Inter Results: మార్కుల కోసం విద్యార్థుల ఆత్మహత్య.. లోపం తల్లిదండ్రులదా.. పిల్లలదా? బాధ్యులెవరు?

బాగా చదివినా సరే.. అనుకున్న మార్కులు రావనే భయంతో కొందరు.. పరీక్షల్లో ఫెయిల్ అయ్యాం అనే బాధతో ఇంకొందరు.. ఇలా విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడుతున్న ఘటనలు కలచివేస్తున్నాయి. తల్లిదండ్రులకు కడుపుకోత మిగులుస్తున్నాయి. మార్కుల కోసం ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఉందా?

Inter Results: టెన్త్, ఇంటర్ వంటి పరీక్షల ఫలితాలు విడుదలవుతున్నాయంటే చాలు.. విద్యార్థుల తల్లిదండ్రులు కంగారుపడాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయి. మార్కులు తక్కువొచ్చాయనో, ఫెయిల్ అయ్యాననో ఏ పిల్లాడు ఆత్మహత్య చేసుకుంటాడో తెలియని పరిస్థితి. బాగా చదివినా సరే.. అనుకున్న మార్కులు రావనే భయంతో కొందరు.. పరీక్షల్లో ఫెయిల్ అయ్యాం అనే బాధతో ఇంకొందరు.. ఇలా విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడుతున్న ఘటనలు కలచివేస్తున్నాయి. తల్లిదండ్రులకు కడుపుకోత మిగులుస్తున్నాయి. మార్కుల కోసం ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఉందా? ఈ విషయంలో లోపం ఎవరిది? పిల్లలదా.. తల్లిదండ్రులదా? పాఠాలు చెప్పే మాస్టర్లదా?
టెన్త్, ఇంటర్ చదివే విద్యార్థులు అంతా టీనేజీ పిల్లలే. 15-19 ఏళ్లలోపు పిల్లలే ఎక్కువగా ఉంటారు. ఆత్మహత్య, చావు అంటే ఏంటో పెద్దగా తెలియని వయసిది. కానీ, ఈ వయసులోనే పిల్లలు ప్రాణాలు తీసుకుంటున్నారు. మంగళవారం తెలంగాణలో ఇంటర్ ఫలితాలు వెలువడగానే, ఫెయిల్ అయినందుకు ఆర్మూర్‌లో ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. సరైన మార్కులు రావేమోనన్న భయంతో పరీక్షలు పూర్తైన తర్వాత.. అంటే గత నెలలో ఒక విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తీరా రిజల్ట్ వచ్చాక అతడు ఏ గ్రేడ్‌లో పాసయ్యాడు. ఇలా ఎందరో విద్యార్థులు పది, ఇంటర్ చదివేటప్పుడే ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. ఇది నిజంగా దారుణమైన విషయం. అంత చిన్న వయసులో ఆత్మహత్యకు పాల్పడటం ఏంటి? బంగారు భవిష్యత్తును మధ్యలో తుంచేసుకోవడం ఏంటి? తల్లిదండ్రుల్ని కడుపుకోతకు గురి చేసి ప్రాణాలు తీసుకోవడం ఏంటి?
తల్లిదండ్రులూ, కాలేజీలు కలిసి..
ఇది పోటీ ప్రపంచం. కాదనలేం. అందుకని పిల్లలపై ఒత్తిడి తేవాలా? ‘పోటీలో గెలవాలంటే బాగా చదవాలి.. మార్కులు కాదు.. ర్యాంకులు కావాలి.. మంచి ఉద్యోగం తెచ్చుకోవాలి.. నలుగురికీ గొప్పగా చెప్పుకోవాలి’.. ఇదీ.. పిల్లలు స్కూళ్లకు వెళ్తున్నప్పటి నుంచి తల్లిదండ్రుల ఆశ. కాదు కాదు.. పిల్లలపై బలవంతపు రుద్దుడు ఇది. దీంతో పిల్లలు కూడా మంచి మార్కులు, ర్యాంకులు రాకపోతే జీవితంలో గెలవలేమేమో.. ఏం సాధించలేమేమో.. నలుగురిలో తాము, తల్లిదండ్రులూ తలెత్తుకు తిరగలేరేమో అనే అభిప్రాయంతో ఉంటున్నారు. స్కూళ్లలో, కాలేజీల్లో భారీ ఫీజులు కట్టి తల్లిదండ్రులు పిల్లల్ని చదివిస్తున్నారు. చదువులో ఏమాత్రం వెనుకబడ్డా పేరెంట్స్ నుంచి తిట్లు పెరిగిపోతున్నాయి. మరోవైపు స్కూళ్లు, కాలేజీల్లో ఉపాధ్యాయులు, లెక్చరర్లు కూడా మార్కుల కోసం ఒత్తిడి తెస్తున్నారు. దీంతో అటు తల్లిదండ్రులకు నచ్చేలా చదవలేక, క్లాసులో పాఠాలు అర్థం కాక పిల్లలు ఒత్తిడికి గురవుతున్నారు. ఈ పరిస్థితే పిల్లల ప్రాణాలు తీస్తోందనేది నిపుణుల అభిప్రాయం. మార్కులు, ర్యాంకులే జీవితం అనుకునేలా తయారైన విద్యార్థులు ఫలితం అనుకున్నట్లుగా రాకపోతే బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. విద్యార్థుల ఆత్మహత్యలో తల్లిదండ్రులు, కాలేజీ యాజమాన్యాలు, అధ్యాపకుల భాద్యత చాలా ఎక్కువగా ఉంది.


విద్యార్థుల తొందరపాటు
విద్యార్థుల తొందరపాటు, అనాలోచిత చర్యలు కూడా వారి ఆత్మహత్యకు కారణాలవుతున్నాయి. ఆత్మహత్య చేసుకునే ముందు తమ తల్లిదండ్రులు, తోబుట్టువుల గురించి ఆలోచించడం లేదు. తమకేమైనా అయితే.. వాళ్లు ఎంతగా వేదనకు గురవుతారో ఆలోచించడం లేదు. ఎగ్జామ్ రిజల్ట్ ఇచ్చే వేదన నుంచి త్వరగా విముక్తి దొరుకుతుందని పిల్లలు అలాంటి పని చేస్తున్నారు. కానీ, తల్లిదండ్రులకు మాత్రం జీవితాంతం కడుపుకోత ఉంటుందని గుర్తించడం లేదు. పిల్లలే సర్వస్వంగా బతికే తల్లిదండ్రులు దీన్నుంచి ఎప్పటికీ తేరుకోలేరు. అందుకే పిల్లలు మార్కులు, ర్యాంకులు కాదు.. తమ తల్లిదండ్రుల్ని సంతోషంగా ఉంచడం ముఖ్యం అని ఆలోచించాలి.
ఏం చేయాలి?
తల్లిదండ్రులు, పిల్లలు, లెక్చరర్లు అందరూ కలిసి ఈ విష‍యంపై అవగాహన కల్పిస్తేనే విద్యార్థుల ఆత్మహత్యలు ఆగుతాయి. పరీక్షలకు ముందు పిల్లలకు ఈ విషయంపై సెమినార్లు నిర్వహించాలి. వేలు, లక్షలు ఫీజులు వసూలు చేస్తున్న విద్యా సంస్థలు ఈ దిశగా అవగాహన కల్పించేందుకు సైకాలజిస్టులతో సదస్సులు నిర్వహించకపోవడం విడ్డూరం. మార్కులు, ర్యాంకులు మాత్రమే జీవితం కాదని పిల్లలకు అర్థమయ్యేలా చెప్పాలి. ఫెయిల్యూర్స్ వచ్చిన వాళ్లు కూడా జీవితంలో పైకెదిగారని తెలియజేయాలి. మార్కుల కోసం ఒత్తిడి తేకూడదు. రిజల్ట్ వచ్చే సమయంలో పిల్లల్ని తల్లిదండ్రులు జాగ్రత్తగా గమనించాలి. ఫలితం ఎలా ఉన్నా యాక్సెప్ట్ చేయాలని చెప్పాలి. రిజల్ట్ తేడా వచ్చినా తల్లిదండ్రులు ఏమీ అనరన్న నమ్మకం పిల్లలకు కలిగించాలి. రిజల్ట్ వాళ్ల జీవితాల్ని ప్రభావితం చేయకుండా ఉంటుందనే నమ్మకం కలిగిస్తే ఆత్మహత్యవైపు ఆలోచించరు. ముఖ్యంగా రిజల్ట్ చూసి దానికి అనుగుణంగా వారికి భరోసా కల్పించాలి. ఈ విషయంలో పేరెంట్స్, ఫ్రెండ్స్ సరైన నమ్మకం కలిగించగలిగితే తప్పుడు ఆలోచనలు చేయరు.