Deep Sleep Hotel: భూగర్భంలో విశ్రాంతి భవనాలు.. వినోదంతో కూడిన విహారం.. ఎక్కడో తెలుసా..

మనసుకు ఆనందం, ఆహ్లాదం కావాలంటే ఏదైనా వింతైన ప్రదేశానికి వెళ్ళడం మనవునికి పరిపాటి. ఆ యాత్ర అతని బడ్జెట్ మీద ఆధారపడి ఉంటుంది. అయితే విహార యాత్ర విషయంలో ముందుగానే జాగ్రత్తపడాల్సిన అంశం ఒకటి ఉంది. అదే సేదతీరేందుకు సరిపడా రూం ను వెతుక్కోవడం. ఇక్కడ విశ్రాంతి భవనాలే విహార తీరాలుగా మారిపోయాయి. సాధారణంగా మనం గగనతలంపైన, సముద్రగర్భంలో రెస్టారెంట్స్, రిసాట్స్ చూసేఉంటాం. ఇప్పుడు విశ్రాంతి పొందే గదులే వినోదంగా మారిపోయాయి. అంటే ఇంకా ఇంకా అర్థం కాలేదా..? భూమాత ఒడిలో సేదతీరొచ్చు అనమాట. భూగర్భాలు విశ్రాంతి నివాసాలుగా మారిపోయాయి. ఆశ్చర్యంగా ఉందికదూ. అయితే మరెందుకు ఆలస్యం ఇవి ఎక్కడ ఉన్నాయి, వీటి ధర ఎంత, ఎలా చేరుకోవాలి తదితర వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

  • Written By:
  • Updated On - June 16, 2023 / 05:59 PM IST

భూమికి 1375 అడుగుల లోతులో హోటల్స్

ఈ వింతైన భూగర్భ విశ్రాంతి భవనాలు యునైటెడ్ కింగ్ డం నార్త్ వేల్స్ లోని ఎరారీ నేషనల్ పార్క్ సమీపంలో ఉన్నాయి. ఈ ప్రాంతాన్ని చేరుకోవాలంటే ఈ పార్క్ వెంట ఉన్న స్నోడోనియా పర్వతాల కింద భాగంలో ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఈ భూగర్బం లోతు చూస్తే దిమ్మదిరిగి బొమ్మకనబడుతుంది. దాదాపు 1375 అడుగుల కింది భాగంలో అత్యంత హంగులతో నిర్మితమై ఉంటుంది. ప్రపంచంలోనే అత్యంత లోతైన రిసార్ట్ గా దీనికి పేరు ఉంది. దీనికి డీప్ స్లీప్ హోటల్ అని నామకరణం చేశారు. ఈ పార్క్ కింద ఉండే హోటల్ లో రకరకాలా రూములు అందుబాటులో ఉంటాయి. క్యాబిన్ టైప్ గదులు, డబుల్ బెడ్ తో కూడిన సింగల్ రూములు, ట్విన్ బెడ్ గుహ ఆకారంలో ఉండేవి అందుబాటులో ఉంటాయి. అందమైన ఇంటీరియర్ తో ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తాయి. ఇక్కడి లైటింగ్ సెటప్, లొకేషన్ అదిరిపోతుంది.

United Kingdom Under Ground Hotel

అడ్వెంచర్ వెనుక అద్భుతమైన అనుభూతి

ఇక్కడికి వెళ్లాలనుకునేవారు కాస్త అడ్వెంచర్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఈ హోటల్ ని చేరుకోవడం అంత సులువైన పనికాదు. కష్టే ఫలి అన్న మాట ఇక్కడకి వెళ్లాక నిజమే అనిపిస్తుంది. ఈ సాహస యాత్రలో ముందుగా పర్యాటకులు స్నోడోనియా పర్వతాల గుండా ప్రయాణం చేయాలి. ఇక్కడ ఎలాంటి రవాణా సౌకర్యం ఉండదు. కాలినడకన వెళ్లాల్సి ఉంటుంది. ఈ శిఖరం అడుగు భాగానికి చేరుకున్న తరువాత సొరంగ మర్గం గుండా వెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడ హోటల్ సిబ్బంది ఈ ప్రయాణంలో మనకు అవసరమైన బూట్లు, హెల్మెట్, టార్చ్ లైట్, కోట్ అందిస్తారు. వాటిని ధరించి ఆ గుహలోకి ప్రవేశించాల్సి ఉంటుంది. మనతో పాటూ ఒక గైడ్ ని నియమిస్తారు. ఆతని మార్గదర్శకాల ప్రకారం బండరాళ్లు, మెట్ల బావులు, చిన్న చిన్న వంతెనలు దాటుకుంటూ, రాళ్లను పక్కకి నెట్టుకుంటూ ప్రయాణించాలి. ఇలా కొంత దూరం పాటూ ప్రయాణం చేశాక ఒక పెద్ద ఇనుప ద్వారంతో కూడిన తలుపు దర్శనమిస్తుంది. ఆతలుపు తీసుకొని లోనికి వెళితే అండర్ గ్రౌండ్ హోటల్ వచ్చేస్తుంది.

ఇక్కడి రూల్స్ ఇవే

ఇక్కడ కొన్ని రూల్స్ ఉన్నాయి. 14 సంవత్సరములకు లోపు పిల్లలను అనుమతించరు. బస చేయదలచిన వారు రోజుల తరబడి ఉండేందుకు వీలుపడదు. కేవలం రాత్రి పూట మాత్రమే బస చేసేందుకు అనుమతి ఇస్తారు. అది కూడా శనివారం మాత్రమే అతిథులకు ఆతిథ్యాన్ని అందిస్తారు. ఆ ఒక్కరోజు రాత్రి మాత్రమే అక్కడ బస చేసేందుకు ఆహ్వానిస్తారు. అంతేకానీ 365 రోజులు ఈ హోటల్ తెరిచి ఉండదు. ఇదే ఇక్కడి ప్రత్యేకత. గదుల్లో కేవలం 10 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత మాత్రమే ఉంటుంది. అక్కడ ఏర్పాటు చేసిన లైటింగ్ వల్ల కొంత వెచ్చదనం ఉంటుంది. అయినప్పటికీ ఇక్కడ స్టే చేయాలంటే వెచ్చగా ఉండే దుస్తులనే ధరించాల్సి ఉంటుంది.

Deep Sleep Hotel Suite Room

రూముల ధరలు వాటి వివరాలు

ఇక గదుల రెంటల్ వివరాలకు వస్తే మనం సాధారణంగా బయట వెచ్చించే లాగానే ఉంటాయి. ఈ భూగర్భంలో ఉండే ప్రైవేట్ క్యాబిన్ గదిలో ఇద్దరికి మాత్రమే అనుమతిస్తారు. ఇక్కడ బస చేయాలనుకుంటే రూ. 36 వేలు వెచ్చించాలి. అదే విశాలంగా గుహలాంటి రూముల కోసం అయితే రూ. 56 వేల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో నలుగురు ఉండవచ్చు. ఇంతకుమునుపు చెప్పన విధంగా ఒక్క రాత్రికి మాత్రమే బస చేసే అవకాశం ఉంటుంది.

మనసిక ఉల్లాసం.. స్వచ్ఛమైన నిద్ర

డబ్బు గురించి పెద్దగా లెక్కచేయకుండా.. వినోదభరితమైన విలాసం, విశ్రాంతితో కూడిన విహారం కావాలనుకుంటే ఇక్కడకు వెళ్లడం ఉత్తమం. ఇక్కడికి వెళ్లి ఒక్కసారి అనుభూతి చెందితే ఆ రాళ్లలో, బావుల్లో, పర్వతశ్రేణుల గుండా నడుచుకుంటూ వచ్చిన శ్రమ మొత్తం ఇట్టే కరిగిపోతుందని అంటున్నారు. అలాగే ప్రశాంతమైన నిద్ర పొందేందుకు, మానసిక ఉల్లాసం, మైండ్ రీఫ్రెష్ అయ్యేందుకు కూడా ఈ అడ్వెంచర్ ట్రిప్ చాలా ఉపయోగపడుతుంది అని వారి అనుభూతిని అక్కడి పర్యాటకులు పంచుకుంటున్నారు.

T.V.SRIKAR