Tomato Prices: టమాట అనే మాట ఎత్తేందుకే మొన్నటి వరకు భయం అయ్యేది. ఆ రేంజ్‌లో ధరలు పెరిగి సామాన్యుడిని ఇబ్బంది పెట్టాయి. కట్ చేస్తే.. టమాటా ధరలు ఇప్పుడు ఒక్కసారిగా పడిపోతున్నాయి. రెండు రోజులుగా పరిస్థితి మారిపోయింది. ఆసియాలోకెల్లా అతిపెద్ద టమాటా మార్కెట్ అయిన మదనపల్లితో పాటుగా మిగిలిన మార్కెట్‌లలో కూడా ధరలు పతనం అవుతున్నాయి.
ఓ సమయంలో కేజీ టమాటా 2 వందల రూపాయలు పైగా పలికితే.. ఇప్పుడు పరిస్థితి మొత్తం తలకిందులయింది. రెండు రోజులుగా కేజీ 50రూపాయల కంటే దిగువకు వస్తోంది. కొన్నిచోట్ల 30 రూపాయలకు కిలో టమాటాలు లభిస్తున్నాయి. ఈ ధర ఇంకా తగ్గిపోతుందా అనే చర్చ జరుగుతోంది. అదే కనుక జరిగితే రైతులకు మళ్లీ కష్టాలు మొదలైనట్లే. టమాటా ధరలు తగ్గడానికి దిగుబడి పెరగడమే కారణం. చిత్తూరు జిల్లాతో పాటుగా పక్క జిల్లాల్లో, పొరుగు రాష్ట్రాల్లో టమోటా దిగుబడి పెరగడంతో టమాటా పంట భారీగా మార్కెట్‌కు వస్తోంది. ఈ పంట కోసం బయ్యర్ల నుంచి కూడా పోటీ లేదు. దీంతో గిరాకీ తగ్గి టమాటాల ధర పడిపోతోందని అంచనా వేస్తున్నారు. మొన్నటి వరకు టమాటా పేరు చెబితే వణికిపోయిన సామాన్యులకు ఇది ఊరటనిచ్చే అంశం కాగా రైతులకు మాత్రం ఇబ్బంది కలిగిస్తోంది.
ఇంతకాలం టమాటాల ధరలు అమాంతం పెరగడంతో జనాలు ఇబ్బంది పడ్డారు. కానీ టమటా రైతులకు మాత్రం కాసుల వర్షం కురిసింది. కొందరు అన్నదాతలు ఏకంగా కోటీశ్వరులయ్యారు. ఇలా మొన్నటి వరకు కోట్లాది రూపాయల లాభాలు చూసిన అన్నదాతలు.. ఇప్పుడు ధరలు దారుణంగా పడిపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ధరలు ఇంకా తగ్గిపోతే పరిస్థితి ఏంటనే ఆందోళన వారిలో మొదలైంది.