రిలేషన్ షిప్ వేరు, ఇల్లీగల్ రిలేషన్ షిప్ వేరు. రిలేషన్ షిప్ లో ఒకరితో ఒకరు కలిసి ఉంటారు. అది వారి వ్యక్తిగతం. కానీ ఇల్లీగల్ రిలేషన్ షిప్ లో ఒకరితో పెళ్లి అయి ఉండవచ్చు, ప్రేమలో ఉండవచ్చు. అలాంటి బంధంలో ఉండి వారికి తెలియకుండా మరో తోడును కోరుకోవడమే ఇల్లీగల్ రిలేషన్. దీనినే ఇల్లీగల్ అఫైర్ అని కూడా అంటారు. ఇవి ప్రస్తుతం సమాజంలో చాలా మంది బ్రతుకులను, జీవితాలను రోడ్డెక్కేలా చేస్తుంది. సాధారణంగా ఇది మన సంస్కృతి కాదు. పూర్తిగా ప్రాశ్చాత్య సంస్కృతి నుంచి మన దేశం వైపుకు వలస వచ్చిన దుష్టసంప్రదాయంగా చెప్పాలి. ఇలాంటివి ఐటీ సెక్టార్ లో పనిచేసే ఉద్యోగుల్లో ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీని పవనాలు ఇప్పుడు అన్ని రంగాల్లో క్రమక్రమంగా వీస్తున్నాయి. అది ప్రైవేట్, పబ్లిక్ రంగం అనే తేడా లేకుండా అన్నింటా తానై అన్నట్లు మారిపోయింది. ప్రజలకు రక్షణ కల్పించే పోలీస్ శాఖలో కూడా ఇలాంటి సంఘటనలు వెలుగులోకి రావడం గతంలో చాలా చూశాం. దీనిని సాఫ్ట్ వేర్ పరిభాషలో చెప్తే ఇలా ఉంటుంది. నేటి సమాజానికి టెక్నాలజీ వైబ్స్ తీసుకొచ్చిన సరికొత్త ఫ్యామిలీ రిలేటెడ్ అప్డేట్ వర్షన్ గా అర్థం చేసుకోవచ్చు.
వీటిపై తాజాగా చైనాలోని ఒక ప్రైవేట్ కంపెనీ సరికొత్త మార్గదర్శకాలు తీసుకొని వచ్చింది. తమ కంపెనీలో పనిచేసే ఎంప్లాయిస్ ఎవరూ ఇలాంటి ఇల్లీగల్ చర్యలకు పాల్పడకూడదు అని హెచ్చరించింది. అలాగే పెళ్లి చేసుకున్న వారైతే విడాకులు కూడా తీసుకోవద్దని సూచించింది. ఒకరితో ఉంటూ మరొకరితో తిరగొద్దు, ప్రస్తుతం ఉన్నవారిని విడవద్దు అని దీని అర్థం. ఈ నియమాలను ఉల్లంగిస్తే వారిపై కఠినచర్యలు తప్పవని కంపెనీలో నుంచి తొలగిస్తామని ఆదేశాలు జారీ చేసింది. ఈ కంపెనీ చేసిన ప్రకటన ఇప్పుడు చైనా మీడియాలో కోడై కూస్తుంది. ఇలా.. ఈనోట ఆనోట పాకి సోషల్ మీడియా ద్వారా అన్ని ప్రాంతాలకు ఈ వార్త విస్తరించింది. దీంతో అందరూ ఈ అంశం పైనే చర్చించుకుంటున్నారు.
ఈ రూల్స్ మంచిదే.. కుటుంబాలు నిలబడతాయి, ఎలాంటి పొరపొచ్చులకు తావుండదు, కుటుంబంలో విశ్వసనీయత పెరుగుతుందని కొందరు స్వాగతిస్తుంటే.. మరికొందరు స్వేచ్ఛను హరించడమే అని విమర్శిస్తున్నారు. మరికొన్ని చోట్ల అయితే తీవ్రమైన నిరసనలు చేపట్టారు. ఉద్యోగుల పర్సనల్ విషయాల్లో కంపెనీ జోక్యం ఏంటంటూ ఇలా నిబంధనలు పెట్టడం సరికాదంటూ మండిపడుతున్నారు.
చైనాలోని జెజియాంగ్ కు చెందిన సంస్థ ఇలాంటి వింత రూల్స్ తీసుకురావడం వెనుక కంపెనీ తన భావనను ప్రకటించింది. కంపెనీలో పనిచేసే ఉద్యోగుల మధ్య అంతర్గత సంబంధాలు మెరుగుపరచడంలో దోహదపడతాయని చెప్పింది. అలాగే వైవాహిక జీవన ప్రయాణంలోని దంపతుల మధ్య ఎలాంటి సందేహాలు, అనుమానాలు కలుగకుండా ఉండేందుకు ఇది ఉపయుక్తంగా ఉంటుందని ఈ కంపెనీ ప్రతినిధి తెలిపారు. అలాగే సమాజంలో మంచి సంస్కృతిని నెలకొల్పేందుకు, ప్రతి ఇంట్లో మెరుగైన వాతావరణాన్ని సృష్టించేందుకు ఈ రూల్స్ ను రూపొందించినట్లు వివరించారు.
T.V.SRIKAR