Visakhapatnam: గణేష్ సందడి మొదలైంది. ఢిల్లీ నుంచి గల్లీ వరకు.. ఆ లంబోదరుడి పూజలు.. అంబరాన్ని అంటుతున్నాయ్. రకరకాల రూపాల్లో గణేషుడు దర్శనం ఇస్తున్నాడు. వినాయక పూజా విధానంలో విగ్రహానికి అధిక ప్రాధాన్యం ఉంటుంది. అందుకే వినాయక చవితి అంటే ప్రతిమకే.. మొదటి ప్రాధాన్యం ఇస్తారు. రంగు మొదలు ఎత్తు వరకూ అన్నింటా టాప్ ఉండాలని భావిస్తున్నాయి వినాయక ఉత్సవ్ కమిటీలు. వినాయక విగ్రహం విషయంలో విశాఖ వాసులు రికార్డు సృష్టించారు.
117 అడుగుల ఎకో ఫ్రెండ్లీ గణపయ్యను ప్రతిష్టించారు. దేశంలోనే అత్యంగ ఎత్తైన విగ్రహంగా రికార్డ్ నెలకొల్పారు. గాజువాకలో సుమారు 75 లక్షల రూపాయలు ఖర్చు చేసి దీనిని తయారు చేశారు. దీనికి అనంత పంచముఖ మహా గణపతి అని నామకరణం చేశారు. ఎత్తులో దేశాన్ని దాటితే.. ఖర్చులో రాష్ట్రాన్ని అధిగమించింది. దీనిని తయారు చేసేందుకు వెస్ట్ బెంగాల్ నుంచి ప్రత్యేక కళాకారులు నెల రోజులకుపైగా శ్రమించారు. దాదాపు 20 మంది పనివాళ్లతో ఈ విగ్రహం సుందరమైన రూపాన్ని సంతరించుకుంది. ఈ 20 మంది ఒక్కో టీంగా విడిపోయి దీనిని తయారు చేశారు. రూపాన్ని ఒకరు చూసుకుంటే.. పెయింటింగ్ పనులను మరొకరు చూసుకున్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా పూర్తిగా మట్టితోనే చేయించారు. ఈ విగ్రహం నిమజ్జనంలో కూడా ప్రత్యేకతే సంతరించుకోబోతుంది.
వివిధ నదుల నుంచి తెచ్చిన నీరు, పాలతో నెలకొల్పిన ప్రదేశంలోనే నిమజ్జనం చేసేలా ప్రణాళికలు రచించారు. విశాఖలో ఆ విగ్రహాన్ని చూసేందుకు జనాలు బారులు తీరుతున్నారు. కంటి నిండా రూపాన్ని.. కళ్లారా చూసేందుకు భక్తులు తరలివస్తున్నారు.