చైనాలోని ఓ ప్రాంతంలో కూడా బోర్ వేసే పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అయితే ఎన్ని అడుగుల మేర బోరు వేస్తున్నారో తెలుసా.. వెయ్యి..రెండు వేల అడుగులు కాదు.. ఏకంగా 32వేల 808 అడుగుల లోతులోకి బోరు వేస్తున్నారు. చైనా ప్రభుత్వమే భూగర్భంలోకి ఈ డ్రిల్లింగ్ చేపట్టింది. భూమి ప్రధాన పొరలను చీల్చుకుంటూ దాదాపు 10వేల మీటర్ల మేర భూగర్భంలోకి చైనా పెద్ద రంధ్రం చేస్తోంది. భూగర్భ జలాలను వాడుకునేందుకు ఈ స్థాయిలో డ్రిల్లింగ్ చేయాల్సిన అవసరం ఎంతమాత్రం లేదు. కానీ చైనా ఓ పెద్ద లక్ష్యంతో ఈ డ్రిల్లింగ్ చేస్తోంది. దీని వెనుక డ్రాగన్ కంట్రీకి భారీ వ్యూహమే ఉంది.
భూసంపదను మింగేసే ప్రయత్నమా ?
అమెరికా, చైనా, రష్యా ఈ మూడు దేశాలు ప్రపంచంపై ఆధిపత్యం కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. అగ్రరాజ్యాలుగా ఇతర దేశాలపై డామినేషన్ రోల్ ప్లే చేస్తున్నాయి. అదే సమయంలో భూమి, ఆకాశం, సముద్రం.. ఈ విశ్వంలో ఏ ఒక్కటీ వదిలిపెట్టకుండా అన్నింటిపైనా సర్వహక్కులు తమకే ఉండాలి అన్న దృక్కోణంతో పావులుకదుపుతున్నాయి. ఈ విషయంలో చైనా ముందు వరసలో ఉంది. ఇతర దేశాల భూభాగాల్లోకి చొచ్చుకొచ్చి.. ఆ తర్వాత వాటిని ఆక్రమించుకుని ఆధిపత్యం ప్రదర్శించే ప్రయత్నాలు తరచూ చేసే చైనా… ప్రపంచవ్యాప్తంగా ఉన్న సహజవనరులపైనా తనదే పై చేయి కావాలనుకుంటుంది. అందుకే భూగర్భంలోకి చొచ్చుకుని వెళ్లి భూమాత రహస్యాలను తెలుసుకునే ప్రయత్నాలు మొదలు పెట్టింది. అందులో భాగంగానే 10వేల మీటర్ల బోర్ వెల్ వేస్తోంది.
భూమికి అతిపెద్ద రంధ్రం అక్కడే ఎందుకు ?
చైనాలోని జింగజియాంగ్ ప్రావెన్స్. ఇంధన నిక్షేపాలు పుష్కలంగా ఉన్న ప్రాంతం ఇది. భూగర్భంలో ఏముందో తెలుసుకునేందుకు అక్కడ ఉన్న సహజ వనరులను ఏ రకంగా ఉపయోగించుకోవచ్చో పరిశీలన చేసేందుకు చైనా ప్రభుత్వం ఈ ప్రాంతాన్నే ఎంచుకుంది. చైనా ప్రభుత్వం చేపట్టిన అతిపెద్ద బోర్ వెల్ ప్రాజెక్టుగా దీన్ని చెబుతున్నారు. గోబి ఎడారి ప్రాంతం నుంచి పౌర ఆస్ట్రొనాట్‌ను అంతరిక్షంలోకి పంపిన రోజే.. గుట్టుచప్పుడు కాకుండా డ్రిల్లింగ్ పనులను కూడా చేపట్టింది చైనా ప్రభుత్వం. వందలాంది ఇంజినీర్లు, భూగర్భ శాస్త్రవేత్తలు పరిశోధకులు ఈ ప్రాజెక్టులో భాగస్వాములుగా ఉన్నారు .
చైనా భూమిలోకి ఎంత వరకు వెళ్తుంది ?
ఇంటి కోసమో..వ్యవసాయం కోసమో చిన్న బోరు వేయాలంటేనే చాలా పెద్ద తంతతం ఉంటుంది. అలాంటిది ప్రపంచంలోనే రెండో అతి పెద్ద బోర్‌వెల్ కోసం ఎంత హంగామా ఉంటుందో ఊహించుకోండి. దాదాపు పది ఖండాల విస్తీర్ణం ఉన్నంత స్థాయిలో భూమిలోపలకు అనేక పొరలను, రాళ్లను, భూగర్భ జలాశయాలను చీల్చుకుంటూ ఈ డ్రిల్లింగ్ కొనసాగుతుంది. ఈ అతిపెద్ద డ్రిల్లింగ్ ప్రాజెక్టు ద్వారా చైనా గతకాలంలోకి ప్రయాణం చేయబోతోంది. వినడానకి ఆశ్చర్యంగా ఉన్నా.. చైనా అదే చేయబోతోంది. దాదాపు 145 మిలియన్ సంవత్సరాల క్రితం భూమి ఎలా ఉందో.. ఆ ప్రాంతాన్ని తాకేలా భూగర్భంలోకి డ్రిల్లింగ్ జరగబోతోంది. భూమి ఇంటర్నల్ స్ట్రక్చర్ ఎలా ఉంది.. భవిష్యత్తు అవసరాల కోసం భూగర్భాన్ని ఎలా ఉపయోగించుకోవచ్చు..వంటి వాటి గురించి చైనా తెలుసుకోబోతోంది. గతానికి భిన్నంగా భూగర్భాన్ని అన్వేషించాలన్న ఆలోచన చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌దే. 2021లోనే చైనా శాస్త్రవేత్తలతో సమావేశమైన ఆయన డీప్ ఎర్త్ ఎక్స్ ప్లొరేషన్ గురించి బ్లూప్రింట్ అందించారు. అప్పటి నుంచే ఈ ప్రాజెక్టు కోసం చైనా బృందం పనిచేయడం మొదలుపెట్టింది. వివిధ ప్రాంతాలను పరిశీలించి చివరకు జింగజియాంగ్ ప్రావెన్స్ లో బోర్‌వెల్ డ్రిల్లింగ్ చేపట్టారు.
ఈ ప్రాజెక్టు ద్వారా చైనా ఏం సాధిస్తుంది ?
అమెరికాతో పాటు చైనా ఆర్థిక పరిస్థితి ఏమాత్రం ఆశాజనంగా లేవు. చైనాలోని స్థానిక ప్రభుత్వాలన్నీ అప్పుల ఊబిలో ఇరుక్కుపోయాయి. అయినా చైనా ఫెడరల్ ప్రభుత్వం మాత్రం మిలయన్ల డాలర్లను ఖర్చు పెట్టీ ఈ ప్రాజెక్టును చేపట్టడానికి చాలా కారణాలున్నాయి. ముందుగా ఇప్పటి వరకు మనిషి అన్వేషించని లోతులో భూగర్భంలో ఏం జరుగుతుందో తెలుసుకోవడం. ఆ తర్వాత అక్కడ ఉన్న సహజవనరులను, మినరల్స్ ను తమ దేశ అవసరాల కోసం ఉపయోగించుకోవడం..వీటి తో పాటు ఈ ప్రయోగం ద్వారా డీప్ డ్రిల్లింగ్ టెక్నిక్స్ తెలుసుకోవడం. వీటి కోసం చైనా ఈ ప్రాజెక్టు చేపట్టింది. ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద మ్యాన్ మేడ్ హోల్ రష్యాలో ఉంది. 20 ఏళ్ల పాటు డ్రిల్లింగ్ చేసి..రష్యా భూమిలోపల 12వేల మీటర్లకు వెళింది. ఇప్పుడు దానికి మించి భూగర్భాన్ని అన్వేషించాలని చైనా లక్ష్యంగా పెట్టుకుంది.