Supreme Court: కోర్టుల్లో బూతులకు చెక్.. నవ భారతానికి దారిచూపిన సుప్రీంకోర్టు

న్యాయస్థానాల్లో విచారణలు, వాదనలు, తీర్పుల్లో స్త్రీలను కించపరిచే పదాలను వినియోగించకుండా ఉండాలని జడ్జీలకు దిశా నిర్దేశం చేసేందుకు 30 పేజీల హ్యాండ్‌బుక్‌ను విడుదల చేసింది. "హ్యాండ్​ బుక్ ఆన్ కంబాటింగ్ జెండర్ స్టీరియోటైప్స్" అనే టైటిల్ కలిగిన ఈ హ్యాండ్‌బుక్‌ సుప్రీంకోర్టు వెబ్​సైట్​లో అందుబాటులో ఉంది.

  • Written By:
  • Publish Date - August 17, 2023 / 03:07 PM IST

Supreme Court: ప్రకృతిని మనం స్త్రీ స్వరూపంగా భావిస్తాం. ప్రకృతిమాతను చెట్లు, పుట్టలు, కొండల్లోనూ చూస్తాం. కొలుస్తాం. స్త్రీ రూపంలోని దేవతా మూర్తులను ఎల్లవేళలా ఆరాధిస్తాం. కానీ సమాజంలో స్త్రీలను గౌరవించే విషయానికి వచ్చే సరికి మన ఆలోచన దృక్పథం మారిపోతుంటుంది. మగ పిల్లలు పుడితే సంతోషిస్తూ.. ఆడపిల్లలు పుడితే బాధపడుతుంటారు కొందరు. పని ప్రదేశాల్లో, ఆఫీసుల్లో మహిళలను చిన్నచూపు చూసే ట్రెండ్ ఇంకా కొనసాగుతోంది. అన్ని రంగాల సంస్థలకు మహిళల పని సామర్థ్యం తక్కువనే బ్యాడ్ ఒపీనియన్ ఉంది.

పైకి భక్తి.. లోపల కుయుక్తి అన్నట్టుగా సాగుతున్న భారత సమాజానికి మార్గదర్శనం చేసే దిశగా సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ముందడుగు వేసింది. న్యాయస్థానాల్లో విచారణలు, వాదనలు, తీర్పుల్లో స్త్రీలను కించపరిచే పదాలను వినియోగించకుండా ఉండాలని జడ్జీలకు దిశా నిర్దేశం చేసేందుకు 30 పేజీల హ్యాండ్‌బుక్‌ను విడుదల చేసింది. “హ్యాండ్​ బుక్ ఆన్ కంబాటింగ్ జెండర్ స్టీరియోటైప్స్” అనే టైటిల్ కలిగిన ఈ హ్యాండ్‌బుక్‌ సుప్రీంకోర్టు వెబ్​సైట్​లో అందుబాటులో ఉంది. మహిళలను కించపరిచేలా న్యాయ వ్యవహారాల్లో ప్రస్తుతం వాడుతున్న అసభ్య పదాల స్థానంలో వినియోగించాల్సిన ప్రత్యామ్నాయ పదాలను ఆ హ్యాండ్‌బుక్‌‌లో చక్కగా సూచించారు. గతంలో దేశంలోని వివిధ కోర్టులు ఇచ్చిన తీర్పులలోని అసభ్య పదాలను కూడగట్టి ఈ బుక్‌లెట్ రూపొందించారు. ఆ పదాలను మీరు చూస్తే నోరెళ్ల బెడతారు. కోర్టు కేసులకు సంబంధించిన లీగల్ డాక్యుమెంట్స్‌లో, పిటిషన్స్‌లో, తీర్పు కాపీల్లో ఇలాంటి అసభ్య పదాలను వాడేవారా..? అని ఆశ్చర్యపోతారు.
మహిళా సంఘాలూ మేల్కోండి
మహిళల గౌరవాన్ని నిలబెట్టాలా.. మహిళల ఆత్మ గౌరవాన్ని కాపాడేలా.. లింగ వివక్షకు తావు లేకుండా చేసేందుకు సుప్రీంకోర్టు చేసిన ఈ కృషి అన్ని రంగాలకు అప్లై చేస్తే ఇంకా బాగుంటుంది. ఒక్క సిరాచుక్క వెయ్యి మెదళ్లకు కదలిక సృష్టించగలదని అంటారు. అదే నిజమైతే.. బూతులకు గుడ్ బై చెప్పేందుకు సుప్రీంకోర్టు రిలీజ్ చేసిన హ్యాండ్ బుక్‌లోని ప్రతీ పదం కూడా దేశంలోని అన్ని రంగాలకు స్ఫూర్తిని పంచాలి. అందులోని బూతు పదాలను తమతమ రంగాల్లో వాడబోమని ప్రైవేటు సంస్థలు, కార్పొరేట్ సంస్థలు, వాటితో ముడిపడిన సంఘాలు తీర్మానాలు చేయాలి. ఈ దిశగా వాటిపై మహిళా సంఘాలు ఒత్తిడి పెంచాలి. ఆయా సంఘాలు, సంస్థలను కలిసి విజ్ఞాపనలు సమర్పించాలి. ప్రయత్నం లేనిది ఫలితం రాదు. మహిళా జనోద్ధరణ జరగాలంటే.. మహిళా సంఘాలు తమ నిజమైన చొరవను, పోరాట స్ఫూర్తిని ఇలాంటి విషయాల్లో చూపించాలి.
ఇలాంటి పదాలు ఉండవు
వేశ్య, వ్యభిచారిణి, ప్రాస్టిట్యూట్, వోర్, హుకర్ అనే పదాలకు బదులుగా “సెక్స్ ​వర్కర్” అనే పదాన్ని వాడాలని సుప్రీంకోర్టు రిలీజ్ చేసిన హ్యాండ్ బుక్‌లో సూచించారు. ఉంపుడుగత్తె అనే అర్థంలో వాడిన కీప్, కాంక్యుబైన్ బదులుగా విమెన్ విత్ సెక్సువల్ రిలేషన్స్ అవుట్​సైడ్ ఆఫ్ మ్యారేజ్‌గా పేర్కొనాలని తెలిపారు. ఉంపుడుగత్తె సంతానమని చెప్పేందుకు వాడుతున్న బాస్టర్డ్ అనే పదానికి బదులుగా నాన్ మ్యారిటల్ చైల్డ్ అని తెలపాలి. హౌస్ ​వైఫ్​ను హోమ్​మేకర్ అని పిలవాలి. మిస్ట్రెస్​ను విమెన్ అని సంబోధించాల్సి ఉంటుంది. కెరీర్​ విమెన్​ను.. విమెన్ (మహిళ) అని పిలిస్తే సరిపోతుంది. ఈవ్ ​టీజింగ్​ను ఇక మీదట స్ట్రీట్ సెక్సువల్ హరాజ్​మెంట్​గా పేర్కొనాల్సి ఉంటుంది. స్పిన్​స్టర్ (కన్య) అనడం కంటే అన్​మ్యారీడ్ విమెన్ అనడం సముచితం అని సుప్రీంకోర్టు హ్యాండ్​బుక్ పేర్కొంది. ఇలా పలు పదాల స్థానంలో కొత్తవాటిని ఉచ్చరించాలని, కోర్టు ఆదేశాల్లో వాడాలని, తీర్పుల్లో రాయాలని అందులో సూచించారు.