Power Bill: ఎలక్ట్రిసిటీ బిల్లులకు కొత్త రూల్..! ఇకపై వాడిన టైమ్‌ని బట్టి టారిఫ్ అమలు

మీ ఇంట్లో ఉన్న ఏసీ, వాషింగ్ మిషన్, టీవీ, కూలర్ అన్నీ ఒకేసారి ఆన్ చేశారు. అది కూడా సూర్యుడు నడినెత్తిన ఉన్న సమయంలో. సాధారణంగా అయితే ఏమవుతుంది.. కరెంటు బిల్లు తడిచి మోపెడవుతుంది. ఇంట్లో ఉన్న ఎలక్ర్టిక్ వస్తువులన్నీ ఒకేసారి వాడితే.. కరెంట్ మీటర్ గిర్రును తిరిగిపోతుంది. బిల్లు చూసి గుండె గుబేల్‌మంటుంది. అయితే భవిష్యత్తులో ఇలా జరగకపోవచ్చు. పట్టపగలు ఇన్ని ఎలక్ట్రికల్ వస్తువులను మీరు ఉపయోగించినా అప్పుడు ఖర్చయ్యే కరెంటుకు మీరు సాధారణంగా చెల్లించే దానికంటే 20 శాతం తక్కువే ఉండొచ్చు.. అవును నిజమే.. ఇకపై పవర్ బిల్ టారీఫ్‌లు సమూలంగా మారిపోబోతున్నాయ్.

  • Written By:
  • Publish Date - July 11, 2023 / 04:00 PM IST

24 గంటల్లో ఎప్పుడు పవర్ వాడినా.. ఒకే రకమైన టారీఫ్‌లతో బిల్లులు జనరేట్ చేసే రోజులు పోతున్నాయి. ఇకపై కేంద్ర ప్రభుత్వం కొత్త విధానాన్ని అమలు చేయబోతోంది. దీని ప్రకారం మీరు కరెంటును ఏ సమయంలో ఉపయోగించారు అన్న దానిని బట్టి ఎక్కువ కట్టాలా.. తక్కువ కట్టాలా అన్నది ఆధారపడి ఉంటుంది. టైమ్ బేస్ట్ ఎలక్ట్రికల్ టారీఫ్‌లను అమలు చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం Electricity (Rights of Consumers) Rules, 2020లో కీలక సవరణలు చేసింది. దీని ప్రకారం కరెంటు వినియోగించుకునే సమయాన్ని మూడు విభాగాలుగా విభజించి బిల్లులు జనరేట్ చేస్తారు.

ఇప్పటి వరకు ఒక లెక్క ఇకపై మరో లెక్క
ప్రస్తుతం దేశవ్యాప్తంగా అందుబాటులో ఉన్న ఎలక్ట్రిసిటీ విధానాల ప్రకారం.. నెలలో ఎన్ని యూనిట్లు వాడుకున్నారు అన్న దానిని పరిగణలోకి తీసుకుని ఆ యూనిట్లు ఏ టారిఫ్ పరిధిలోకి వస్తే ఆ టారిఫ్ ప్రకారం విద్యుత్ బిల్లులు వసూలు చేస్తున్నారు. అయితే ఇకపై ఇలా యూనిట్ల లెక్క ఫిక్స్ డ్ విధానంలో బిల్లులు ఇవ్వరు. ఏ టైమ్‌లో వాడారు అన్న దానిని పరిగణలోకి తీసుకుని ఆ టైమ్ స్లాట్ ప్రకారం కరెంటు బిల్లులు జనరేట్ చేస్తారు.

24 గంటలు.. 3 విభాగాలు
టైమ్ ప్రకారం కొత్త టారిఫ్ విధానాన్ని అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం విద్యుత్ వాడే సమయాన్ని మూడు విభాగాలుగా విభజించింది. అందులో మొదటిది సోలార్ టైమ్.. అంటే.. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఉండే కాలాన్ని సోలార్ టైమ్ గా ప్రస్తావించారు. ఈ టైమ్‌లో విద్యుత్ వాడకానికి వినియోగదారులు రెగ్యులర్ గా కట్టే బిల్లు కంటే 20 శాతం తక్కువగా చెల్లిస్తారు. అంటే సోలార్ టైమ్‌లో విద్యుత్ వాడకం ద్వారా తక్కువ బిల్లే జనరేట్ అవుతుంది. ఈ సమయాల్లో సోలార్ ద్వారా విద్యుత్ వాడకాన్ని కేంద్రం ప్రోత్సహిస్తుంది. ఇక మిగిలిన సమయాన్ని పీక్ అవర్స్, నార్మల్ అవర్స్ గా విభజించారు. ఏది పీక్ అవర్, ఏది నార్మల్ అవర్ అన్నది రాష్ట్రాలను బట్టి మారుతుంది. స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ వీటిని నిర్ణయిస్తుంది. సోలార్ అవర్‌లో 20 శాతం తక్కువ బిల్లు వస్తే.. నార్మల్ , పీక్ అవర్స్ లో వాడకాన్ని బట్టి 20 శాతం ఎక్కువగా కరెంటు బిల్లు వస్తుంది. ఏ టైమ్‌లో కరెంటును ఎలా వాడాలన్నది ఇకపై వినియోగదారుల ఇష్టం. కరెంటు బిల్లు తక్కువగా రావాలనుకున్న వాళ్లు సోలార్ అవర్‌ విద్యుత్ ను వినియోగించుకోవచ్చు. మిగిలిన సమయాల్లో కూడా ఎక్కువగా వాడితే.. దానికి తగ్గట్టే బిల్లు వస్తుంది. ఈ మొత్తం విధానానికి కేంద్ర ప్రభుత్వం Time of Day (TOD) అని పేరుపెట్టింది.

ఎప్పటి నుంచి అమలులోకి వస్తుంది ?
కొత్త టారిఫ్ విధానాన్ని ముందుగా ఇండస్ట్రియల్, కమర్షియల్ యూజర్లకు అమలు చేయాలని కేంద్రం నిర్ణయించింది. వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఇది అమలులోకి వస్తుంది. 10 KW కంటే ఎక్కువ విద్యుత్ వాడకమున్న ఇండస్ట్రియల్ , కమర్షియల్ యూజర్లకు దీనిని వర్తింపు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా అన్ని ఇళ్లకు స్మార్ట్ మీటర్లను అందుబాటులోకి తెచ్చి ప్రతి ఇంటినీ కొత్త టారిఫ్ విధానం పరిధిలోకి తీసుకురావాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. సాధారణ వినియోగదారులకు ఈ విధానం 2025 ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వస్తుంది.

టైం ఆఫ్ డే (Time of Day) – TODతో వినియోగదారులకు ఉపయోగమేనా ?
కొత్త విధానం అమలులోకి వస్తే విద్యుత్ వినియోగంలో వినియోగదారుల మైండ్ సెట్ మారే అవకాశముంది. మూడు రకాల టైమ్ స్లాట్స్ అందుబాటులో ఉండటం వల్ల వినియోగదారులు విద్యుత్ వినియోగం విషయంలో తమ అవసరాల్లో మార్పులు చేర్పులు చేసుకునే అవకాశముంది. Time of Day (ToD)లో భాగంగా తక్కువ టారిఫ్ ఉన్న సమయంలోనే తమకు కావాల్సిన విద్యుత్‌ను వినియోగించుకోవడం వల్ల బిల్లులు గతంతో కంటే తక్కువ వచ్చే అవకాశాలు కచ్చితంగా ఉన్నాయి. అమెరికాలో ఈ విధానాన్ని అమలు చేయడం మొదలుపెట్టినప్పుడు అక్కడి ప్రజలు తక్కువ టారిఫ్ ఉన్న సమయంలోనే పనులు చక్కపెట్టుకోవడం మొదలుపెట్టారు. దీంతో 15 శాతం కరెంటు బిల్లులు తక్కువగా వచ్చినట్టు లెక్కలు చెబుతున్నాయి.

టైం ఆఫ్ డే (Time of Day) – TODతో ప్రభుత్వానికి ఏంటి ఉపయోగం
ఏదేశంలోనైనా ఎలక్ట్రిసిటీ అన్నది నిత్యవసర వస్తువు. ప్రజల విద్యుత్ అవసరాలు, డిమాండ్‌కు తగ్గట్టు ప్రభుత్వాలు విద్యుత్‌ను సరఫరా చేయాలి. అయితే ఒక్కోసారి సప్లై కంటే డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. పీక్ అవర్స్‌ లో విద్యుత్ పంపిణీ సంస్థలపై విపరీతమైన ఒత్తిడి ఉంటుంది. ఒక వైపు విద్యుత్ ఉత్పత్తి కాస్ట్ లీగా మారుతున్న సమయంలో వ్యవస్థను స్థిరీకరించడం కోసం కేంద్రం ఈ విధానాన్ని అమలు చేయాలని భావిస్తోంది. సోలార్, థర్మల్, హైడల్, గ్యాస్ ఇలా అన్ని రకాల విద్యుత్‌ను అనుసంధానం చేసి డిస్ట్రిబ్యూట్ చేయడం ద్వారా విద్యుత్ పంపిణీ సంస్థలపై ఒత్తిడి కూడా తగ్గుతుంది. Time of Day (TOD) విధానాన్ని విన్-విన్ విధానంగా చెపుతుంది కేంద్ర ప్రభుత్వం. అంటే అటు వినియోగదారులు..ఇటు విద్యుత్ పంపిణీ సంస్థలు దీని వల్ల లాభం పొందుతాయన్నది కేంద్రం మాట. అమెరికాతో పాటు 17 యూరోపియన్ దేశాలు ఇప్పటికే టైమ్ పవర్ టారిఫ్ విధానాన్ని అమలు చేస్తున్నాయి. రానున్న రెండేళ్లలో దీన్ని దేశవ్యాప్తంగా విద్యుత్ వినియోగదారులందరికీ వర్తింప చేయాలన్నది ప్రభుత్వం ఆలోచన. Time of Day (TOD) ద్వారా విద్యుత్ డిమాండ్‌ను రెగ్యులేట్ చేస్తే ఉత్పత్తి కూడా ఎలాంటి ఒత్తిడి లేకుండా సక్రమంగా సాగుతుంది.

టైం ఆఫ్ డే (Time of Day) – TOD అమలు సాధ్యమేనా ?
ప్రభుత్వం చట్టాన్నైతే సవరించింది గానీ.. దీన్ని అమలు చేయాలంటే చాలా సమస్యలున్నాయి. అందులో మొదటికి స్మార్ట్ విద్యుత్ మీటర్లు. ఈ మీటర్లు అమర్చితేనే టైమ్ విధానంలో విద్యుత్ వినియోగాన్ని గుర్తించి అందుకు తగ్గట్టు బిల్లులను వసూలు చేయవచ్చు. దేశవ్యాప్తంగా అన్ని విద్యుత్ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు అమర్చుతామని 2021లోనే ప్రభుత్వం ప్రకటించింది. 2026 నాటికి దేశవ్యాప్తంగా 250 మిలియన్ల స్మార్ట్ మీటర్లను అమర్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. కానీ ఇప్పటి వరకు 6.5 మిలియన్ల కనెక్షన్లకు మాత్రమే స్మార్ట్ మీటర్లను అమర్చారు. నెలకు కనీసం 60 లక్షల స్మార్ట్ మీటర్లను అమర్చుకుంటూ వెళ్తే తప్ప కేంద్ర ప్రభుత్వం అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేదు. సాధారణ మీటర్లతో పోల్చితే స్మార్ట్ మీటర్లు ఖరీదెక్కువ. ఒక్కో స్మార్ట్ మీటర్ అమర్చడానికి 4 వేల రూపాయలు ఖర్చవుతుంది. ఇప్పటి వరకూ ఈ భారాన్ని డిస్కంలు భరించాయి. ప్రతి విద్యుత్ కనెక్షన్‌కు స్మార్ట్ మీటర్ పెట్టాలంటే తడిసి మోపెడవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో Time of Day (TOD) కాన్సెస్ట్ ద్వారా ఎలాంటి ఫలితాలు వస్తాయో ఎదురుచూడాలి. రానున్న రెండేళ్లలో మాత్రం ప్రస్తుతమున్న ఫిక్స్ డ్ ఫార్మెట్ లో కాకుండా టైమ్ ఆధారంగానే విద్యుత్ వినియోగించుకునే విధానం అందుబాటులోకి రాబోతోంది. వినియోగదారులందరూ దీనికి అలవాటు పడటానికి సిద్ధంగా ఉండాలి.