Telangana Martyrs Memorial: తెలంగాణ అమరుల త్యాగాల ప్రతీక.. అమరవీరుల స్మారక చిహ్నం సిద్ధం..!

తెలంగాణ దశాబ్ది ఉత్సవాల చివరి రోజు సందర్భంగా ఈ స్మారక చిహ్నాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించబోతున్నారు. హైదరాబాద్, హుస్సేన్ సాగర్ తీరాన.. వెలుగుతున్న దీపంలా కనిపించే ఈ స్మారక చిహ్నానికి అనేక ప్రత్యేకతలున్నాయి. ప్రారంభోత్సవం సందర్భంగా స్మారక చిహ్నం విశేషాలు కొన్ని.

  • Written By:
  • Publish Date - June 21, 2023 / 02:32 PM IST

Telangana Martyrs Memorial: తెలంగాణ ఉద్యమంలో అమరులైన వారి త్యాగాలకు గుర్తుగా ప్రభుత్వం నిర్మించిన అమరవీరుల స్మారక చిహ్నం గురువారం (జూన్ 22) ప్రారంభం కానుంది. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల చివరి రోజు సందర్భంగా ఈ స్మారక చిహ్నాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించబోతున్నారు. హైదరాబాద్, హుస్సేన్ సాగర్ తీరాన.. వెలుగుతున్న దీపంలా కనిపించే ఈ స్మారక చిహ్నానికి అనేక ప్రత్యేకతలున్నాయి. ప్రారంభోత్సవం సందర్భంగా స్మారక చిహ్నం విశేషాలు కొన్ని.
తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమంలో వందలాది మంది ప్రాణాలుకోల్పోయారు. నాటి అమరులను స్మరించుకుంటూ, వారి త్యాగాలను భావితరాలకు అందించే ఉద్దేశంతో కేసీఆర్ ప్రభుత్వం ఈ స్మారక చిహ్నం నిర్మాణం ప్రారంభించింది. దీనికోసం జ్వలించే జ్యోతి డిజైన్‌ను కేసీఆర్ ఎంపిక చేశారు. హుస్సేన్ సాగర్ తీరాన టిఆర్ఎస్ పార్టీ పురుడు పోసుకున్న ప్రదేశంలోనే ఈ స్థూపాన్ని నిర్మించారు. గతంలో ఇక్కడ జలదృశ్యం ఉండేది. ఇదే ప్రాంతంలో అమరవీరుల స్మారక చిహ్నాన్ని నిర్మించారు. 2017 జూన్‌లో దీని నిర్మాణానికి కేసీఆర్ శంకుస్థాపన చేశారు. దుబాయ్‌ ‘మ్యూజియం ఆఫ్‌ ది ఫ్యూచర్‌’ను నిర్మించిన సంస్థతో సంప్రదింపులు జరిపి దీని నిర్మాణం చేపట్టారు. కేపీసీ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ సంస్థ దీన్ని నిర్మించింది. మొత్తం రూ.178 కోట్లతో నిర్మాణం పూర్తైంది.
అతుకులు లేని స్టెయిన్‌లెస్ స్టీల్
అమరవీరుల స్మారక చిహ్మాన్ని 3.29 ఎకరాల్లో (13,317చదరపు మీటర్లు) నిర్మించారు. నిర్మాణ వైశాల్యం 26,800 చదరపు మీటర్లు. స్మారక చిహ్నం మొత్తం ఎత్తు 54 మీటర్లు కాగా, దీపం ఎత్తు 26 మీటర్లు. మొత్తం ఆరు అంతస్థుల్లో నిర్మించారు. ఇందులో రెండు అంతస్థులు సెల్లార్లు. దీపాన్ని పోలినట్లుగా ఉండే దీని నిర్మాణం కోసం స్టెయిన్‌లెస్ స్టీల్ వాడారు. 161 అడుగుల ఎత్తు, 158 అడుగుల వెడల్పుతో ఇది ఉంటుంది. ఈ స్టీల్ మొత్తం ఎలాంటి అతుకులు లేకుండా ఉంటుంది. అతుకులు లేకుండా చేపట్టిన ప్రపంచపు అతిపెద్ద స్టెయిన్‌లెస్ స్టీల్ నిర్మాణం ఇదే. ఈ చిహ్నం స్టెయిన్‌లెస్ స్టీల్‌తో నిర్మితమైనప్పటికీ లోపల ఎలాంటి వేడి ఉండకుండా ప్రత్యేకంగా నిర్మించారు. దీని నిర్మాణం కోసం 3000 స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ ప్లేట్లను వాడారు. వీటి బరువు సుమారు 100 టన్నులు ఉంటుంది. దుబాయ్ నుంచి ప్రత్యేకంగా వీటిని తయారు చేయించి తీసుకొచ్చారు. లోపలి నిర్మాణాలకు 1200 టన్నుల స్టీల్ వాడారు.
లోపల థియేటర్.. మ్యూజియం
బయటి నుంచి చూడడానికి దీపంలాగా ఉండే ఈ చిహ్నం లోపల కూడా ఎన్నో ప్రత్యేకతలు కలిగి ఉంది. ఇది ఆరు అంతస్థులు కలిగి ఉండగా.. అందులో ఒక మ్యూజియం ఉంది. ఇందులో తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన ఫొటోలు ఉంటాయి. అమరవీరుల ఫొటోలను ఇక్కడ చూడొచ్చు. అలాగే వంద మంది కూర్చునే ఒక థియేటర్‌ను కూడా ఏర్పాటు చేశారు. ఉద్యమానికి సంబంధించి 25 నిమిషాల వీడియోను థియేటర్లో ప్రదర్శిస్తారు. 650 మంది కూర్చునే విధంగా ఒక కన్వెన్షన్‌ సెంటర్‌, పర్యాటకుల కోసం ఓ రెస్టారెంట్‌, ఇతర సౌకర్యాలు ఉన్నాయి. 350 కార్లు, 600 బైకులకు సరిపడా పార్కింగ్‌ సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేశారు.
ఏ ఫ్లోర్‌లో ఏముంది..?
ఆరు అంతస్థుల్లో రెండు సెల్లార్లు ఉన్నాయి. సెల్లార్ 1, 2 లను పార్కింగ్ కోసం కేటాయించారు. సెల్లార్-1లో 160 ఫోర్ వీలర్లు, 200 వీలర్లు పార్కింగ్ చేయొచ్చు. సెల్లార్-2లో 175 ఫోర్ వీలర్లు, 200 టూ వీలర్లు పార్కింగ్ చేయొచ్చు. అలాగే ఇక్కడ లాంజ్, లిఫ్ట్, 3 లక్షల లీటర్ల సంప్, సెక్యూరిటీ రూమ్స్ ఉన్నాయి. తర్వాత గ్రౌండ్ ఫ్లోర్‌ను సిబ్బంది అవసరాలు, నిర్వహణ కోసం కేటాయించారు. మెయింటెనెన్స్ రూములు, చిల్లర్ ప్లాంట్, ఎగ్జిబిషన్ ఏరియా, స్టోర్ రూమ్స్, కిచెన్, కోల్డ్ స్టోరేజ్ వంటివి ఉంటాయి. మొదటి ఫ్లోర్‌లో మ్యూజియం, ఫొటో గ్యాలరీ, థియేటర్, లాబీ ఏరియా ఉన్నాయి. రెండో ఫ్లోర్‌లో 500 మంది కూర్చోవడానికి వీలున్న కన్వన్షన్ హాల్, లాబీ ఏరియా, మూడో ఫ్లోర్‌లో రెస్టారెంట్, ఓపెన్ టెర్రస్ సిట్టింగ్ ఏరియా, చివరిదైన మెజనైన్ ఫ్లోర్‌లో గ్లాస్ రూఫ‌ రెస్టారెంట్, ఓవర్ హెడ్ ట్యాంక్ ఉన్నాయి. కార్బన్ స్టీల్‌తో నిర్మించిన దీపం బంగారు-పసుపు రంగులో మెరుస్తుంది. ఈ దీపానికి అమర్చిన లైట్లు మిరుమిట్లుగొలిపేలా ఆకర్షిస్తున్నాయి. సెల్లార్-2 నుంచి నాలుగో అంతస్థుకు వెళ్లేందుకు మూడు లిఫ్టులను ఏర్పాటు చేశారు.
సీఎం కేసీఆర్ చేతులమీదుగా ప్రారంభం
అమరవీరుల స్మారక చిహ్నాన్ని సీఎం కేసీఆర్ గురువారం సాయంత్రం ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. అమరవీరుడు శ్రీకాంతాచారి తల్లికి ఈ కార్యక్రమానికి ఆహ్వానం అందింది. గురువారం సాయంత్రం ఐదు గంటలకు అంబేద్కర్ విగ్రహం నుంచి స్మారక చిహ్నం వరకు ఆరు వేల మంది కళాకారులతో ప్రదర్శన ఉంటుంది. సాయంత్రం ఆరున్నర గంటలకు కేసీఆర్ స్మారక ప్రాంగణానికి చేరుకుంటారు. సీఎం కేసీఆర్ సమక్షంలో పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపి అమరవీరులకు గౌరవ వందనం సమర్పిస్తారు. అనంతరం తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ జరుపుతారు. తర్వాత స్మారక చిహ్నమైన అమరజ్యోతిని ప్రారంభిస్తారు. అనంతరం సభావేదికపైకి చేరుకుని ప్రసంగిస్తారు. సభలో దేశపతి శ్రీనివాస్ గీతాలాపన ఉంటుంది. ఆరుగురు అమరవీరుల కుటుంబాలకు సన్మానం చేస్తారు. రాత్రి పూట 8000 డ్రోన్లతో షో ఉంటుంది. లేజర్ షో ద్వారా స్మారక చిహ్నంపై జోహార్ అనే అక్షరాలు ప్రదర్శిస్తారు.