Bengaluru: బెంగళూరులో అండర్‌గ్రౌండ్ సూపర్ టన్నెల్.. ట్రాఫిక్‌ సమస్యకు చెక్ పడ్డట్లేనా..?

వివిధ సంస్థల ప్రతినిధులు, ప్రభుత్వం మధ్య జరిగిన చర్చల ప్రకారం బెంగళూరులో సూపర్ టన్నెల్ నిర్మించాలని ప్రతిపాదించారు. అంటే నగరం నాలుగు దిక్కులు కలిపేలా ఈ టన్నెల్ నిర్మాణం సాగనుంది. ఇది అండర్‌గ్రౌండ్ టన్నెల్.

  • Written By:
  • Publish Date - June 18, 2023 / 03:02 PM IST

Bengaluru: దేశంలో అత్యంత రద్దీగల నగరాల్లో బెంగళూరు ఒకటి. ఐటీ రంగంలో బెంగళూరు అగ్రస్థానంలో ఉండటంతో దేశ నలమూలల నుంచి ఇక్కడికి వస్తుంటారు. దీంతో నగరం అంతకంతకూ పెరుగుతూపోతోంది. దీనికితోడు ట్రాఫిక్ కష్టాలూ ఎక్కువయ్యాయి. ఇదే ఇప్పుడు బెంగళూరుకు అతిపెద్ద సమస్యగా మారింది. దీనికి చెక్ పెట్టేందుకు ప్రభుత్వం టన్నెల్ రోడ్స్ నిర్మించాలని భావిస్తోంది.
బెంగళూరు ట్రాఫిక్‌లో చిక్కుకుంటే గంటలతరబడి రోడ్ల మీదే ఉండాల్సొస్తుంది. దీంతో ఐటీ సహా వివిధ కంపెనీలకు వెళ్లేవాళ్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నగరం మధ్యలోనే కాదు.. శివారు ప్రాంతాల్లోనూ ఇదే సమస్య. శివారు ప్రాంతాల్లోనూ కంపెనీలు వెలుస్తున్నాయి.

రియల్ ఎస్టేట్ రంగం ఊపుమీదుండటంతో అపార్టుమెంట్లు జోరుగా నిర్మాణమవుతున్నాయి. దీంతో శివారులోనూ కాలనీలు ఎక్కువై, రద్దీ పెరిగింది. ఐటీ ఉద్యోగులు సొంత వాహనాలు కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ కారణంగా భారీ స్థాయిలో వాహనాలు రోడ్లపైకి చేరుతున్నాయి. ఫలితంగా భారీగా ట్రాఫిక్ స్తంభించిపోతోంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఎప్పటికప్పుడు ఫ్లైఓవర్లు, ఎలివేటింగ్ కారిడార్స్ నిర్మాణం, రోడ్ల విస్తరణ చేపడుతున్నా ఫలితం ఉండటం లేదు. అయితే, వీటికి భారీగా భూ సేకరణ జరగాలి. నిధులు కూడా ఎక్కువగానే వెచ్చించాలి. ఈ నేపథ్యంలో బెంగళూరులోని పరిశ్రమలు, ఐటీ సంస్థలు, స్టార్టప్స్ ప్రతినిధులతో ప్రభుత్వం సమావేశమైంది. దీని ప్రకారం ఉద్యోగులకు ఇబ్బంది లేకుండా, ట్రాఫిక్ సమస్య పరిష్కరించేలా కొత్త ప్రణాళికలు రూపొందించింది.
సూపర్ టన్నెల్
వివిధ సంస్థల ప్రతినిధులు, ప్రభుత్వం మధ్య జరిగిన చర్చల ప్రకారం బెంగళూరులో సూపర్ టన్నెల్ నిర్మించాలని ప్రతిపాదించారు. అంటే నగరం నాలుగు దిక్కులు కలిపేలా ఈ టన్నెల్ నిర్మాణం సాగనుంది. సింగపూర్, అమెరికాలోని బోస్టన్ నగరాల్లో ఉన్న టన్నెల్ తరహాలోనే సూపర్ టన్నెల్ నిర్మించబోతున్నారు. ఇది అండర్‌గ్రౌండ్ టన్నెల్. పూర్తిగా భూమి లోపలే నిర్మిస్తారు. ఈ టన్నెల్ నిర్మాణానికి భారీ నిధులు అవసరమవుతాయి. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో వీటి నిర్మాణం జరగుతుంది. బెంగళూరులో రాబోయే 30 ఏళ్ల వరకు జరిగే అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని, ఈ నిర్మాణం జరగబోతుంది. మెట్రో రైలును శివారు ప్రాంతాల వరకు కూడా విస్తరించాలని పారిశ్రామికవేత్తలు ప్రభుత్వాన్ని కోరారు.

శాటిలైట్ టౌన్స్ నిర్మించాలి అని కూడా ప్రభుత్వానికి సూచించారు. శివారులో శాటిలైట్ టౌన్స్ కట్టడం వల్ల ప్రధాన నగరంపై భారం తగ్గుతుంది. కొత్తగా నిర్మాణాలు చేపట్టే ప్రాంతంలో చెరువులు, పార్కులను అభివృద్ధి చేస్తామని, నిధులు సమకూరుస్తామని హామీ ఇచ్చారు. మరోవైపు ట్రాఫిక్ సమస్యను తగ్గించేందుకు ప్రజల దగ్గరి నుంచి కూడా సలహాలు, సూచనలు స్వీకరిస్తామని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తెలిపారు. ఇందుకోసం వెబ్‌సైట్ ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. ఆ తర్వాత పారిశ్రామికవేత్తలు, ప్రజలు, అధికారులతో కలిసి ఒక టాస్క్‌ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేసి, సూపర్ టన్నెల్ నిర్మాణానికి బ్లూప్రింట్ రూపొందిస్తామన్నారు. నగరంలోని డ్రైనేజీ సమస్యపై కూడా డిప్యూటీ సీఎం చర్చించారు. సూపర్ టన్నెల్ నిర్మించడం ద్వారా నగరంలో ట్రాఫిక్ సమస్య తగ్గుతుందని భావిస్తున్నట్లు ఆయన అభిప్రాయపడ్డారు.