా తన చుట్టూ ఉన్న దేశాలపై నిఘాను మరింత పెంచుతోంది. మన దేశానికి సంబంధించిన రహస్య సమాచారాన్ని తెలుసుకునేందుకు తమకు అనుకూలంగా ఉన్న దేశాలను అడ్డంగా వాడుకుంటోంది. పొరుగు దేశాల్లో భారీగా నిర్మాణాలు చేపడుతూ అక్కడి నుంచే భారత్ పై నిఘా పెంచుతోంది డ్రాగన్ కంట్రీ. మన దేశానికి సంబంధించి పరిశోధనలు, ప్రయోగాలు, ఇతర పరీక్షలకు చెందిన సమాచారాన్ని ముందుగానే పసిగట్టి భారత్‌కు వ్యతిరేకంగా కుట్రలు చేసే ప్రయత్నాలు మరోసారి వెలుగులోకి వచ్చాయి.

  • Written By:
  • Publish Date - April 16, 2023 / 02:33 PM IST

చైనా చేతిలో మియన్మార్, శ్రీలంక పావులు

మియన్మార్,శ్రీలంక మనకు సరిహద్దుల్లోనే ఉన్న ఆసియా దేశాలు భారత్‌కు వ్యతిరేకంగా చైనా చేసే కుట్రలకు కేంద్ర బిందువులుగా ఉన్నాయి. ఈ రెండు దేశాల్లో మిలటరీ స్థావనాలను నిర్మించి భారత్‌పై నిఘా నేత్రాలతో చూసేందుకు ప్రయత్నిస్తోంది చైనా. మియన్మార్‌లోని కోకో ఐలాండ్‌లో చైనా మిలటరీ స్థావరాన్ని నిర్మిస్తోంది. దీనితో పాటు శ్రీలంకలో రిమోట్ శాటిలైట్ రిసీవింగ్ గ్రౌండ్ స్టేషన్‌ను ఏర్పాటు చేస్తోంది. ప్రపంచం దృష్టిలో ఈ రెండూ కూడా ఆయా దేశాలు నిర్మిస్తున్నట్టు కనిపించినా… వీటికి అన్ని రకాలుగా మద్దతిచ్చి నిర్మిస్తుందన్నది మాత్రం చైనానే. శ్రీలంక, మియన్మార్‌లో ఈ రెండింటిని నిర్మించడం వెనుక చైనా ఉద్దేశం ఒకటే. భారత్‌కు సంబంధించిన సున్నితమైన రహస్య సమాచారాన్ని సేకరించడం. దాని ద్వారా మనదేశానికి వ్యతిరేకంగా వ్యూహాలు సిద్ధం చేయడం. కేవలం ఈ పని కోసమే చైనా వీటిని ఏర్పాటు చేస్తోందని రక్షణరంగం నిపుణులు చెబుతున్నారు.

హాంకాంగ్, తైవాన్, భారత్.. ఏదేశమైనా సరే.. చైనాది మొదటి నుంచి ఆధిపత్య ధోరణే. భారత్- చైనా మధ్య సరిహద్దు సమస్యలు దశాబ్దాలుగా రెండు దేశాల మధ్య అగ్గిరాజేస్తూనే ఉన్నాయి. గాల్వాన్ తరహా ఘటనలు ఒక్కటి కాదు. ఇటీవల అరుణాచల్‌ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలకు చైనా తమ పేర్లు పెట్టుకోవడం కూడా మనదేశానికి ఆగ్రహం తెప్పించింది. పొరుగు దేశాల భూభాగాలను ఆక్రమించుకోవడం అన్నది చైనాకు వెన్నతో పెట్టిన విద్య. పైకి ద్వైపాక్షిక సంబంధాలను గౌరవిస్తున్నట్టు కనిపిస్తూనే తెరవెనుక కుట్రలకు తెరతీయడం చైనాకు కొత్తకాదు. అందులో భాగంగానే భారత రహస్యాలను తెలుసుకునేందుకు పొరుగుదేశాలను స్పై సెంటర్స్‌గా వాడుకుంటోంది.

భారత్‌పై నిఘాకు ఆ రెండుదేశాల్లో మిలటరీ సెంటర్లు

శ్రీలంక, మియన్మార్‌లో ఇటీవల వెలుగులోకి వచ్చిన కొన్ని శాటిలైట్ ఇమేజెస్ భారత రక్షణశాఖను కలవరపెడుతున్నాయి. మియన్మార్ కోకో ఐలాండ్‌లో నిర్మిస్తున్న మిలటరీ బేస్‌లో రాడార్లు గుర్తించకుండా ఉండేందుకు డోమ్ ఆకారంలో షీల్డ్స్‌ను ఏర్పాటు చేశారు. కోకో ఐలాండ్ మిలటరీ సెంటర్‌ను తమకు ఎప్పుడు అవసరమైతే అప్పుడు వాడుకునేందుకు వీలుగా మియన్మార్‌తో చైనా ఒప్పందం చేసుకుంది. మియన్మార్‌లో ఏర్పాటు చేస్తున్న మిలటరీ సెంటర్ అండమాన్ నికోబార్ దీవులకు చాలా సమీపంలో ఉంటాయి. భారత భూభాగానికి అతి దగ్గరగా వచ్చి నిఘా పెట్టేందుకు వీలుగా బ్రిడ్జి నిర్మాణాలు కూడా చేపట్టింది చైనా ప్రభుత్వం.

ఇక శ్రీలంకలోనూ ఇలాంటిదే జరుగుతోంది. చైనా అకాడమీ ఆఫ్ సైన్సెస్ పరిధిలో ఉన్న ఏరో స్పేస్ ఇన్మర్మేషన్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌తో శ్రీలంకకు చెందిన యూనివర్శిటీపై రుహూనా ఓ ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం శ్రీలంకలోని కీలక ప్రాంతంలో రిమోట్ శాటిలైట్ రిసీవింగ్ గ్రౌండ్ స్టేషన్‌ను ఏర్పాటు చేస్తోంది చైనా. భారత భూభాగంలో ఏం జరుగుతోంది.. ఎక్కడి నుంచి ఎలాంటి ప్రయోగాలు జరుగుతున్నాయి… శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఎలాంటి ప్రయోగాలు జరుగుతున్నాయి..ఇలాంటి కీలకమైన సమాచారాన్ని పసిగట్టేందుకే దీనిని ఏర్పాటు చేస్తున్నట్టు ఇండియన్ ఇంటెలిజెన్స్ అనుమానిస్తోంది.

చైనా టార్గెట్‌లో ఆ రెండూ ఉన్నాయా ?

శ్రీహరికోట.. భారత అంతరిక్ష ప్రయోగాలకు కేరాఫ్ అడ్రెస్. అంతరిక్ష ప్రయోగాల్లో జైత్రయాత్ర కొనసాగిస్తున్న ఇస్రో వెనుక ఉన్నది శ్రీహరికోటే. ఆంధ్రప్రదేశ్ భూభాగం పరిధిలో ఉన్న శ్రీహరికోట స్పేస్ సెంటర్‌పై చైనా కన్ను పడినట్టు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. ప్రస్తుతం మియన్మార్, శ్రీలంకలో చైనా ఏర్పాటు చేస్తున్న నిఘా కేంద్రాల ద్వారా శ్రీహరికోటలోని ప్రయోగ విశేషాలను చైనా ముందే పసిగట్టగలదని నిపుణులు చెబుతున్నారు. చైనా ఏర్పాటు చేసే స్పై సిస్టమ్స్… ఇస్రో ప్రయోగాలకు అంతరాయం కూడా కలిగించగలవు. అంటే ఇస్రో చేపట్టే ప్రయోగాలను విఫలమయ్యేలా చేసే కుట్రలు కూడా చైనా చేస్తున్నట్టు దీనిని బట్టి అర్థమవుతుంది. ఇక ఒడిస్సాలో ఉన్న ఇంటిగ్రేటెడ్ మిస్సైల్ టెస్ట్ రేంజ్ సెంటర్‌ కూడా వీటి పరిధిలోకే వస్తోంది.

ఎప్పటి నుంచో భారత్‌పై నిఘా

కొంతకాలం క్రితం భారత్-శ్రీలంక సముద్రతీర ప్రాంతంలో యువాన్ వాంగ్ 5 అనే నిఘా నౌకను చైనా మోహరించింది. శ్రీలంకంలోని హంబన్‌టోట హార్బర్‌ను చైనా భారత్‌పై నిఘాకు వాడుకుంది. భారత్ ఎన్ని అభ్యంతరాలను వ్యక్తం చేసినా చైనా పెడచెవిన పెట్టింది. చైనా నుంచి ఆర్థికంగా లాభపడుతున్న శ్రీలంక భారత‌్‌కు వ్యతిరేకంగా వ్యవహరించింది. పొరుగు దేశాలపై నిఘా పెట్టే చైనా వైఖరికి అడ్డుకట్ట వేయకపోతే భవిష్యత్తులో ఆ దేశం నుంచి అతిపెద్ద ముప్పు పొంచి ఉండే ప్రమాదముందని రక్షణరంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు.