TSPSC: గ్రూప్స్, సివిల్స్ వంటి కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు సెప్టెంబర్ నెల చాలా కీలకం కానుంది. తెలంగాణకు సంబంధించి ఈ నెలలో పలు పరీక్షలు జరగబోతున్నాయి. ఇక దేశవ్యాప్తంగా సివిల్ సర్వీసెస్ కోసం కూడా ఈ నెలలోనే మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి.
తెలంగాణలో టీఎస్‌పీఎస్‌సీ ఆధ్వర్యంలో ఈ నెలలో నిర్వహించబోయే పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ విడుదలైంది. గ్రూప్స్ పేపర్ లీక్ కారణంగా రద్దైన వాటిని పూర్తి చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. శనివారం విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం జరగబోయే పరీక్షలు ఇవే. ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో 247 లెక్చరర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటి భర్తీకి సంబంధించిన సెప్టెంబర్ 4, 5, 6, 8వ తేదీల్లో పరీక్షలు జరగనుండగా, ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లోని పీడీ పోస్టులకు సంబంధించిన పరీక్ష ఈ నెల 11న, ప్రభుత్వ జూనియర్ కాలేజీల అధ్యాపక పోస్టుల భర్తీ కోసం పరీక్షలు ఈ నెల 12, 13, 14, 20, 21, 22, 25, 26, 27, 29వ తేదీల్లో జరుగుతాయి. వివిధ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. లెక్చరర్ పోస్టులకు సంబంధించి వేర్వేరు సబ్జెక్టులకు పరీక్షలు రాసినప్పటికీ, జనరల్ స్టడీస్ పేపర్-1 పరీక్ష తప్పనిసరిగా రాయాలి. పరీక్షలకు ముందు టీఎస్‌పీఎస్‌సీ వెబ్‌సైట్‌లో మాక్ టెస్ట్ అటెండ్ చేయొచ్చు. పరీక్షలకు సంబంధించిన పూర్తి వివరాలకు సంస్థ వెబ్‌సైట్ https://www.tspsc.gov.in/ సంప్రదించాలి. నిర్ణీత తేదీల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12: 30 వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి.
యూపీఎస్‌సీ సివిల్స్ మెయిన్స్ షెడ్యూల్ విడుదల
ప్రతిఏటా యూపీఎస్‌సీ నిర్వహించే మెయిన్స్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. సెప్టెంబర్ 15, 16, 17, 23, 24 తేదీల్లో సివిల్ సర్వీసెస్ మెయిన్స్ పరీక్షలు జరుగుతాయి. ప్రతిరోజూ రెండు సెషన్లలో పరీక్షలు జరుగుతాయి. మొత్తం 1750 మార్కులకు సివిల్స్ మెయిన్స్ పరీక్షలు నిర్వహిస్తారు. ఇందులో అర్హత సాధించిన వారికి 275 మార్కులకు ఇంటర్వ్యూ ఉంటుంది. మెయిన్స్, ఇంటర్వ్యూ కలిపి 2025 మార్కులకు తుది ఎంపిక ఉంటుంది. పరీక్షలో మొత్తం 7 పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపరుకు 250 మార్కులు కేటాయించారు. అయితే వీటిలో ఒక్కో పేపరుకు 300 మార్కుల చొప్పున క్వాలిఫయింగ్ పేపర్లు (పేపర్-ఎ, పేపర్-బి) ఉంటాయి. ఈ ఏడాది సివిల్ సర్వీసెస్ పరీక్షల ద్వారా మొత్తం 1105 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ పరీక్షలకు మొత్తం 14,624 మంది అభ్యర్థులు అర్హత సాధించారు.