TTD: తిరుమల శ్రీవారిపై కాసుల వర్షం కురుస్తోంది. గత మార్చి నుంచి ప్రతి నెలా ఆలయానికి రూ.100 కోట్లకు పైగా ఆదాయం సమకూరుతోంది. గత నెలలో కూడా భారీ ఆదాయమే సమకూరింది. సెప్టెంబర్‌లో వచ్చిన ఆదాయానికి సంబంధించిన వివరాలను ‘డయల్ యువర్ ఈవో’ కార్యక్రమంలో టీటీడీ వెల్లడించింది. సెప్టెంబర్‌లో రూ.100 కోట్లకు పైగా ఆదాయం సమకూరినట్లు టీటీడీ తెలిపింది. హుండీ ద్వారా రూ.111.65 కోట్లు వచ్చినట్టు టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు.
సెప్టెంబర్‌లో శ్రీవారిని 21.01 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు. ఈ నెలలో 1.11 కోట్ల లడ్డూలు విక్రయించారు. నోట్ల ద్వారా రూ.105 కోట్లు, నాణేలు ద్వారా రూ.5.41 కోట్లు, ఉప ఆలయాలు ద్వారా రూ.24 లక్షలు, చిరిగిన నోట్లు ద్వారా రూ.85 లక్షలు భక్తులు సమర్పించినట్లు టీటీడీ తెలిపింది. సెప్టెంబరు 18 నుంచి 26వ వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ బ్రహ్మోత్సవాలకు భక్తులు పోటెత్తారు. ఈ బ్రహ్మోత్సవాలలో 5.47 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. గరుడసేవనాడు 72,650 మంది దర్శించుకోగా.. గరుడసేవలో దాదాపు 2 లక్షల మంది భక్తులు పాల్గొన్నారు. ఈ ఎనిమిది రోజులు.. రోజుకు 8 లక్షల లడ్డూలు అందుబాటులో ఉంచగా, 30.22 లక్షల లడ్డూలు విక్రయించారు.. రూ.24.22 కోట్లు విలువైన హుండీ కానుకలు వచ్చాయి.
తిరుపతి శ్రీగోవిందరాజస్వామి ఆలయంలో నూతనంగా వేదాశీర్వచనం, కుంకుమార్చన ఆర్జిత సేవలను ప్రవేశపెట్టినట్లు టీటీడీ తెలిపింది. వీటికి సంబంధించిన టిక్కెట్లను టీటీడీ వెబ్‌సైట్ ద్వారా బుక్ చేసుకోచ్చని వెల్లడించింది. తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య నిత్యం పెరుగుతూనే ఉంది. దీనివల్ల ఆదాయం కూడా పెరుగుతోంది. హుండీతోపాటు, ఇతరత్రా సేవల ద్వారా కూడా టీటీడీకి ఆదాయం లభిస్తోంది.