Summe Effect: ఎండాకాలం.. వాహనాలు మండేకాలం.. మరి మీ కారు సేఫేనా..?

మిడ్ సమ్మర్‌లోకి వచ్చేశాం.. సూర్యారావు తెగ రెచ్చిపోతున్నాడు. భానుడి దెబ్బకు జనమే బెంబేలెత్తిపోతున్నారు. ఇక వాహనాలో లెక్క.. అలా రోడ్డుపై వెళుతూ ఇలా సింపుల్‌గా తగలబడి పోతున్నాయి. అగ్నిదేవుడికి కాంట్రాక్ట్ ఇచ్చినట్లు క్షణాల్లో మండిపోతున్నాయి. ఇంతకీ వాహనాలు ఎందుకు తగలబడిపోతున్నాయి..? మరి వాహనదారులేం చేయాలి..?

  • Written By:
  • Publish Date - April 23, 2023 / 02:30 PM IST

అక్కడా ఇక్కడా అని లేదు.. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశమంతా.. ఎక్కడో చోట వాహనాలు నడిరోడ్డుపైనే అగ్నికి ఆహుతవుతున్నాయి. ఒక్కసారిగా మంటలు చెలరేగి మాడిమసైపోతున్నాయి. వాహనాల్లో అప్పుడప్పుడు షార్ట్‌సర్క్యూట్ కారణంగా మంటలు రేగడం మామూలే అయినా వేసవిలో మాత్రం అధికం. వేసవిలో వాహనాదారులు చాలా అప్రమత్తంగా ఉండాలి. లేదంటే వాహనం సంగతి దేవుడెరుగు మన ప్రాణాలు రిస్క్‌లో పడతాయి. తెలుగు రాష్ట్రాల్లో గత వారం రోజుల్లోనే దాదాపు 30కి పైగా వాహనాలు ఇలా భానుడి దెబ్బకు బలైపోయాయి.

వాహనదారులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..?

– వాహనాన్ని తప్పసరిగా టైమ్ టు టైమ్ సర్వీసింగ్ చేయించాలి
– వాహనంలోని వైరింగ్ వ్యవస్థ ఎలా ఉందో ఎప్పటికప్పుడు పరిశీలించాలి
– ఇంజన్‌ను చల్లబరిచే ఆయిల్ సరైనది తీసుకోవాలి.. ఆ విషయంలో నిర్లక్ష్యం అసలు వహించకూడదు. ఇంజన్ ఆయిల్, కూలెంట్లు తగ్గిపోతే ఇంజన్ వేడెక్కి దగ్ధమయ్యే అవకాశం ఉంటుంది.
– ఇంజన్ ఆయిల్ ఎక్కడైనా లీకవుతుందేమో పరిశీలించాలి. కొన్ని సందర్భాల్లో అది కూడా ప్రమాదానికి కారణమవుతుంది.
– రేడియేటర్‌లోని నీళ్లను తరచూ చెక్ చేసుకోవాలి
– టైర్లలో తగినంత గాలి లేకపోయినా, టైర్లు అరిగిపోయినా వాహనవేగానికి, ఎండ వేడిమి తోడై మంటలు వ్యాపించే అవకాశం ఉంది
– సెకండ్ హ్యాండ్, చైనా, బటన్ టైర్ల జోలికి వెళ్లకపోవడం ఉత్తమం
– నిర్దేశించిన పరిమితి కంటే టైర్లలో ఎక్కువ గాలి పెట్టించకండి. దానివల్ల ఒత్తిడి మరింత పెరుగుతుంది. అధిక గాలి కూడా ప్రమాదాలకు కారణమని ఇటీవలి సర్వేల్లో తేలింది.
– సాధ్యమైనంత వరకు ఎండలో వాహనాన్ని నిలపకూడదు. ఎండలో జర్నీ చేయకపోవడం మంచిది
– వాహనాన్ని ఎండలోనుంచి బయటకు తీసినప్పుడు ఇంజన్ ఆన్ చేసిన వెంటనే ఏసీ వేయకండి. కాసేపు ఆగిన తర్వాత ఏసీ ఆన్ చేయండి. కాసేపు విండోగ్లాస్ తెరిచి ఉంచితే మంచిది.
– ఎండలో పార్క్ చేసినప్పుడు వాహనాల్లోని రెగ్జిన్, ప్లాస్టిక్ వస్తువులు వేడిని గ్రహిస్తాయి. కాబట్టి వాటిపై ఏదైనా కప్పితే మంచిది.
– అధిక ఉష్ణోగ్రత వల్ల ఎల్‌పీజీ వాహనాల్లోని గ్యాస్ పీడనానికి గురయ్యే ప్రమాదం ఉంటుంది.
– దూరప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. గంటకోసారైనా వాహనాన్ని ఆపి ఇంజన్ చల్లబరచాలి.
– లాంగ్ జర్నీ పెట్టుకున్నప్పుడు ముందు జాగ్రత్తగా ఓసారి మెకానిక్‌తో పూర్తిగా వాహనాన్ని తనిఖీ చేయించాలి…
– హైవేలపై అయినా ఓవర్ స్పీడ్‌తో అసలు వెళ్లకండి. దానివల్ల ఇంజన్‌పై ఒత్తిడి పడుతుంది.
– వాహనంలో ఏసీ, స్టీరియో వంటివి ఏర్పాటు చేసేటప్పుడు సాధ్యమైనంత వరకు బయటి మెకానిక్‌ల దగ్గర చేయించకపోవడం ఉత్తమం. కంపెనీ సర్వీసింగ్ సెంటర్లలోనే చేయించడం మంచిది.
– వేసవిలో ఆయిల్ ఫుల్ ట్యాంక్ చేయించకపోవడమే ఉత్తమం.
– ఈవీలు వాడేవారు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంజన్ వేడిగా ఉన్నప్పుడు సాధ్యమైనంత వరకు ఛార్జింగ్ పెట్టకండి. అలాగే ఛార్జింగ్ పెట్టి కొన్ని గంటల పాటు అలాగే ఉంచేయకండి. ఛార్జ్ కాగానే తీసేయాలి. లేదంటే బ్యాటరీలు పేలిపోతాయి.
– కారులో అనవసర, పేలే గుణం కలిగిన వస్తువులు ఉంచకండి.

ప్రమాద సమయంలో ఏం చేయాలి..?

ఏదైనా అనుకోని ప్రమాదం జరిగినప్పుడు వెంటనే విండో లాక్‌ను ఓపెన్ చేయండి. కారులోని వారు వెంటనే కిందకు దిగేలా చూడండి. వస్తువుల కోసం చూడకండి. పెట్రోల్ ట్యాంక్ పేలే అవకాశాలు కూడా లేకపోలేదు. సాధ్యమైనంత వరకు తగలబడుతున్న వాహనానికి దూరంగా వెళ్లండి. వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించండి.

టూ వీలర్స్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.?

టూ వీలర్స్ విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సేవ్ అయిపోతాం. అటు ఇంధనం, ఇటు వాహనం రెండింటినీ కాపాడుకున్న వారవుతాం. ఎండలో ఎట్టి పరిస్థితుల్లోనూ వాహనాలు నిలపొద్దు. దీనివల్ల ఇంధనం ఆవిరైపోవడమే కాదు రంగు పోతుంది. పైగా టైర్లు పాడైపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. రోజుకు నాలుగు గంటల పాటు ఎండలో పెడితే కనీసం పావులీటర్ పెట్రోల్ ఆవిరైపోతుంది. అంటే నెలకు దాదాపు 8 లీటర్లన్నమాట. అదే ఎక్కువసేపు ఎండలో పెడితే ఎంత నష్టపోతామో ఊహించండి. పైగా బ్రేక్ వైర్లు, హ్యాండిల్ గ్రిప్స్ వంటి ఫైబర్‌తో చేసిన వస్తువులు పాడైపోతుంటాయి. మిట్టమధ్యాహ్నం పూట టూవీలర్‌పై జర్నీ చేయకపోవడమే మంచిది. అలాగే వేసవిలో పెట్రోల్ ట్యాంకులో గ్యాస్ ఏర్పడుతుంది. రోజుకోసారైనా మూతతీసి అది బయటకు వెళ్లేలా జాగ్రత్త పడాలి. టైర్లలోనూ పరిమితికి మించి గాలి పెట్టించకండి.

వేసవిలో సాధ్యమైంత వరకు మధ్యాహ్న సమయంలో దూర ప్రయాణాలు పెట్టుకోకండి. బస్సుల్లో ప్రయాణాలకే ప్రాధాన్యం ఇవ్వండి. తప్పనిసరి అనిపిస్తే మాత్రం అన్ని జాగ్రత్తలు తీసుకునే వాహనాలు తీయండి. ప్రమాదాలకు దూరంగా ఉండండి.