ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్‌లో చిక్కుకున్న సునితా విలియమ్స్ భూమి మీదకు ఎప్పుడు వస్తారు అన్న విషయంలో ఎట్టకేలకు ఓ క్లారిటీ వచ్చింది. వచ్చే ఏడాది.. అంటే 2025 ఫిబ్రవరిలో సునితా విలియమ్స్, బుచ్ విల్మోర్ భూమి మీదకు తిరిగి రానున్నారు. వీళ్లను బోయింగ్ స్టార్‌లైనర్ క్యాప్యూల్‌లోనే భూమి మీదకు తిరిగి తీసుకురావాలని మొదట అనుకున్నారు. ఇది సురక్షితం కాదని నాసా తేల్చిచెప్పింది. వారిని అందులో వెనక్కు తీసుకురావడం అత్యంత ప్రమాదకరమని పేర్కొంది. ఆ రిస్క్ తీసుకోడానికి నాసా సిద్ధంగా లేదని ప్రకటించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్ షటిల్ డ్రాగన్ క్యాప్సూల్‌లో వారిని తీసుకురావాలని నిర్ణయించింది. వారం రోజుల పరిశోధనల నిమిత్తం సునితా విలియమ్స్, బుచ్‌విల్మోర్ జూన్‌లో అంతరిక్షంలోకి వెళ్లారు. కానీ క్యాప్సుల్‌లోని థ్రస్టర్లు మొరాయించడం, హీలియం లీకేజీ సమస్యలు తలెత్తాయి. దీంతో ఇద్దరు నాసా ఆస్ట్రోనాట్స్ అక్కడే చిక్కుకుపోయారు. స్టార్‌లైనర్‌కు మరమ్మత్తులు చేసేందుకు బోయింగ్ ఇంజనీర్లతో కలిసి నాసా చాలా ప్రయత్నాలు చేసింది. కానీ ఎలాంటి ఫలితం లేదు. దీంతో మానవసహిత తిరుగు ప్రయత్నానికి స్టార్‌లైనర్ సురక్షితం కాదని తేల్చింది. ఒకటి రెండు వారాల్లో ఇది స్పేస్ నుంచి ఆటోపైలట్ మోడ్‌లో భూమి మీదకు రానుంది. ఇదే కాకుండా రష్యాకు చెందిన సోయుజ్ క్యాప్యుల్ కూడా స్పేస్‌లోనే ఉంది. కానీ అందులో ముగ్గురికి మాత్రమే ప్లేస్ ఉంది. అదే కాకుండా స్పేస్‌ఎక్స్ డ్రాగన్ క్యాప్సుల్ కూడా ఐఎస్ఎస్‌లోనే ఉంది. కానీ ఇప్పటికే అందులో నలుగురు ఆస్ట్రోనాట్స్ ఉన్నారు. అత్యవసరం ఐతే తప్ప అందులో మరో ఇద్దరిని ఇరికించడం కష్టమే. దీంతో ఎలా చూసినా సునితా విలియమ్స్, బుచ్ విల్మోర్ ఇప్పట్లో భూమి మీదకు వచ్చే అవకాశాలు మాత్రం కనిపించడంలేదు. స్పేస్ డ్రాగన్ సెప్టెంబర్‌లో ఇద్దరు ఆస్ట్రోనాట్స్‌తో ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్‌కు వెళ్తుంది. తిరుగు ప్రయాణంలో సునితా, విల్మోర్‌లను కూడా తిరిగి తీసుకురానుంది.