Vande Bharat Express: సికింద్రాబాద్-విశాఖ వందేభారత్ రైలు రద్దు.. కారణం.. ఏంటంటే..?

వందేభారత్ రైలును సాంకేతిక కారణాలతో నిలిపివేసినట్లు వాల్తేరు రైల్వే డివిజన్ అధికారులు ప్రకటించారు. సికింద్రాబాద్-విశాఖ వందేభారత్ రైలు వారంలో ఆరు రోజులు నడుస్తుంది. ఈ రైలు ప్రతీ రోజు ఉదయం విశాఖలో బయల్దేరి మధ్నాహ్నం సికింద్రాబాద్ చేరుకుంటుంది.

  • Written By:
  • Publish Date - August 17, 2023 / 12:31 PM IST

Vande Bharat Express: ప్రధాని మోదీ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన విశాఖ-సికింద్రాబాద్ వందేభారత్ రైలు ఆగిపోయింది. వందేభారత్ రైలు స్థానంలో మరో రైలును అధికారులు అందుబాటులోకి తెచ్చారు. వందేభారత్ రైలు వెళ్లే మార్గాల్లోనే ఈ రైలు కూడా ప్రయాణిస్తుంది. ఆ రైలు ఆగే స్టేషన్లలోనే ఈ రైలు కూడా ఆగుతుంది. వందేభారత్ రైలును సాంకేతిక కారణాలతో నిలిపివేసినట్లు వాల్తేరు రైల్వే డివిజన్ అధికారులు ప్రకటించారు.
సికింద్రాబాద్-విశాఖ వందేభారత్ రైలు వారంలో ఆరు రోజులు నడుస్తుంది.

ఈ రైలు ప్రతీ రోజు ఉదయం విశాఖలో బయల్దేరి మధ్నాహ్నం సికింద్రాబాద్ చేరుకుంటుంది. అనంతరం సికింద్రాబాద్ నుంచి బయల్దేరి రాత్రికి విశాఖ చేరుకుంటుంది. 20833/34 నెంబర్ గల ఈ రైలును గురువారం రద్దు చేశారు. రైల్వే కోచ్‌లో సాంకేతిక సమస్యను అధికారులు గుర్తించారు. దీంతో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందీ కలగకుండా ప్రస్తుతం ప్రత్యామ్నాయంగా మరో రైలును అధికారులు ఏర్పాటు చేశారు. అయితే, ఉదయం 05:45 గంటలకు బయల్దేరాల్సిన రైలు 07:05 గంటలకు బయలుదేరింది. అలాగే వందేభారత్ రైలులో కల్పించే భోజన సదుపాయాల్ని కూడా కల్పిస్తామని అధికారులు తెలిపారు. ఒకవేళ వేరే రైలులో ప్రయాణించడం ఇష్టం లేకుంటే టిక్కెట్ క్యాన్సిల్ చేసుకోవచ్చు. అలాంటివారికి పూర్తి డబ్బులు రీఫండ్ చేస్తామని చెప్పారు.

ప్రత్యేక రైలులో ప్రయాణించే వారికి టిక్కెట్ తేడాకు అనుగుణంగా మిగిలిన డబ్బు రీఫండ్ చేస్తున్నట్లు కూడా వెల్లడించారు. ప్రయాణికుల అవసరాలు తీర్చడానికి అవసరమైనం టికెట్ చెకింగ్ స్టాఫ్, సెక్యూరిటీ, క్యాటరింగ్ సిబ్బందిని నియమించినట్లు రైల్వే శాఖ వెల్లడించింది. ప్రత్యేక రైలులో కూడా వందేభారత్ సిబ్బంది పని చేస్తున్నారు. అదే తరహా సర్వీస్ కల్పించనున్నారు. కాగా, ఈ రైలు గురువారం మాత్రమే రద్దయిందని, శుక్రవారం నుంచి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. కోచ్‌ల్లో తలెత్తిన సాంకేతిక సమస్య కారణంగా మాత్రమే వందేభారత్ రద్దైందని, ప్రయాణికులు సహకరించాలని రైల్వే శాఖ కోరింది.