జ్ఞానవాపి మసీదు (Gnanavapi Masjid) కింద భారీ హిందు ఆలయ (Hindu Temple) ఆనవాళ్లున్నాయని తేలింది. అంతేకాదు… ఆలయాన్ని పాక్షికంగా కూల్చి మసీదు కట్టారని తేల్చి చెప్పింది ఆర్కిలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (Archaeological Survey of India). ఇటీవల మసీదులో సర్వే చేసిన ASI… కోర్టు ఆదేశాలతో తమ నివేదికను హిందూ, ముస్లిం పక్షాలకు అందజేసింది.
ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) లోని వారణాసి (Varanasi) లో ఉన్న జ్ఞానవాపి మసీదు-కాశీ విశ్వనాథుని (Kashi Vishwanath) ఆలయ వివాదంపై కీలక పరిణామం చోటుచేసుకుంది. భారీ హిందూ ఆలయాన్ని కూల్చి… మసీదు నిర్మించారని ఆర్కెలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా-ASI నిర్ధారించింది. మసీదులో ఆలయానికి సంబంధించిన అనేక ఆనవాళ్లు ఉన్నాయని తెలిపింది. 800 పేజీలకు పైగా గల నివేదికలో అనేక ముఖ్యమైన అంశాలను ప్రస్తావించింది. ASI సర్వే నివేదికను బట్టి చూస్తే… భారీ హిందూ ఆలయాన్ని కూల్చి జ్ఞానవాపి మసీదును కట్టారని నిర్ధారణ అవుతోందని అన్నారు హిందూ సంస్థల తరఫు న్యాయవాది విష్ణుశంకర్ జైన్. అంతేకాదు… కూల్చిన ఆలయానికి చెందిన స్తంభాలను మసీదు నిర్మాణంలో ఉపయోగించినట్టు తేలింది. 17వ శతాబ్దంలో ఆలయాన్ని కూల్చినట్టు తన నివేదికలో స్పష్టం చేసింది ASI. గతంలో ఆలయ గర్భగుడిని ఇప్పుడు మసీదు హాల్‌గా ఉపయోగిస్తున్నట్టు ASI తేల్చింది.
Chiranjeevi Padma Vibhushan award : మెగాస్టార్‌కు పద్మవిభూషణ్..
మసీదులో 32 శాసనాలను గుర్తించారు ASI నిపుణులు. అవి తెలుగు, కన్నడ, దేవనాగరి లిపిలో ఉన్నాయి. జనార్ధన, రుద్ర లాంటి పేర్లతో శాసనాలు ఉన్నాయి. అలాగే, మసీదులో హిందూ దేవతల విగ్రహాలు కూడా ఉన్నట్టు ASI నివేదికలో స్పష్టం చేసిందని తెలిపారు న్యాయవాది విష్ణు శంకర్ జైన్. జ్ఞానవాపి మసీదు ఉన్న ప్రదేశంలో రెండు ఆలయాలు ఉండేవని ASI తన నివేదికలో చెప్పిందన్నారు హిందూ వర్గానికి చెందిన మరో న్యాయవాది సుధీర్ త్రిపాఠి. పశ్చిమ దిక్కున గల గోడ గురించి కూడా నివేదికలో ప్రస్తావించినట్టు తెలిపారు.
వారణాసిలోని కాశీ విశ్వనాథుని ఆలయంలో అంతర్భాగంగా జ్ఞానవాపి శివాలయం ఉండేదని హిందూ వర్గం చాలా కాలంగా వాదిస్తోంది. ఆలయాన్ని పాక్షికంగా కూల్చి మసీదు కట్టారంటోంది. అయితే, దీనిని ముస్లిం వర్గం వ్యతిరేకిస్తోంది. ఈ అంశంపై రెండు పక్షాల మధ్య వారణాసి కోర్టులో కేసు నడుస్తోంది. కోర్టు ఆదేశాలతో మసీదులో వీడియో సర్వే జరిగింది. వాజుఖానా బావిలో శివలింగం లాంటి ఆకారం మొదట బయటపడింది. అది శివలింగమే అని హిందూపక్షం వాదిస్తోంది. కాదు ఫౌంటెన్ అంటోంది ముస్లిం వర్గం.
ఈ పరిస్థితుల్లో కోర్టు ఆదేశాలతో వాజుఖానా బావి వున్న ప్రాంతానికి ఎవరూ వెళ్లకుండా సీజ్ చేశారు అధికారులు. అలాగే, మసీదులోని సమగ్ర సర్వే జరిపించాలన్న హిందూ పక్షం వాదనతో కోర్టు ఏకీభవించింది. సుప్రీంకోర్టు సూచనలతో సీజ్ చేసిన వాజుఖానా బావి ప్రాంతాన్ని మినహాయించి… మసీదులో సర్వే నిర్వహించింది ASI. గత ఏడాది ఆగస్టు 4న సర్వే ప్రారంభించిన ASI… డిసెంబర్ 19న కోర్టుకు తమ నివేదికను సమర్పించింది. ASI నివేదిక ప్రతుల ఇవ్వాల్సిందిగా కోర్టును కోరాయి జ్ఞానవాపి మసీదు వివాదంలోని రెండు పక్షాలు. దీంతో నివేదిక కాపీలను ఇవ్వాల్సింది ASIని ఆదేశించింది కోర్టు. ఐదుగురు హిందూ వర్గం వారితో పాటు ఇంతెజామియా మసీదు కమిటీ, కాశీ విశ్వనాథ ట్రస్ట్, యూపీ ప్రభుత్వం, చీఫ్ సెక్రటరీ, హోం సెక్రటరీ, వారణాసి జిల్లా మేజిస్ట్రేట్ ఈ నివేదిక ప్రతుల కోసం దరఖాస్తు చేశారు. వాళ్లందరికీ నివేదిక కాపీలను అందజేసింది ASI.
మసీదులో సీజ్ చేసిన వాజుఖానా బావి ప్రాంతాన్ని తెరిపించాల్సిందిగా సుప్రీం కోర్టును ఆశ్రయిస్తామంటున్నారు హిందూపక్ష న్యాయవాది విష్ణు శంకర్ జైన్. అంతేకాదు… ప్రస్తుత కేసులో ఇవి చాలా కీలక ఆధారాలు ఉన్నాయంటున్నారు. వీటి ఆధారంగా మొదట వారణాసి కోర్టులోనే తమ వాదనలు వినిపిస్తామన్నారు. భవిష్యత్తులో అవసరమైతే పైకోర్టుల్లో వాదనలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు హిందూ పక్ష న్యాయవాది. ASI నివేదికపై ఎవైనా అభ్యంతరాలు ఉంటే… ఫిబ్రవరి 6న వారణాసి కోర్టుకు విన్నవించాల్సి ఉంటుంది. ఈ అంశంపై తదుపరి విచారణ కొనసాగుతుంది.