TTD: తిరుమల శ్రీవారి భక్తుల కోసం టీటీడీ మంగళసూత్రాల్ని అందుబాటులోకి తేనుంది. మహిళలు పవిత్రంగా భావించే మంగళసూత్రాలు (తాళి బొట్లు)ను టీటీడీ అందించనుంది. ఈ మేరకు టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ధర్మకర్తల మండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ వివరాల్ని మీడియాకు వెల్లడించారు. శ్రీ వేంకటేశ్వర స్వామి భక్తులు స్వామి వారికి బంగారం సమర్పిస్తుంటారనే సంగతి తెలిసిందే.
Rajya Sabha Elections: రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల..
ఆ బంగారంతో, స్వామివారి ఆశీస్సులతో మంగళ సూత్రాలు తయారు చేయించాలని టీటీడీ నిర్ణయించింది. ఇలా తయారు చేయించిన తాళి బొట్లను శ్రీ వేంకటేశ్వర స్వామి పాదాలచెత ఉంచి, పూజలు చేస్తారు. అనంతరం వాటిని భక్తులకు విక్రయిస్తారు. లాభ, నష్టాలు లేకుండా.. తయారీ ధరకే వీటిని విక్రయిస్తారు. ఈ మంగళ సూత్రాలు 5 గ్రాములు, 10 గ్రాముల బరువుతో ఉంటాయి. నాలుగైదు డిజైన్లలో వీటిని తయారు చేయబోతున్నారు. సనాతన హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా టీటీడీ వీటిని తయారు చేయబోతోంది. పెళ్లైన వాళ్లు, పెళ్లి చేసుకోబోతున్న వాళ్లు.. ఈ తాళిబొట్లను ధరించడం వల్ల దీర్ఘ సుమంగళిగా ఉంటారని భక్తుల విశ్వాసం. త్వరలోనే ఇవి భక్తులకు అందుబాటులోకి వస్తాయి.
గతంలో టీటీడీ ఆధ్వర్యంలో ఉచిత సామూహిక వివాహాలు నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంలో సుమారు 32 వేల మంది వధువులకు స్వామివారి ఆశీస్సులు అందించిన మంగళ సూత్రాలు ఉచితంగా అందించారు. ఈ జంటలన్నీ స్వామివారి ఆశీస్సులతో జీవిస్తున్నారు.