లాక్‌డౌన్ సమయంలో వాతావరణంలో కాలుష్యం ఏ స్థాయిలో తగ్గిందో సపరేట్‌గా చెప్పాల్సిన పని లేదు. పొల్యూషన్ లేకపోవడంతో మాకు ఇంటి నుంచి హిమాలయాస్ కనిపిస్తున్నాయని చాలా మంది అప్పట్లో పోస్ట్‌లు కూడా పెట్టారు. కేవలం హిమాలయ ప్రాంతాల్లోనే కాదు.. లాక్‌డౌన్ సమయంలో దాదాపు అన్ని రాష్ట్రాల్లో కాలుష్యం భారీ స్థాయిలో తగ్గింది. అయితే ఈ లాక్‌డౌన్ ప్రభావం భూమిమీదే కాదు.. చంద్రుడిపై కూడా పడిందట. లాక్‌డౌన్ కారణంగా చంద్రుడిపై భారీగా ఉష్ణోగ్రతలు తగ్గాయని రీసెంట్‌గా జరిపిన స్టడీస్‌లో తెలిసింది. 2020లో లాక్‌డౌన్ కారణంగా జాబిల్లిపై రాత్రి ఉష్ణోగ్రత 8 నుంచి 10 కెల్విన్‌ల వరకూ పడిపోయినట్టు గుర్తించారు. ఇది భూ వాతావరణంలో మార్పులు, చంద్రుడికి మధ్య గల ఆశ్చర్యకరమైన సంబంధాలను సూచిస్తోంది. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాకు చెందిన లూనార్ రీకానాన్సెస్ ఆర్బిటర్ డేటాను విశ్లేషించిన పరిశోధకులు.. జాబిల్లిపై ఉష్ణోగ్రతల తగ్గుదల భూమిపై మానవ కార్యకలాపాలలో తగ్గింపుతో సమానంగా ఉందని కనుగొన్నారు.
లాక్‌డౌన్ సమయంలో గ్రీన్‌హౌస్ ఎగ్జాస్ట్‌లు, ఏరోసోల్స్ తగ్గుదల భూమి నుంచి విడుదలయ్యే రేడియేషన్‌ను మార్చినట్లు కనిపిస్తోంది. ఇది చంద్రునిపై ఉష్ణోగ్రతల తగ్గుదల ప్రభావానికి దారితీసింది. ఈ పరిశోధన ఫలితాలను రాయల్ ఆస్ట్రనామికల్ సొసైటీ జర్నల్‌లో పబ్లిష్ కూడా చేశారు. లాక్‌డౌన్ ముగిసి మానవ కార్యకలాపాలు పునఃప్రారంభమై తర్వాత చంద్రుడిపై ఉష్ణోగ్రతల పెరగుదలను బట్టి మన చర్యలు భూమి అవతల వాతావరణాన్ని ప్రభావితం చేస్తాయని సూచిస్తున్నాయి. అహ్మదాబాద్‌లోని ఫిజికల్ రిసెర్చ్ ల్యాబొరేటరీకి చెందిన పరిశోధకుల బృందం… 2017 నుంచి 2023 మధ్య చంద్రుడి ఉపరితలంపై ఆరు ప్రదేశాల్లో ఉష్ణోగ్రతల డేటాను విశ్లేషించింది. 2020లో ఉష్ణోగ్రతల్లో తగ్గుదల భూమిపై మానవ కార్యకలాపాలు చంద్రుడిని ఎలా ప్రభావితం చేశాయో పరిశీలించడానికి ఒక ప్రత్యేకమైన అవకాశాన్ని అందించిందని ఈ బృదంలోని సైంటిస్టులు చెప్తున్నారు. కోవిడ-19 లాక్‌డౌన్ సమయంలో మానవ కార్యకలాపాల తగ్గుదల.. చంద్రుని ఉష్ణోగ్రతలపై ప్రభావం చూపిందని, భూమి, దాని పొరుగు ఉన్న ఖగోళ వస్తువుతో పరస్పర అనుసంధానాన్ని హైలైట్ చేస్తుందని పరిశోధన వెల్లడించింది. ఈ పరిశోధన బలమైన ఆధారాలను అందించినప్పటికీ.. భూమి-చంద్రునికి మధ్య సంబంధాన్ని పూర్తిగా అవగాహన చేసుకోవడానికి మరింత సమాచారం అవసరం. అంటున్నారు సైంటిస్టులు.