Telangana Secretariat: రాజప్రాసాదంలాంటి సచివాలయం సరే.. సామాన్యులకు ఎంట్రీ ఉంటుందా? వీఐపీలకే పట్టం కడుతుందా?

తక్కువ సమయంలోనే నిర్మించామని, ఇంద్రభవనాన్ని మరిపిస్తుందని ప్రచారం చేసుకుంటోంది. అయితే, ఈ సచివాలయం వల్ల సామాన్యులకు ఒరిగేదేంటి? గొప్ప సచివాలయం కట్టారు సరే.. సామాన్యుడిని ఇక్కడికి అనుమతిస్తారా?

  • Written By:
  • Publish Date - April 30, 2023 / 01:58 PM IST

Telangana Secretariat: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన నూతన సచివాలయం ఆదివారం ప్రారంభమైంది. సచివాలయం వేదికగా రాష్ట్ర పాలన మొదలవ్వబోతుంది. ఇకపై అన్ని రాష్ట్రస్థాయి విభాగాలు ఇక్కడి నుంచే పనిచేయబోతున్నాయి. ఈ సచివాలయం లాంటిది దేశంలోనే మరోటి లేదని.. అత్యంత అధునాతనంగా నిర్మించామని ప్రభుత్వం గొప్పలు చెప్పుకొంటుంది. తక్కువ సమయంలోనే నిర్మించామని, ఇంద్రభవనాన్ని మరిపిస్తుందని ప్రచారం చేసుకుంటోంది. అయితే, ఈ సచివాలయం వల్ల సామాన్యులకు ఒరిగేదేంటి? గొప్ప సచివాలయం కట్టారు సరే.. సామాన్యుడిని ఇక్కడికి అనుమతిస్తారా? ప్రజలు తమ గోడు వెళ్లబుచ్చుకునేందుకు అవకాశం ఉంటుందా? వారి సమస్యలు ఇక్కడ పరిష్కారమవుతాయా? లేదా కాంట్రాక్టర్లు, లాబీయిస్టులు, వీఐపీలకు మాత్రమే రెడ్ కార్పెట్ వేస్తారా?
తెలంగాణ పాలన సాగేది మొత్తం ఈ సచివాలయం నుంచే. అన్ని శాఖలు ఇక్కడే పని చేస్తాయి. సీఎంతోసహా, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, మంత్రులు, ఇతర ఉన్నతాధికారులు ఇక్కడే పనిచేస్తారు. రాష్ట్రానికి ఏం కావాలన్నా ఇక్కడి నుంచే అనుమతులు లభిస్తాయి. ఈ బిల్డింగే రాష్ట్రంలోని ప్రజా సమస్యలను చర్చించేందుకు, పరిష్కరించేందుకు వేదిక. ఇక్కడి నుంచే ప్రతి ఒక్క పౌరుడి ప్రగతి జరుగుతుంది. ఇది ప్రజలందరిదీ. అయితే, ఈ సచివాలయం పనితీరు ఎలా ఉంటుంది అన్నదే ఇప్పుడు చాలామందికి డౌట్. ఇది ప్రజలకు అందుబాటులోకి వస్తుందా? వ్యక్తిగత సమస్యల పరిష్కారానికి వేదిక అవుతుందా? గతంలో ఉన్న పద్ధతిని కొనసాగిస్తారా? అనే సందేహాలు సామాన్యుల్లో వ్యక్తమవుతున్నాయి.
సామాన్యుడి ఆశలు నెరవేరేనా?
ప్రజలకు అనేక సమస్యలుంటాయి. వాటి పరిష్కారం కోసం స్థానిక సర్పంచుల దగ్గరి నుంచి ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికారుల చుట్టూ తిరుగుతుంటారు. అయినా చాలా వరకు పరిష్కారం కావు. పైగా కొన్ని వారి పరిధిలో ఉండవు కూడా. ఇలాంటప్పుడు సీఎంనో, మంత్రినో, పెద్ద స్థాయి అధికారులనో కలిస్తే తమ పని జరుగుతుందని ఆశిస్తారు. ఇందుకోసం చాలా మంది సచివాలయం దగ్గర పడిగాపులు కాస్తారు. సంబంధిత మంత్రులు, అధికారుల్ని కలిసేందుకు ప్రయత్నిస్తారు. వాళ్లు వచ్చినప్పుడు, వెళ్లేటప్పుడు కనబడితే పిలుస్తారేమే అని.. అక్కడ ఎదురుచూస్తే ఏదో ఒక టైంలో అవకాశం వస్తుందేమోనని భావిస్తారు. చేతిలో తమ సమస్యలతో కూడిన వినతి పత్రాలు, సంబంధిత డాక్యుమెంట్స్ వంటివి పట్టుకుని ఎదురు చూస్తుంటారు. గతంలో ఈ పద్ధతిలో అనేక మంది సమస్యలు పరిష్కారమయ్యేవి. ఇప్పుడు కూడా అదే జరుగుతుందేమోనని సామాన్యుడి ఆశ.
వారానికో రోజు కేటాయిస్తారా?
ఇలాంటి సమస్యలు ఉన్న ప్రజల నుంచి వినతిపత్రాలు తీసుకునేందుకు, వారి బాధలు తెలుసుకునేందుకు గతంలో ఒక రోజు కేటాయించేవాళ్లు. వైఎస్ సీఎంగా ఉన్న సమయంలో సచివాలయం నుంచి వెళ్తూ పక్కన వినతిపత్రాలతో కనిపించిన వారి సమస్యలు తెలుసుకుని, వాటి పరిష్కార బాధ్యతలను అధికారులు, మంత్రులకు అప్పగించేవాళ్లు. పలువురు సీఎంలు, మంత్రులు కూడా ఇలాగే స్పందించేవాళ్లు. అయితే, తెలంగాణ వచ్చిన తర్వాత అసలు సచివాలయమే లేకుండా పోయింది. సీఎం కేసీఆర్ అయితే ఒక్కసారి కూడా సచివాలయానికి రాలేదు.

తర్వాత పాత భవనాన్ని కూల్చి, కొత్త భవంతి నిర్మించారు. అంతే.. ఈలోపు సచివాలయం సామాన్యులకు దూరమైంది. ఏ సమస్య వస్తే ఎవరిని, ఎలా కలవాలో కూడా ప్రజలు మర్చిపోయారు. అయితే, కొత్త సచివాలయం అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో గతంలోలాగా సామాన్యులకు ప్రవేశం కల్పించాలని ప్రజలు కోరుతున్నారు. వారానికో రోజు, నిర్ణీత సమయంలో మంత్రులు, అధికారులు ప్రజల దగ్గరి నుంచి వినతులు స్వీకరించాలి. వీలైనంత త్వరగా వాటి పరిష్కారానికి కృషి చేయాలి. ఇలా వచ్చే వారిలో ఎక్కువగా పేదవాళ్లు ఉంటారు. అలాగే వైద్య పరమైన తక్షణ సాయం అవసరమైన వాళ్లుంటారు. ప్రభుత్వం వీరికి త్వరగా న్యాయం జరిగేలా చూడాలి. దీని ద్వారా సచివాలయాన్ని ప్రజలకు అందుబాటులోకి తేవాలి. అంతేకానీ.. తమ స్వంత పనుల కోసం వచ్చే ప్రజా ప్రతినిధులు, కాంట్రాక్టర్లు, లాబీయిస్టులకే పెద్దపీట వేస్తే భారీ సచివాలయం ఉన్నా ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదు. మరి తెలంగాణ ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుందో చూడాలి.