Summer Pot: ఎండాకాలంలో చలువనిచ్చే కుండలు..!

వేసవి వచ్చిందంటే చాలు ప్రతిఒక్కరూ శీతలపానీయాలు తాగేందుకు ఆసక్తి చూపుతారు. అలాగే నీడచాటుకు పరుగులు తీస్తారు. కొందరైతే ఇంట్లో ఫ్రీజర్లను ఏర్పాటు చేసుకుంటారు. ఇక సామాన్య దిగువతరగతి వాళ్లు మంచి నీటిని తాగేందుకు నేటికీ కుండలనే ఉపయోగిస్తారు. ఆరోగ్యం దృష్ట్యా మట్టి కుండల్లోని నీరు చలువ చేస్తాయని కొందరు విశ్వసిస్తారు. అందుకే నేటికీ ఇందులో నీళ్లను నింపుకొని చల్లగా తాగేందుకు మక్కువ చూపుతున్నారు. ఇది చాలా ఏళ్లుగా వంశపారపర్యంగా వస్తున్న కులవృత్తి. ప్రస్తుతం ఈ మట్టి కళ క్రమక్రమంగా అంతరించి పోతోంది. వాటిని ప్రోత్సహించేందుకు కొన్ని ప్రైవేట్ సంస్థలు ముందుకు వస్తున్నప్పటికీ వీరి జీవనవిధానం అగమ్య గోచరంగా ఉందని చెప్పాలి. నీటి కుండలు తయారు చేసే వారి జీవన విధానాన్ని పరిశీలిద్దాం. దశాబ్దాల కాలం నాటి కుల వృత్తులకు నేటికీ గిరాకీ ఉందా.? అప్పటికీ ఇప్పటికీ వచ్చిన మార్పులేంటో తెలుసుకుందాం.

  • Written By:
  • Updated On - March 2, 2023 / 02:29 PM IST

పూర్వం మట్టి కుండల్లోనే అన్నంతో పాటూ పూర్తి వంటను వండేవారు. అలా చేయడం వల్ల ఎక్కవ సమయంపాటూ చెడిపోకుండా నిలువ ఉండేది. ఇక తాగేందుకైతే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మంచి గాలి సోకే ప్రదేశంలో ఇసుకతో చిన్న కుప్పను చేసి వాటి మధ్యలో నల్లని, ఎర్రని రంగుల కుండలను కూర్చోపెట్టి దానికి కాటన్ వస్త్రాన్ని చుట్టేవారు. అలాగే అప్పుడప్పుడూ దానిపై నీళ్లు చల్లుతూ బట్టను తడిచేస్తూ ఉండేవారు. ఇలా చేయడం వల్ల ప్రకృతి గాలికి సహజ సిద్దంగా నీరు చల్లగా మారేది. ప్రస్తుతం గ్యాస్, ఇండక్షన్ స్టౌలు వచ్చి ఇలాంటి చేతి కళాకారుల కంట్లో మట్టి కొట్టిందనే చెప్పాలి.

గత ముప్పై ఏళ్ల క్రితం దీపం పథకం పుణ్యమా అని ప్రారంభమైంది ఈ నవీన శకం. దీంతో ఎటు చూసినా గ్యాస్ వినియోగించే ప్రపంచమే మనకు కనిపిస్తుంది. ఇక వర్తమానానికి వస్తే కరెంటును ఉపయోగించి ఇండక్షన్ స్టౌలను వాడుతున్నారు నేటి తరంలో కొందరు. దీని కారణంగా మట్టి పాత్రలను మట్టిలో కలిపేశారు. అక్కడితో ఆగకుండా చల్లని పదార్థాల కోసం, ఏవైనా ఇంట్లో వండిన వస్తువులు కొంతకాలం నిలువ ఉంచడం కోసం రీఫ్రిజిరేటర్లను ఉపయోగిస్తున్నారు. ఒకప్పుడు చల్లని నీరు కావాలంటే కుండ మూతను తీసేవారు. కానీ ఇప్పుడు అలా చేయడం మానేసి ఫ్రీజర్ డోర్ ఓపెన్ చేస్తున్నారు. దీంతో కుండల వాడకానికి తలుపులు మూసి తాళం వేసినట్లయ్యింది.

వీరికి ఒకప్పుడు చలువ కుండల పేరుతో మంచి డిమాండు ఉండేది. అప్పుడు వీరి జీవన విధానం కూడా చాలా హాయిగా సాగిపోతూ ఉండేది. వంశపారపర్యంగా దీనిని ప్రోత్సహిస్తూ చిన్న తరహా కుటీర పరిశ్రమలుగా నడిపేవారు. కానీ ప్రస్తుతం సాంకేతికత పెరిగి వీరి కడుపు కొడుతోందని చెప్పాలి. వీరి కుటుంబం నుంచి భవిష‌్యత్తు తరాన్ని ఇందులోకి తీసుకురావడం లేదు. దీనికి కారణం అందరూ ఇలా ఎలక్ట్రిక్ వస్తువులపై ఎక్కవ శ్రద్ద కనబరచడం. ఎక్కడైనా అవకాశాలు పుష్కలంగా ఉంటేనే వాటి స్థాయి పదిలంగా ఉంటుంది. అలా కాకుండా నూతనత్వాన్ని ఆస్వాదించి పాతదనాన్ని మరిచి పోతే దీని ప్రభావం కుల వృత్తులను నమ్ముకొని జీవనం సాగిస్తున్నవారి మీద తప్పకుండా ఉంటుంది.

ప్రస్తుతం మట్టి పాత్రలను ఏవైనా పూజాది కార్యక్రమాలకు, వేసవి వస్తే చలివేంద్రాల ఏర్పాటు కోసం, దీపావళి పండుగకు దీపం ప్రమిదెలను తయారు చేసేటువంటి హీన స్థితికి వీరి జీవనం దిగజారిపోయింది. కనుకనే నవీనతను స్వాగతిస్తూనే ఇలాంటి వారికి ప్రోత్సహిస్తే రెండూ సమానంగా సాగిపోతూ ఉంటుంది. నేటి సమాజంలో ఒక కుండను రూ.100 నుంచి రూ.250 వరకూ అమ్ముతున్నారు. మనం చేసే రోజూవారి ఖర్చులో రూ.250 అనేది పెద్ద విషయం కాదు. పైగా రోజంతా కష్టపడితే ఒక కుమ్మరి 200 కుండలను తయారు చేస్తాడు. అదే యంత్రాల ద్వారా అయితే 350 వరకూ తయారు చేయగలడు. ఇదే వీరికి రోజూ వారి వృత్తి. దీనిని నమ్ముకునే ఇన్నళ్లుగా కాలాన్ని నెట్టుకొచ్చారు. వీరు కనుమరుగైతే భవిష్యత్తులో వ్రతాలకు, పూజలకు, దీపాలకు ఇలా అన్నింటికీ ఉపయోగించే వస్తువుల కోసం ప్రత్యమ్నాయంగా కార్పోరేట్ సంస్థల మీద ఆధారపడి బ్రతకవలసి వస్తుంది. దీనికి ప్రత్యక్ష ఉదాహరణగా నేడు మనం వాడుతున్న సెల్ ఫోన్ నెట్వర్క్ కంపెనీలే అని చెప్పాలి. అందుకే ఒక్కసారి ఆలోచించండి. స్థోమతను బట్టీ ఏదో ఒక కుండను ఎక్కవ శాతం మంది ఉపయోగించడం ద్వారా వీరి బ్రతుకులు మెరుగుపడతాయి. కులవృత్తులకు జీవం పోసినవాళ్ళవుతాం.

 

 

T.V.SRIKAR