Tomato Price: కిలో రూ.300 చేరుకోనున్న టమాటా.. కందిపప్పు అదే బాటలో.. సామాన్యుడికి షాకుల మీద షాకులు..!

వ్యవసాయ రంగ నిపుణుల అంచనా ప్రకారం.. ఇంకొంతకాలం టమాటా ధరలు ఇలాగే పెరగొచ్చు. వర్షాలు కొత్త పంటలు వేసేందుకు అనువుగా లేవు. దీంతో మరిన్ని రోజులు ధరలు ఇలాగే పెరుగుతాయి. ధరలు అదుపులోకి రావడానికి కనీసం రెండు నెలల సమయం పడుతుంది.

  • Written By:
  • Publish Date - July 14, 2023 / 05:04 PM IST

Tomato Price: దేశవ్యాప్తంగా టమాటా ధరలు సామాన్యుడికి షాక్ ఇస్తున్న సంగతి తెలిసిందే. కిలో వంద రూపాయలు ఎప్పుడో దాటాయి. కొన్ని చోట్ల కిలో రూ.150 నుంచి రూ.180 వరకు పలుకుతున్నాయి. ఈ ధరలకే ఇంత షాకవుతుంటే.. ఇప్పుడు మరింత పెద్ద షాక్ తగలబోతుందంటున్నారు వ్యవసాయ రంగ నిపుణులు. కిలో టమాటా రూ.300 కూడా చేరుకోవచ్చని అంచనా వేస్తున్నారు. పంటలకు అనువైన వాతావరణం లేకపోవడం.. కొన్ని చోట్ల అతివృష్టి, ఇంకొన్ని చోట్ల అనావృష్టి కారణంగా టమాటా ధరలు మరింత పెరుగుతాయని నిపుణులు అంటున్నారు.

వ్యవసాయ రంగ నిపుణుల అంచనా ప్రకారం.. ఇంకొంతకాలం టమాటా ధరలు ఇలాగే పెరగొచ్చు. వర్షాలు కొత్త పంటలు వేసేందుకు అనువుగా లేవు. దీంతో మరిన్ని రోజులు ధరలు ఇలాగే పెరుగుతాయి. ధరలు అదుపులోకి రావడానికి కనీసం రెండు నెలల సమయం పడుతుంది. జూన్ ప్రారంభంలో టమాట కేజీ ధర రూ.40 ఉండగా, ఈ నెల ప్రారంభంలో రూ.100కే చేరింది. ఇప్పుడు రూ.150 దాకా పలుకుతోంది. హిమాచల్ ప్రదేశ్ సహా ఉత్తర భారతంలో కురుస్తున్న వర్షాలకు ఈ ధరలు మరింత పెరగొచ్చు. రాబోయే రోజుల్లోనే రూ.200 చేరుతుంది. ఆపై మరింతగా టమాటా ధరలు పెరుగుతాయి. ప్రస్తుతం రైతులు టమాటా పంట వేసినా అది పూర్తిగా చేతికి రావడానికి రెండు నుంచి మూడు నెలల టైం పడుతుంది. అప్పటివరకు టమాటా ధరలు సామాన్యుడికి అందకుండా ఉండటం ఖాయం.
కందిపప్పు ధర పైపైకి
భారతీయులు అత్యధికంగా వాడే వంటకాల్లో కందిపప్పు ఒకటి. ఇండియన్ థాలి అంటే.. టమాటాతోపాటు కందిపప్పుతో చేసిన వంట ఉండాల్సిందే. అయితే, ఇప్పుడు కందిపప్పుతోపాటు ఇతర పప్పుల ధరలు పది శాతంపైగా పెరిగాయి. ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. బియ్యం ధరలు 10 శాతం, గోధుమల ధరలు 12 శాతం పెరిగాయి. దీంతో ఇండియన్స్ ఎంతో ఇష్టంగా తినే అన్నం, చపాతీలు, దాల్ కూడా ఖరీదయ్యే అవకాశం ఉంది. ఇలా భారతీయులు నిత్యం వినియోగించే సరుకుల ధరలు పెరుగుతుండటంతో సామాన్యుడి జీవితం మరింత భారంగా మారుతోంది. భోజనం అత్యంత ఖరీదైన వ్యవహారంగా మారుతుండటంపై సామాన్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం దేశంలోని అనేక రాష్ట్రాల్లో కరువు పరిస్థితులు నెలకొనడంతో ముందుముందు ఇంకెంత ధరాభారాన్ని మోయాల్సి వస్తుందోనని బాధపడుతున్నారు. సరైన రీతిలో వర్షాలు పడి, కొత్త పంట అందుబాటులోకి వచ్చినప్పుడు మళ్లీ నిత్యావసరాల ధరలు అందుబాటులో ఉంటాయి.
తక్కువ ధరకే టమాటాలు
టమాటా ధరల నుంచి సామాన్యుడికి ఉపశమనం కలిగించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఢిల్లీతోపాటు లక్నో, నోయిడా, పాట్నా వంటి కొన్ని ప్రధాన నగరాల్లో టమాటల్ని తక్కువ ధరకే అందిస్తోంది. కేజీ రూ.90కే టమాటాలు సరఫరా చేస్తోంది. అయితే, ఒక్క వినియోగదారుడికి రెండు కిలోలు మాత్రమే అందిస్తోంది. వివిధ రాష్ట్రాల్లో పార్టీలు కూడా ఇలా తక్కువ ధరలోనే టమాటాలు అందించేందుకు ప్రయత్నిస్తున్నాయి. అది కూడా కొన్ని చోట్ల మాత్రమే. ఇవన్నీ తాత్కాలిక ఉపశమనాలే.