రెండు రోజులుగా అసలేం జరుగుతోంది ?
ఏ దేశంలోనైనా మిలటరీ ఒకేతాటిపై ఉంటుంది. కానీ సూడాన్‌లో సైన్యం రెండుగా చీలిపోయింది. అంటే దేశాన్ని రక్షించాల్సిన సైనిక దళాలే రెండుగా చీలిపోయి ప్రత్యర్థులుగా మారిపోయాయి. రాజధాని ఖార్టోమ్‌పై ఆధిపత్యం ఎవరిది ఉండాలి అన్న విషయంలో మొదలైన సమస్య చివరకు ఘర్షణలకు దారితీసింది. రెండు మిలటరీ వర్గాలు రెండు రోజులుగా భీకర పోరుకు దిగాయి. దాడులు, ప్రతిదాడులతో రాజధానితో పాటు మిగతా ప్రాంతాలను యుద్ధభూమిగా మార్చేశాయి. సూడాన్‌లో సాధారణ సైన్యంతో పాటు రాపిడ్ సపోర్ట్ ఫోర్స్ ( RSF ) పేరుతో పారామిలటరీ ఫోర్స్ ఒకటి ఉంది. ఈ రెండింటి మధ్య చాలాకాలంగా ప్రచ్చన్నయుద్ధం సాగుతోంది.
సైన్యం మధ్య ఆధిపత్య ధోరణికి కారణం ఏంటి ?
2021 అక్టోబర్‌లో సూడాన్‌లో సైనిక తిరుగుబాటు జరిగింది. అప్పటి నుంచి సూడాన్ పాలన మొత్తం కౌన్సిల్ ఆఫ్ జనరల్స్ చేతిలో ఉంది. ప్రస్తుతం సూడాన్ అధ్యక్షుడిగా ఉన్న జనరల్ అబ్దెల్ ఫతహ్-అల్-బర్హన్, రాపిడ్ సపోర్ట్ ఫోర్స్ అధ్యక్షుడిగా ఉన్నజనరల్ మహ్మద్ హమ్దన్ డగాలో మధ్య అభిప్రాయబేధాలే మొత్తం సమస్యకు మూలకారణం. సైనిక పాలనకు స్వస్తి చెప్పి దేశాన్ని ప్రజాస్వామ్యం వైపు నడిపించే విషయంలో ఇద్దరి మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. దాదాపు లక్షమంది రాపిడ్ సపోర్ట్ ఫోర్స్‌ను ప్రధాన సైన్యంలోకి తీసుకోవాలన్న ప్రతిపాదనపై పీటముడిపడింది. RSF ప్రాభల్యం పెరిగితే సైన్యంపై తాను పట్టు కోల్పోతానని భావిస్తున్న అధ్యక్షుడు ఆ ప్రతిపాదనను తిరస్కరిస్తూ వచ్చారు. అయితే అధ్యక్షుడి అభిప్రాయంతో సంబంధం లేకుండా శనివారం దేశవ్యాప్తంగా RSF బలగాల మోపరింపు మొదలయ్యింది. ఇక అప్పటి నుంచి ఘర్షణ మొదలై… సూడాన్ మొత్తం రావణకాష్టంగా కాలుతూ ఉంది.
రాపిడ్ సపోర్ట్ ఫోర్స్‌కు అంతసీనుందా ?
సాధారణ మిలటరీ కంటే సూడాన్ రాపిడ్ సపోర్ట్ ఫోర్సే బలంగా ఉందని చెప్పాలి. 2013లో దీన్ని ఏర్పాటు చేసినప్పటి నుంచి శక్తివంతమైన దళంగా మార్చారు. యెమన్, లిబియాలో జరిగిన ప్రచ్ఛన్న యుద్ధంలోనూ RSF జోక్యం చేసుకుంది. తమ విధానాలను ప్రశ్నించి ఎదురుతిరిగిన వాళ్లను తలనరికం RSF అవలంభించే కృరమైన విధానం. 2019లో దాదాపు 120 మంది ఆందోళనకారులను ఊచకోత కోసిన దుర్మార్గపు చరిత్ర దీనికుంది.
సూడాన్ మిలటరీ పాలకుల చేతిలో ఎందకుంది ?
2019లో సూడాన్ ప్రభుత్వంపై తిరుగుబాటు జరిగింది. మూడు దశాబ్దాల పాటు సూడాన్‌ను పాలించిన అధ్యక్షుడు ఒమర్ అల్ బషీర్‌కు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది. పదవి నుంచి తప్పుకోవాలంటూ ప్రజలు రోడ్డెక్కారు. దీంతో అల్ బషీర్‌ను గద్దె దించేందుకు మిలటరీ రంగంలోకి దిగింది. సూడాన్ ప్రజలు ప్రజాస్వామ్య పాలన కోరుకున్నా వెంటనే సాధ్యపడలేదు. చివరకు మిలటరీతో కలిసి ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. రాజకీయ నాయకులు మిలటరీతో చేతులు కలిపి దేశాన్ని పాలించడమే సూడాన్ సంక్షోభానికి మూలంగా మారింది. 2021 అక్టోబర్ లో ఆ ప్రభుత్వం కూడా తిరుగుబాటుకు కూలిపోయింది. అప్పటి నుంచి మిలటరీ జనరల్స్ మధ్య సూడాన్ నలిగిపోతోంది.
సూడాన్ భవిష్యత్తు ఏంటి ?
ప్రస్తుతం సూడాన్ పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టుగా మారింది. రెండు మిలటరీ వర్గాలు తమ ఆధిపత్యాన్ని కాపాడుకునేందుకు దేశాన్ని రణరంగంగా మార్చేశాయి. ఇతర దేశాలతో యుద్ధాలు జరిగితే రంగంలోకి దిగాల్సిన ఫైటర్ జెన్ యుద్ధ విమానాలు దేశంలోని పౌరులపైనే బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. ఘర్షణకు ముగింపు పలకాలని అరబ్ దేశాలు ఇచ్చిన పిలుపును సూడాన్ మిలటరీ వర్గాల చెవికెక్కలేదు. ప్రస్తుత పరిస్థితి మరికొన్ని రోజులు కొనసాగితే సూడాన్ మరుభూమిగా మారే ప్రమాదముందని అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కేవలం సూడాన్ ప్రజలే కాదు.. ఉపాధి కోసం ఆదేశంలో అడుగుపెట్టిన భారతీయులు సహా లక్షలాది మంది విదేశీయులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. ఇప్పటికే ఓ భారతీయుడు ఘర్షణలో ప్రాణాలు కోల్పోవడంతో ఇళ్లు వదిలి బయటకు రావొద్దని సూడాన్‌లో భారత రాయబార కార్యాలయం హెచ్చరించింది. ఏ దేశంలోనైనా పాలన ప్రజలు ఎన్నుకున్న పాలకుల చేతిలో ఉండాలి.. అయితే జరిగితేనే ఎలాంటి పోరాటాలకైనా ప్రజాస్వామ్యయుతమైన ముగింపు దొరుకుతుంది. మిలటరీ తన పరిధి దాటి దేశాన్ని పాలించాలనకున్నా దేశాన్ని నియంతృత్వంలోకి నడపాలనుకున్నా సూడాన్, మియన్మార్ , పాకిస్థాన్ లాంటి పరిస్థితులే పునరావృతమవుతాయి.