భారత పౌరుషాన్ని ప్రపంచానికి తెలిసేలా చేసిన ధీరుడు అతను. ఆజాద్ హింద్ ఫౌజ్‌ను స్థాపించి దేశానికే పోరాటం నేర్పిన వీరుడు అతను. గంభీరమైన రూపం ఆయన సొతం, శతృవుల గుండెల్లో భయం పుట్టించడం ఆయన నైజం. నేతాజీ సుభాష్ చంద్రబోస్ పేరు చెప్తే.. అందరికీ గుర్తొచ్చే ఇవే. కానీ అదే సుభాష్ చంద్రబోస్‌కు ఓ అందమైన ప్రేమ కథ ఉంది. ప్రియురాలి మీద అంతులేని ప్రేమ ఉంది. స్వాతంత్ర పోరాటంలో ఆయన ఎలా కనుమరుగు అయ్యారో.. చరిత్రపుటల్లో ఆయన ప్రేమకథ కూడా అలాగే వెనకబడిపోయింది. శాసనోల్లంఘన ఉద్యమం ఉదృతంగా మారిన 1934లో సుభాష్ జైలుపాలయ్యారు. అక్కడ ఆరోగ్యం క్షీణించడంతో బ్రిటీష్ ప్రభుత్వం బోస్‌ను ట్రీట్‌మెంట్ కోసం యూరప్‌లోని ఆస్ట్రియా రాజధాని వియన్నాకు పంపింది.
అక్కడ తెలుగు విద్యార్థులను ఏకం చేసే క్రమంలో ఓ బుక్ రాయాలని బోస్ నిర్ణయించుకున్నారు. దానికోసం ఆయనకు ఓ టైపిస్ట్ అవసరం పడింది. అప్పుడే బోస్ సన్నిహితుడు ఒకరు ఆయనకు ఎమిలీ షెంకెల్‌ను పరిచయం చేశాడు. ఎమిలీ కలయికతో బోస్ జీవితమే మారిపోయింది. నిజానికి ఓ ఇండియన్ దగ్గర పని చేయడానికి ఎమిలీ కుటుంబం ఒప్పుకోలేదు. కానీ ఒక్క గంట బోస్‌తో కూర్చున్న తరువాత వాళ్ల మైండ్‌సెట్ మారిపోయింది. వెంటనే ఎమిల్ బోస్ దగ్గర పని చేసేందుకు ఒప్పుకున్నారు. చాలా తక్కువ సమయంలోనే ఎమిలీ.. బోస్‌కు దగ్గరయ్యింది. ఆమె చురుకుదనం, మాటలకు బోస్ ముగ్ధుడయ్యారు. ఎమిలీని ముద్దుగా బఘిని అని పిలిచేవారు. బఘిని అంటే బెంగాళీలో ఆడపులి అని అర్థం. ఈ ప్రయాణంలో వాళ్ల మధ్య ప్రేమ ఏర్పడింది. ఇద్దరిలో ముందుగా బోసే ఎమిలికి ప్రపోజ్ చేశారు.’ ఇప్పటి వరకూ నేను నా దేశాన్నే ప్రేమించాను.. కానీ ఇప్పుడు నిన్ను కూడా ప్రేమిస్తున్నాను. నా దేశం తరువాత నాకున్న ఏకైక వ్యక్తి నువ్వే”అని బోస్ ఎమిలీకి చెప్పారట.
ఈ విషయాన్ని ఆమే స్వయంగా ఓ పుస్తకంలో రాశారు. అప్పటికే పోరాటంలో ఉన్న బోస్ తన ఉనికి తెలియకుండా ఉండేందుకు చాలా ప్రాంతాలు మారేవారు. ఏ ప్రాంతంలో ఉన్నా ఎమిలీకి మాత్రం తప్పకుండా ఉత్తరాలు రాసేవారు. ప్రతీ ఉత్తరం కూడా ఇదే ఆఖరి ఉత్తరం అన్నంతం ప్రేమగా ఉండేది. ఇలా దూరంగా ఉన్న క్రమంలో బోస్ ఎమిలీకి 165 లవ్ లెటర్స్ రాశారు. చివరికి బోస్-ఎమిలీ 1937 డిసెంబర్ 27న ఆస్ట్రియాలో పెళ్లి చేసుకున్నారు. వీళ్లకు ఓ పాప కూడా ఉంది. బోస్ తన కూతురికి అనిత అని పేరు పెట్టుకున్నారు. విదేశీ మహిళను పెళ్లి చేసుకున్నాడు అనే విషయం తన పోరాటం మీద ప్రభావం చూపుతుందన్న భయంతో ఈ విషయం ఎవరికీ చెప్పలేదు. ఎవరికీ చెప్పకూడదు అని భార్య ఎమిలీ దగ్గర కూడా మాట తీసుకున్నారు. భార్యా బిడ్డా ఉన్నా బోస్ దృష్టి మొత్తం స్వాతంత్ర పోరాటం మీదే ఉండేది. చివరగా 1942లో బోస్ తన కూతుర్ని చూడటానికి ఆస్ల్రియా వెళ్లారు.
అక్కడి నుంచి ఓ మిషన్ మీద వెళ్లిన బోస్ మళ్లీ తిరిగి రాలేదు. కానీ ఎమిలీ మాత్రం తన తుది శ్వాస వరకూ బోస్ జ్ఞాపకాలతోనే జీవించింది. బోస్‌తో బతికింది కొన్ని సంవత్సరాలే ఐనా.. జీవితానికి సరిపోయే ప్రేమను మనసులో నింపుకుంది ఎమిలీ. 31 ఏళ్ల వయసులోనే భర్తను కోల్పోయినా.. బోస్‌కు ఇచ్చిన మాట కోసం పెళ్లి విషయం చనిపోయేవరకూ ఎవరికీ చెప్పలేదు. తన కూతురు అనితా బోస్‌లోనే బోస్‌ను చూసుకుంటూ ఆమెను పెంచి పెద్ద చేసింది. జర్మనీలో పెద్ద ఆర్థికవేత్తను చేసింది. బోస్‌కు పెళ్లి అయ్యింది.. ఓ కూతురు కూడా ఉంది అన్న విషయం ఆయన సన్నిహితుల ద్వారా 1993లో బయటకు వచ్చింది. అప్పటి వరకూ బోస్ శౌర్యాన్ని మాత్రమే చూసిన ఈ దేశం.. ఆయన ప్రేమకు కూడా ఫిదా అయ్యింది.