Vivek Ramaswamy: వివేక్‌తో డిన్నర్‌కు రూ.41 లక్షలు.. ఎందుకు..?

విఖ్యాత టెక్ కంపెనీల నిలయమైన సిలికాన్ వ్యాలీకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్తలతో ఈ నెల 29న వివేక్ భేటీ కానున్నారు. శాన్‌ఫ్రాన్సిస్కోలోని సోషల్ క్యాపిటల్ సంస్థ సీఈవో చామాత్ పలిహపిటియా నివాసంలో జరగనున్న ఈ మీటింగ్ సందర్భంగా ప్రత్యేక విందు ఇవ్వనున్నారు.

  • Written By:
  • Publish Date - September 24, 2023 / 03:41 PM IST

Vivek Ramaswamy: రిపబ్లికన్ పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష అభ్యర్ధిత్వ రేసులో ఉన్న భారత సంతతి వ్యాపారవేత్త వివేక్ రామస్వామి ప్రచారంలో దూసుకుపోతున్నారు. తన ఎన్నికల ప్రచారానికి అవసరమైన నిధుల సేకరణకు ఆయన సిద్ధమయ్యారు. ఇందుకోసం యాపిల్, గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి విఖ్యాత టెక్ కంపెనీల నిలయమైన సిలికాన్ వ్యాలీకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్తలతో ఈ నెల 29న వివేక్ భేటీ కానున్నారు. శాన్‌ఫ్రాన్సిస్కోలోని సోషల్ క్యాపిటల్ సంస్థ సీఈవో చామాత్ పలిహపిటియా నివాసంలో జరగనున్న ఈ మీటింగ్ సందర్భంగా ప్రత్యేక విందు ఇవ్వనున్నారు.

ఈ విందు కార్యక్రమంపైనే ఇప్పుడు అంతటా హాట్ డిబేట్ జరుగుతోంది. ఈ డిన్నర్ కార్యక్రమంలో రిపబ్లికన్ నేత వివేక్ రామస్వామి ప్రత్యేక అతిథిగా పాల్గొననున్నారు. ఈ కాస్ట్లీ మీటింగ్ అండ్ డిన్నర్‌కు సంబంధించిన ఓ ఆహ్వాన పత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒకవేళ ఎవరైనా ప్రముఖులు ఈ విందులో పాల్గొనాలని భావిస్తే.. రూ. 41 లక్షలను (50 వేల డాలర్లు) ఎంట్రీ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుందట. డిన్నర్ క్రమంలో వివేక్ రామస్వామితోనూ చర్చలు జరిపేందుకు ఛాన్స్ కల్పించనున్నారు. రూ.10 కోట్ల సేకరణే లక్ష్యంగా ఈ విందు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
సంచలన ప్రకటనలకు కేరాఫ్ అడ్రస్..
ఎన్నికల ప్రచారంలో భాగంగా వివేక్‌ రామస్వామి సంచలన ప్రకటనలు చేస్తున్నారు. తాను అమెరికా అధ్యక్షుడిని అయితే.. దాదాపు 16 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులను తొలగించడంతోపాటు ఎఫ్‌బీఐ సహా వివిధ సంస్థలను మూసేస్తానని వివేక్ అంటున్నారు. లాటరీ విధానంలో జారీ చేసే హెచ్‌1బీ వీసా ప్రక్రియను రద్దు చేసి.. మెరిటోరియస్ హెచ్‌1బీ వీసాల పంపిణీని తీసుకువస్తానని ఆయన చెబుతున్నారు. చైనాకు చెక్ పెట్టేందుకు భారత్‌, ఇజ్రాయెల్‌, బ్రెజిల్‌, చిలీ వంటి దేశాలతో అమెరికా సంబంధాలను బలోపేతం చేస్తానని వాదిస్తున్నారు.
రోన్ డిశాంటిస్ ప్లేస్‌లోకి వివేక్..
రిపబ్లికన్ పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష అభ్యర్ధిత్వ రేసులో మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మొదటి స్థానంలో ఉండగా, రెండో స్థానంలో వివేక్ ఉన్నారని తాజాగా నిర్వహించిన ఒక సర్వేలో వెల్లడైంది. మూడో స్థానంలో భారత సంతతి అభ్యర్థి నిక్కీ హేలీ కొనసాగుతున్నారు. ఇప్పటిదాకా అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభ్యర్థిత్వానికి ప్రధాన పోటీదారుగా ఉన్నారని భావిస్తున్న ఫ్లోరిడా గవర్నర్ రోన్ డిశాంటిస్‌ను భారత సంతతి అభ్యర్థులు వివేక్ రామస్వామి, నిక్కీ హేలీ వెనక్కి నెట్టారు. రిపబ్లికన్ పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష పీఠానికి పోటీ పడుతున్న వారి మధ్య జరిగిన డిబేట్లలో సత్తా చాటిన వివేక్ రామస్వామి ముందుకు దూసుకుపోయారు. డొనాల్డ్ ట్రంప్ 39 శాతం జీవోపీ ప్రాథమిక ఓట్లతో మొదటి స్థానంలో కొనసాగుతున్నారు. అభ్యర్థిత్వ రేసులో రెండో స్థానంలో ఉన్న రోన్ డిశాంటిస్ ఒక్కసారిగా ఐదో స్థానానికి పడిపోయారు.