Tomato Price: మొన్నటివరకూ వినియోగదారులను ఏడిపించిన టమాటా ఇప్పుడు వ్యాపారులను, రైతులను ఏడిపిస్తోంది. మార్కెట్‌లో టమాటా రేటు పూర్తిగా పతనమైంది. హోల్‌సేల్ మార్కెట్లో కిలో 30 పైసలకు అమ్మినా కూడా ఎవరూ కొనడంలేదు. దీంతో భారీ మొత్తంలో టమాటాలను చెత్తకుప్పలో పడేస్తున్నారు రైతులు. కొనుగోలుదారులు లేక తీవ్ర నష్టాలు చూస్తున్నారు. సరిగ్గా నెల క్రితం వరకూ టమాటా రేటు సామాన్యులను ఏడిపించింది. దాదాపు చికెన్ రేటుకు సమాన ధరకు చేరుకుని, ఖరీదైన కాయగూరగా మారింది.
కొన్ని ప్రాంతాల్లో అయితే వ్యాపారులు టమాటాలు అమ్మడమే మానేశారు. టమాటా పంట వేసిన రైతులు లక్షాదికారులు అయిన సంఘటనలు కూడా ఉన్నాయి. రవాణా వ్యవస్థలో ఏర్పడిన అంతరాయంగా కారణంగా మార్కెట్‌లో రెండు నెలల క్రితం టమాటాకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. అన్ని వంటకాల్లో వాడాల్సిన వెజిటేబుల్ కావడంతో ఎక్కువ రేటైనా పెట్టి కొనుక్కున్నారు వినియోగదారులు. కానీ ఆ తరువాత ట్రాన్స్‌పోర్ట్ సిస్టం మెరుగుపడటంతో పరిస్థితో మార్పు వచ్చింది. టమాటాలు అందుబాటులోకి రావడంతో క్రమంగా రేటు తగ్గుతూ వచ్చింది. అలా తగ్గిన రేట్లు ఇప్పుడు రికార్డ్ స్థాయిలో పడిపోయాయి.
కొన్ని మార్కెట్లలో 30 పైసలకు కిలో టమాటా ఇస్తాం అన్నా కూడా కొనేందుకు కస్టమర్లు లేరు. దీంతో రైతులు, వ్యాపారులు టమాలాను చెత్త కుప్పలో వేస్తున్నారు. వాటిని పశువులకు మేతగా వేస్తున్నారు. ప్రస్తుతం టమాటాకు కనీసం పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేక ఇబ్బందులు పడుతున్నారు.