Telangana Bonalu: బోనాల పండుగకు ఏర్పాట్లు.. జూన్ 22న గోల్కొండలో తొలి బోనం

హైదరాబాద్ నగరంలో జూన్ 22 నుంచి బోనాల పండుగ ప్రారంభం కానుంది. గోల్కొండ కోటలోని ఎల్లమ్మకు తొలి బోనం తీయడంతో బోనాల పండుగ ప్రారంభమవుతుంది. నగరంలో నెల రోజులపాటు బోనాల పండుగ జరుగుతుంది.

  • Written By:
  • Publish Date - May 26, 2023 / 06:52 PM IST

Telangana Bonalu: తెలంగాణలో ఘనంగా జరిగే ఆషాఢ బోనాల పండుగకు ముహూర్తం ఖరారైంది. హైదరాబాద్ నగరంలో జూన్ 22 నుంచి బోనాల పండుగ ప్రారంభం కానుంది. గోల్కొండ కోటలోని ఎల్లమ్మకు తొలి బోనం తీయడంతో బోనాల పండుగ ప్రారంభమవుతుంది. నగరంలో నెల రోజులపాటు బోనాల పండుగ జరుగుతుంది. ఈ పండుగకు సంబంధించి ప్రభుత్వ ఏర్పాట్లపై మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ బేగంపేటలోని హరిత ప్లాజాలో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి జీహెచ్ఎంసీ అధికారులు, పోలీసు ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు.

సంప్రదాయం ప్రకారం.. జూన్ 22న గోల్కొండ కోటలో ఆషాఢ బోనాలు ప్రారంభమవుతాయి. జూలై 9న సికింద్రాబాద్ మహంకాళి బోనాలు జరుగుతాయి. అనంతరం మరుసటి రోజు.. అంటే జూలై 10న రంగం నిర్వహిస్తారు. జూలై 16న పాతబస్తీలో బోనాలు, 17న ఉమ్మడి దేవాలయాల ఆధ్వర్యంలో వేడుకలు జరుగుతాయి. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఇక్కడి సంస్కృతికి ప్రతీకగా నిలిచే బోనాల విశిష్టతను ప్రభుత్వం ప్రపంచానికి చాటేలా చేసిందన్నారు. బోనాల ఉత్సవాల్ని ఘనంగా నిర్వహిస్తామన్నారు. ఈ సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత నుంచి బోనాల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.

ప్రభుత్వం కూడా వీటిని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. తెలంగాణలో బోనాలకు ప్రత్యేక స్థానం ఉంది. ప్రతి ఏటా రాష్ట్రవ్యాప్తంగా బోనాలను ఘనంగా నిర్వహిస్తారు. తమను కాపాడాలి అని కోరుకుంటూ పోచమ్మ, ఎల్లమ్మ వంటి దేవతలను పూజిస్తారు. గ్రామ దేవతలను ఈ వేడుకల్లో ప్రత్యేకంగా కొలుస్తారు. దేవతలకు బోనం సమర్పించి మొక్కులు చెల్లిస్తుంటారు. హైదరాబాద్ నగరంలో లష్కర్ బోనాలు చాలా ప్రత్యేకమైనవి. ఈ ఉత్సవాల సందర్భంగా మహిళలు బోనం ఎత్తుకుంటారు. శివసత్తుల పూనకాలు, రంగం, పోతురాజుల నృత్యాలు, దేవతలు, రాక్షసులు, విచిత్ర వేషధారణల మధ్య బోనాలు ఘనంగా జరుగుతాయి. బోనాలు ఒక పండుగను తలపిస్తాయి.