Tomato Farmers: వినియోగదారులకు కన్నీళ్లు తెప్పిస్తున్న టమాటా రైతుల ఇంట మాత్రం సిరుల పంట పండిస్తోంది. ఈ కాలంలో టమాటా పండిస్తున్న రైతులు లక్షాధికారులుగా, కొందరైతే ఏకంగా కోటీశ్వరులుగా మారిపోతున్నారు. మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్‌తోపాటు వివిధ రాష్ట్రాలకు చెందిన రైతులు లాభాలు ఆర్జిస్తూ భారీ ఆదాయం పొందుతున్నారు. ఈ నెల రోజుల్లోనే కోటీశ్వరులుగా మారిపోయారు.
రూ.3 కోట్ల ఆదాయం
రైతు, వ్యవసాయం అనగానే వారి కష్టాలు, కన్నీళ్లే గుర్తొస్తాయి. అంతగా పంటతో నష్టాల్ని చవి చూస్తుంటారు కొన్నిసార్లు. అయితే, కాలం కలిసొస్తే అదే పంట సిరులు కురిపిస్తుంది. తాజాగా టమాటా రైతులు దేశవ్యాప్తంగా భారీ లాభాల్ని కళ్ల జూస్తున్నారు. మహారాష్ట్రాలోని పుణే జిల్లా, జున్నార్ తహసీల్‌కు చెందిన ఈశ్వర్ గాయ్‌కర్ అనే రైతు ఈ సీజన్‌లో టమాటా సాగు ద్వారా ఏకంగా రూ. 3కోట్లు అర్జించారు. పండించిన టమాటాలు విక్రయించి నెల రోజుల వ్యవధిలోనే రూ. కోట్ల వరకు సంపాదించాడు. గత నెల 11 నుంచి ఈ నెల 18 వరకు 3,60,000 కిలోల టమాటాల్ని విక్రయించాడు. దీని ద్వారా సుమారు రూ.3 కోట్ల ఆదాయం పొందినట్లు చెప్పాడు. మరో 80 వేల కిలోల పంట తన పొలంలో పండే అవకాశం ఉందని, దీని ద్వారా మరో రూ.50 లక్షల వరకు ఆదాయం రావొచ్చని ఈశ్వర్ చెప్పాడు. తనకు మొత్తం 18 ఎకరాలు ఉండగా అందులో 12 ఎకరాలలో టమాటా సాగు చేస్తున్నట్లు చెప్పాడు. అయితే, గతంలో టమాటా సాగువల్ల తాను ఎంతో ఆదాయం నష్టపోయినట్లు చెప్పాడు. ముఖ్యంగా వేసవిలోనే నష్టాలు చవిచూశానన్నాడు.
మరో రైతు కోటిన్నర
ఇదే పుణే జిల్లాకు చెందిన తుకారం బోగోజీ గాయకర్ అనే రైతు ఇటీవల టమాటా పంట వల్ల రూ.కోటిన్నరకుపైగా ఆదాయం సంపాదించాడు. అతడు తనకున్న 12 ఎకరాలో టమాటా పంట సాగు చేశాడు. ఈ పంటపై సరైన అవగాహన ఉండటం వల్లే అతడు టమాటా సాగు చేస్తున్నట్లు చెప్పాడు. దీంతో ఈసారి అధిక దిగుబడి వచ్చిందన్నాడు. ఒక్కో పెట్టెను రూ.2,100 కు అమ్మినట్లు, మొత్తం 900 పెట్టెలు అమ్మినట్లు, దీని ద్వారా ఒక్క రోజులోనే రూ.18 లక్షలు సంపాదించినట్లు చెప్పాడు. చత్తీస్‌గఢ్, ధంతరీ జిల్లా, బీరన్ గ్రామానికి చెందిన అరుణ్ సాహూ అనే రైతు కూడా ఈ సీజన్‌లో టమాటా సాగు ద్వారా రూ.కోటికిపైగానే ఆదాయం సంపాదించాడు. తనకున్న 150 ఎకరాల్లో పండిన టమాటాను విక్రయించి ఈ స్థాయి ఆదాయం పొందాడు. రోజుకు 600 నుంచి 700 పెట్టెల వరకు టమాటాలు విక్రయిస్తున్నట్లు, రూ.కోటికిపైగా సంపాదించినట్లు చెప్పాడు.
తెలంగాణ రైతుకు రూ.13 లక్షల ఆదాయం
ఇతర రాష్ట్రాల్లోనే కాదు.. తెలంగాణ రైతులు కూడా టమాటా విక్రయాల ద్వారా లక్షల ఆదాయం పొందుతున్నారు. వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలానికి చెందిన పంతులుబాయి శ్రీనివాస్ అనే రైతు ఈసారి టమాటా సాగుతో ఏకంగా రూ.13.5 లక్షల ఆదాయం పొందాడు. తనకున్న ఎకరంన్నర పొలంలోనే టమాటా సాగు చేసి ఈ ఆదాయం పొందడం విశేషం. అయితే, గతంలో మూడుసార్లు టమాట సాగు చేసి రూ.2 లక్షలకు పైగా అప్పులపాలయ్యాడు. అయినా తిరిగి మళ్లీ అదే పంట వేసి ఈసారి భారీ లాభాలు పొందాడు. ఈ సీజన్‌లో పంట చేతికొచ్చే సమయానికి మార్కెట్‌లో కిలో టమాట రూ.150 నుంచి రూ.200 వరకు ధర పలికింది. దీంతో 20 కిలోల టమాట బాక్సును రూ.రెండు వేల నుంచి రెండున్నర వేలకు విక్రయించాడు. దీనిద్వారా పెట్టుబడి పోను రూ.13.5 లక్షల లాభాన్ని పొందినట్లు శ్రీనివాస్ చెప్పాడు. గతంలో టమాటా వల్ల ఎంతో నష్టపోయినప్పటికీ ఈసారి మాత్రం లాభాలు పొందడం ఆనందంగా ఉందన్నాడు. ఇలాగే ఎందరో రైతులు టమాటా సాగు ద్వారా ఇటీవలి కాలంలో లక్షల రూపాయలు ఆర్జిస్తున్నారు.