Himalayas: హిమాలయ గర్భంలో అలజడి..ప్రమాదంలో ప్రపంచంలోనే ఎత్తైన శివాలయం..దేనికి సంకేతం ?

ఓం నమఃశివాయ..హరహర శంభోశంకర అంటూ శివనామస్మరణతో మారుమోగే శైవక్షేత్రం ప్రమాదపుటంచుల్లో చిక్కుకుంది. దేవభూమి ఉత్తరాఖండ్‌లో హిమాలయ పర్వత శ్రేణుల్లో రుద్రప్రయాగకు సమీపంలో కొలువుతీరిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శివాలయం తుంగనాథ ఆలయం పక్కకు ఒరిగిపోయింది.

రుద్రప్రయాగ్ జిల్లాలో గర్వాల్ హిమాలయాల్లో సముద్ర మట్టానికి 12వేల 800 అడుగుల ఎత్తులో ఉన్న తుంగనాథ ఆలయం సహజ నిర్మాణానికి భిన్నంగా 6 నుంచి 10 డిగ్రీలు పక్కకు వాలిపోయిందని భారత పురావస్తు శాస్త్రవేత్తలు నిర్ధారించారు. హిమాలయ పర్వత గర్భంలో జరుగుతున్న మార్పుల వల్లే తుంగనాథ ఆలయం పక్కకు ఒరిగిపోయిందా అన్న కోణంలో పురావస్తు శాస్త్రవేత్తలు పరిశోధనలు జరుపుతున్నారు. నిత్యం వేలాది మంది భక్తులతో దూపదీప నైవేధ్యాలతో శివనామస్మరణతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచే తుంగనాథ ఆలయం పక్కకు ఒరిగిపోతుందన్న వార్త శివభక్తులను కలవరపెడుతుంది.

తుంగనాథ్ ఆలయానికి ఎంతో విశిష్టత
హిందూ పురాణాల్లో తుంగనాథ్ ఆలయానికి ఎంతో విశిష్టత ఉంది. రుద్రప్రయాగ జిల్లాలో ఉన్న పంచ కేదార్ ఆలయాల్లో ఇది ప్రముఖమైంది. పంచ కేదార్ ఆలయాల సృష్టికి సంబంధించి పురాణాల్లో ఎన్నో కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. కురుక్షేత్ర యుద్ధం తర్వాత పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకునేందుకు పాండవులు.. శివుడి ఆశీర్వాదాన్ని పొందేందుకు ఎన్నో క్షేత్రాలు తిరుగుతారు. వారణాసి మీదుగా ప్రస్తుత ఉత్తరాఖండ్‌లోని గర్వాల్ ప్రాంతంలోని కేదార్ ఖండ్‌కు చేరుకుంటారు. పాండవులకు శివుడు ఐదు రూపాల్లో విభిన్న ప్రాంతాల్లో దర్శనమివ్వడంతో ఆ ఐదు ప్రాంతాల్లో శంకరుడికి ఆలయాలు నిర్వహిస్తారు. అవే పంచ కేదార్ క్షేత్రాలుగా భక్తులకు శంకరుడి దర్శనభాగ్యాన్ని కల్గిస్తున్నాయి. ప్రస్తుతమున్న ఆలయాన్ని 8వ శతాబ్దంలో అప్పటి పాలకులు కత్యూరి రాజవంశీకులు నిర్మించినట్టు చారిత్రక ఆధారాలు ఉన్నాయి.

ఓవైపు ఆధ్యాత్మికం..మరోవైపు ప్రకృతి సోయగం
ఉత్తరాఖండ్ అంటేనే దేవభూమి..ఇక గర్వాల్ హిమాలయాల్లో అడుగుపెడితే ఆధ్యాత్మిక పరిమళానికి తోడు ప్రకృతి రమణీయత యాత్రికులను ముగ్ధమనోహరంగా కట్టిపడేస్తుంది. మందాకని, అలకనందా నదీ లోయలు ఓవైపు…హిమాలయ పర్వత శిఖరాలు మరోవైపు… పర్యాటకులను రారమ్మంటు ఆహ్వానిస్తూ ఉంటాయి. తుంగనాథ్ ఆలయం…చంద్రశిలా శిఖరానికి సమీపంలోనే ఉంటుంది. ఎన్నో ప్రయాసలకోడ్చి అక్కడి వరకు చేరుకుని శివుడిని దర్శించుకోవడమే మోక్షంగా భావిస్తారు శివభక్తులు. అంతటి విశిష్ట కలిగిన ఆలయం ప్రస్తుతం ప్రమాదంలో పడటంపై భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

తుంగనాథ్ ఆలయానికి ఎందుకిలా జరిగింది ?
హిమాలయ అంచుల్లో ఉన్న ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని అనేక కట్టడాలు, నిర్మాణాలు ఇప్పటికే ప్రమాదపుటంచుల్లో ఉన్నాయి. పర్యావరణ మార్పుల కారణంగా హిమాలయ పర్వతాల్లో సంభవించే అనేక కదలికలు… ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ఉత్తరాభిముఖంగా ఉండే తుంగనాథ్ ఆలయం ఉన్న ప్రాంతంలో కూడా ఇలాంటిదే జరుగుతున్నట్టు పురావస్తు శాస్త్రవేత్తలు అనుమానిస్తున్నారు. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక కూడా పంపారు. తక్షణం స్పందించి రక్షణ చర్యలు చేపట్టకపోతే తుంగనాథ్ ఆలయం పూర్తిగా కూలిపోయే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు.

పురావస్తు శాఖ పరిధిలోకి తుంగనాథ్ ఆలయం ?
ప్రస్తుతం తుంగనాథ్ ఆలయ నిర్వహణ బాధ్యతలను బద్రీ కేదార్ టెంపుల్ కమిటీ పరిధిలో ఉంది. కేంద్ర ప్రభుత్వం ఈ ఆలయానికి పొంచి ఉన్న ప్రమాదాన్ని గుర్తించి దీన్ని పరిరక్షించాల్సిన కట్టడాల జాబితాలో చేర్చితే… వెంటనే ఆలయ నిర్వహణ మొత్తం పురావస్తు శాఖ పరిధిలోకి వెళ్తుంది. ఆలయం ఎందుకు పక్కకు ఒరిగింది.. మూల కారణం ఎక్కడుంది వంటి ప్రశ్నలకు సమాధానం కనుగొని పురావస్తు శాఖ వెంటనే రక్షణ చర్యలు చేపడుతుంది. అయితే ఆలయాన్ని పురావస్తు శాఖకు అప్పగించేందుకు బద్రీ కేదార్ కమిటీ సిద్ధంగా లేదు. భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని తుంగనాథ్ ఆలయ బాధ్యతలను తామే నిర్వహిస్తామని.. పురావస్తు శాఖ నుంచి అవసరమైతే సలహాలు, సూచనలు తీసుకుని ఆలయాన్ని పరిరక్షిస్తామని చెబుతున్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం ఎలా ముందడుగు వేయబోతున్నది అన్నది చూడాలి. ఓవైపు పురాతన కట్టడం పరంగా… మరోవైపు ప్రపంచంలోనే ఎత్తైన శివాలయంగా…తుంగనాథ్‌కు ఎంతో చరిత్ర ఉంది.. ఆ చరిత్రను ముందు తరాలకు అందించాలంటే… తుంగనాథ్ ఆలయం మరింత ఒరిగి ప్రమాదంలోకి జారకుండా చూసుకోవాలి.