Sanitary Napkin: ప్రభుత్వ కాలేజీల్లో శానిటరీ న్యాప్‌కిన్స్.. హైకోర్టు ఆదేశం

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని జూనియర్ కాలేజీల్లో శానిటరీ న్యాప్‌కిన్ వెండింగ్ మెషీన్లు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఇందుకోసం మూడు నెలల సమయం ఇచ్చింది.

  • Written By:
  • Publish Date - December 21, 2023 / 02:51 PM IST

Sanitary Napkin: తెలంగాణలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో శానిటరీ న్యాప్‌కిన్స్ అందుబాటులో ఉంచాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు న్యాప్‌కిన్ వెండింగ్ మెషీన్స్ ఏర్పాటు చేయాలని సూచించింది. హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ అరాధె, జస్టిస్ అనిల్ కుమార్ జూకంటితో కూడిన ధర్మాసనం తాజా ఆదేశాలు జారీ చేసింది.

Singareni Elections: సింగరేణి ఎన్నికలకు హైకోర్టు అంగీకారం..

ఇటీవల సరూర్ నగర్ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో శానిటరీ న్యాప్‌కిన్స్ లేకపోవడం వల్ల విద్యార్థినిలు ఇబ్బంది పడటంపై హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. విద్యార్థులకు కాలేజీలో శానిటరీ న్యాప్‌కిన్స్ అందుబాటులో ఉంచాలని పిల్‌లో కోరారు. దీనిపై స్పందించిన కోర్టు.. తెలంగాణ ప్రభుత్వం, ఇంటర్ బోర్డుకు తాజా ఆదేశాలు జారీ చేసింది. ఒక్క సరూర్ నగర్ కాలేజీలోనే కాకుండా.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని జూనియర్ కాలేజీల్లో శానిటరీ న్యాప్‌కిన్ వెండింగ్ మెషీన్లు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఇందుకోసం మూడు నెలల సమయం ఇచ్చింది. వెంటనే తమ ఆదేశాల్ని అమలు చేయాలని సూచించింది.

అలాగే విద్యార్థినులకు కాలేజీల్లో సరైన టాయిలెట్లు లేకపోవడంపై కూడా ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. టాయిలెట్లు కట్టడానికి ఇరవై సంవత్సరాలు తీసుకుంటారా.. అంటూ ప్రశ్నించింది. ప్రతి కాలేజీలో విధిగా టాయిలెట్లు ఉండాలని ఆదేశించింది. దీనికి స్పందించిన ప్రభుత్వం ఇందుకోసం ఇప్పటికే రూ.10.25కోట్లు కేటాయించినట్లు చెప్పింది. దీని ద్వారా వివిధ జిల్లాల్లోని 41 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో టాయిలెట్లు నిర్మిస్తున్నట్లు తెలిపారు. మొత్తంగా 300 జూనియర్ కాలేజీల్లో 599 టాయిలెట్ బ్లాకుల కోసం రూ.27.55 కోట్లను మంజూరు చేసినట్లు ప్రభుత్వం తెలిపింది.