Good Fortune: మన ఇంట్లోకి ఏదైనా జంతువుగానీ, పక్షి గానీ వస్తే అంతా భయపడతారు. అశుభంగా భావిస్తుంటారు. కానీ కొన్ని జంతువులు, పక్షులు వస్తే మాత్రం చాలా శుభం కలుగుతుందట. జోతిష్యశాస్త్రం ప్రకారం కొన్ని జీవుల్లో దేవుడు ఉంటాడనేది హిందువులు నమ్మకం. ఆ జీవులు ఇంట్లోకి వస్తే శుభం కలగడమే కాకుండా కాసుల వర్షం కురుస్తుందని చెప్తున్నారు.
ఇందులో అన్నికంటే ముఖ్యమైంది తాబేలు. చాలా మంది తాబేలును చూడగానే భయపడతారు. కానీ ఇంట్లోకి తాబేలు వస్తే చాలా శుభం కలుగుతుందంటున్నారు పండితులు. వాస్తు శాస్త్రం ప్రకారం తాబేలు సంపదకు సంకేతమని నమ్ముతారు. తాబేలు ఇంట్లోకి రావడం అంటే దానితోపాటే సంపదను కూడా ఇంట్లోకి తెచ్చినట్టే అంటున్నారు పండితులు. ఇక పాములను చూస్తే భయపడనివాళ్లు దాదాపుగా ఉండరు. పాము ఇంట్లో కనిపించిందంటే చాలు.. చాలా మంది దాన్ని కొట్టి చంపేస్తుంటారు. కానీ ఇలా పాములు ఇంట్లోకి రావడం కూడా శుభప్రదమని చెప్తున్నారు జోతిష్యశాస్త్ర నిపుణులు. ముఖ్యంగా రెండు తలల పాము ఇంట్లోకి వస్తే ఆ ఇంట్లో కాసుల వర్షం కురవాల్సిందేనట.
సాధారణంగా ఇలాంటి రెండు తలల పాములు చాలా అరుదుగా కనిపిస్తుంటాయి. అలాంటి పాము ఇంట్లోకి వచ్చిందంటే అది సంపద రాకకు సూచకమే అంటున్నారు నిపుణులు. ఇక చిలుక ఇంట్లోకి వచ్చినా ధనలాభం కలుగుతుందని చెప్తున్నారు. హిందూ విశ్వాసం ప్రకారం చిలుకను కుబేరుని రూపంగా చెప్తారు. కామధేను వాహనం కూడా చిలుకే. అలాంటి చిలుక మన ఇంట్లోకి వస్తే శుభాలు కలుగుతాయట. ఇంట్లో పిచ్చుకలు గూడు కట్టుకున్నా ధన లాభం కలుగుతుందట. నల్ల చీమలు ఇంట్లో గూడు కట్టినా చాలా మంచిదని చెప్తున్నారు నిపుణులు.
చీమలు గూడు కడితే ధనలాభంతో పాటు విజయం, సంతోషం కలుగుతాయట. అలాగే వాస్తుశాస్త్రం ప్రకారం హంసల జంట ఫొటో గానీ, ఆవు ఫొటోగానీ ఇంట్లో పెట్టుకుంటే చాలా మంచిదంట. అయితే, ఇలాంటి విషయాలు నమ్మకాల మీదే ఆధారపడి ఉంటాయి. శాస్త్రీయ ఆధారాలంటూ లేవు.