తెలంగాణ ఆదాయాన్ని పెంచేందుకు ఫైనాన్స్ కమిషన్ మెంబర్ సెక్రెటరీ స్మితా సబర్వాల్ ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మంచి ఐడియా ఇచ్చిన వారికి లక్ష రూపాయలు గెలుచుకునే ఛాన్స్ ఉందని ప్రకటించారు. తెలంగాణ ప్రభుత్వానికి రెవెన్యూ పెంచే ఒక్క ఇన్నోవేషన్ ఐడియా ఇవ్వండి. లక్ష వరకు గెలవండి.. అంటూ ఫైనాన్స్ కమిషన్ మెంబర్ సెక్రటరీ స్మితా సబర్వాల్ కీలక ప్రకటన చేశారు. దీని కోసం దరఖాస్తు చేయడానికి 2024 సెప్టెంబర్ 30 చివరి తేదీ అని చెప్పారు. పూర్తి వివరాల కోసం.. tgsfc2024@gmail.com ను సంప్రదించాలన్నారు. కొత్త ఆర్థిక సంవత్సరంలో పన్నులు, ఇతర మార్గాల్లో ఆదాయం భారీగా పెంచాలని ప్రభుత్వం అన్ని శాఖలను ఆదేశించింది.
వాహనాలు, మద్యం వినియోగం పెరిగినా ఇంధనం, మద్యం అమ్మకాలపై పన్నుల ఆదాయం ఆశించిన స్థాయిలో పెరగలేదు. జీఎస్టీ, రిజిస్ట్రేషన్లపై వచ్చే ఆదాయం స్వల్పంగా పెరిగినా.. బడ్జెట్ లక్ష్యాలు మాత్రం నెరవేరలేదు. దీంతో ప్రభుత్వం ఆదాయా మార్గాలను అన్వేషిస్తోంది. ఈ నేపథ్యంలోనే స్మితా సబర్వాల్ చేసిన ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు రవాణాశాఖ ద్వారా ఆదాయాన్ని భారీగా పెంచుకోవడంపై ప్రభుత్వం దృష్టి సారించినట్టు తెలుస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 8 వేల 478 కోట్ల భారీ రాబడి లక్ష్యాన్ని రవాణా శాఖకు నిర్దేశించింది. ఈ శాఖ రాబడిని ఇతర దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణది 4వ స్థానం. ఈ క్రమంలో మిగతా రాష్ట్రాల్లో అధ్యయనం చేసి.. ఆదాయాన్ని పెంచడానికి ఉత్తమ విధానాలను అమలు చేయాలని రవాణా శాఖ అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.