అమెరికాలోని (America) ఓ కాలేజీలో అడ్మిషన్ (Admission) దొరకడం కష్టం… అలాంటిది పది కాలేజీల్లో దొరికితే గ్రేట్… మరి ఏకంగా 170కి పైగా కాలేజీల్లో (170 Colleges) అడ్మిషన్ దొరకాలంటే… అసాధ్యం అని మాత్రం అనకండి. ఓ లూసియానా (Louisiana) కుర్రాడు 170కి పైగా కాలేజీల్లో అడ్మిషన్ సాధించి అసాధ్యుడు అనిపించుకున్నాడు. ఇది గిన్నిస్ రికార్డ్ (Guinness Record) అంటున్నారు. అంతేనా 73కోట్ల రూపాయలకు పైగా విలువైన స్కాలర్‌షిప్ (Scholership) ఆఫర్లు కూడా పొందాడు.
ఏదైనా తక్కువుంటే ఎవరికైనా సమస్య… కానీ అమెరికా లూసియానాకు చెందిన డెన్నిస్ మాలిక్ బార్న్స్‌కు (Dennis Maliq Barnes) ఇప్పుడు ఎక్కువే సమస్య అయ్యింది. 16 ఏళ్ల ఈ కుర్రాడు ఇప్పుడు ఏ కాలేజీలో చదవాలో తెలియక తలపట్టుకుంటున్నాడు. అంటే అడ్మిషన్లు రాకకాదు. దేన్ని ఎంచుకోవాలో తెలియనన్ని అడ్మిషన్లు సంపాదించాడు. ఆ ఎక్కువే ఇప్పుడు సమస్యై కూర్చుంది. బార్న్స్ వయసు కేవలం 16ఏళ్లే… కానీ రెండేళ్ల ముందే న్యూఆర్లాన్స్ ఇంటర్నేషనల్ హైస్కూల్‌లో (New Orleans International School) గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాడు. ఇందుకోసం స్పెషల్ పర్మిషన్ కూడా తీసుకోవాల్సి వచ్చింది. స్కూలింగ్ పూర్తికాగానే కాలేజీలకు అప్లయ్ చేయడం ప్రారంభించాడు. మంచి కంటెంట్ ఉన్న కుర్రాడు కదా… కాలేజీలు ఎలా వదిలిపెడతాయి. ఇలా అప్లయ్ చేయగానే రా రామ్మంటూ ఆహ్వానాలు మొదలయ్యాయి. అప్లయ్ చేసిన అన్ని కాలేజీలు బార్న్స్‌కు వెల్‌కమ్ చెప్పాయి. ఇలా అప్లయ్ చేయడం ఆలస్యం వచ్చేయ్ అంటూ రిటర్న్ మెయిల్స్ రావడం ప్రారంభించాయి. కొన్ని కాలేజీలు అయితే స్కాలర్‌షిప్ ఇవ్వడానికి కూడా ఓకే అన్నాయి. 9 మిలియన్ డాలర్ల విలువైన స్కాలర్‌షిప్స్ ఖరారయ్యాయి. మన కరెన్సీలో చెప్పాలంటే 73కోట్ల 50లక్షలకు పైనే..
గ్రాడ్యుయేషన్‌లో బార్న్స్ 4.98 జీపీఏ సాధించాడు. ఇన్ని కాలేజీల్లో అడ్మిషన్ సాధించినా అతను ఇప్పటివరకు ఏ కాలేజీలో చేరాలన్నది డిసైడ్ కాలేదు. మే24కి అతడి గ్రాడ్యుయేషన్ పూర్తవుతుంది. మే మొదటివారంలో ఏ కాలేజీలో చేరాలన్నది అతడు ప్రకటించనున్నాడు. ముందు కంప్యూటర్ సైన్స్ చదివి ఆ తర్వాత లా చేయాలన్నది బార్న్స్ కోరిక. మొదట రికార్డు కోసం బార్న్స్ కాలేజీలకు అప్లయ్ చేయలేదు. ముందు మాములుగానే అడ్మిషన్ ప్రాసెస్ ప్రారంభించాడు. మరో మంచి కాలేజీ మరో మంచి కాలేజీ అంటూ ముందుకెళ్లాడు. ఓ దశకు చేరాక కానీ రికార్డుకు చేరువైనట్లు గుర్తించలేదు. దాంతో రికార్డు కోసం ప్రయత్నించాడు. చివరికి గిన్నీస్ తలపు తట్టాడు. స్కూల్ సిబ్బంది గిన్నిస్ బుక్‌ను సంప్రదించారు. వారి దగ్గర నుంచి స్పష్టత రావాల్సి ఉంది.
ఇంత సాధించినా ఈ క్రెడిట్ అంతా తన ఫ్యామిలీదే అంటున్నాడు బార్న్స్. వారి ప్రోత్సాహం లేకపోతే ఇంత వరకూ రాలేనంటున్నాడు. స్నేహితులు కూడా బాగా సాయం చేశారంటున్నాడు. బార్న్స్‌కు దేవుడిపై నమ్మకం ఎక్కువ. చదువుకు ప్రాధాన్యం ఇచ్చి, దేవుడిపై నమ్మకం ఉంచితే ఏమైనా సాధించొచ్చని వినయంగా చెబుతున్నాడు. అలాంటి వారికి విజయం దానంతట అదే వస్తుందని నమ్ముతాడు బార్న్స్.