China: తైవాన్‌ను చైనా కబళిస్తుందా..?

రష్యా, ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతుండగానే మరో యుద్ధం ముంచుకొచ్చేలా కనిపిస్తోంది. తైవాన్‌ను కబళించేందుకు చైనా వ్యూహాలు ముమ్మరం చేసింది. తైవాన్ జలసంధిని తన కంట్రోల్‌లోకి తీసుకుంటోంది. ఇంతకీ చైనా వ్యూహమేంటి.? డ్రాగన్ ఇప్పుడు ఇంత బుసలు కొట్టడానికి కారణమేంటి.?

  • Written By:
  • Publish Date - April 8, 2023 / 10:00 PM IST

అంతర్జాతీయ సరిహద్దులు మార్చడం ఓ ఆర్ట్.. అందులో చైనా ఆరితేరిపోయింది. దాంతో బౌండరీలు ఉన్న ప్రతిదేశంతోనూ వివాదాలే. ఇక తైవాన్ తమదేనని చాలాకాలంగా వాదిస్తున్న చైనా.. తాజాగా మరో దుర్మార్గానికి తెగబడింది. తైవాన్ జలసంధిని మింగేసేందుకు సిద్ధమవుతోంది. ఆ మార్గంలో ప్రయాణించే నౌకలను తనిఖీ చేయాలని నిర్ణయించింది. అది తమ సరిహద్దే అన్నట్లు, దానిపై తమకే హక్కు ఉందన్నట్లు చైనా వ్యవహరిస్తోంది. ఆ ప్రాంతమంతా తమ అధీనంలో ఉందని చెప్పడమే చైనా లక్ష్యంగా కనిపిస్తోంది. 42 చైనా యుద్ధ విమానాలు తైవాన్ జలసంధిని దాటి ముందుకు దూసుకెళ్లాయి.  విన్యాసాలు నిర్వహించాయి. మిస్సైల్స్‌ ప్రయోగించాయి. చైనా యుద్ధనౌకలు కూడా ఇందులో పాల్గొంటున్నాయి. తైవాన్‌తో పాటు అమెరికాతో కయ్యానికి కాలుదువ్వేందుకే చైనా ఈ దుందుడుకు చర్యలకు దిగినట్లు నిపుణులు చెబుతున్నారు. నిజానికి తైవాన్‌ జలసంధి అన్నది ఇరుదేశాల మధ్య అనధికారిక నియంత్రణ రేఖ లాంటింది. గత కొన్ని దశాబ్దాలుగా దీన్ని గౌరవిస్తూ వస్తున్నాయి. అయితే కొంతకాలంగా చైనా దాన్ని పట్టించుకోవడం మానేసింది.
చాలాకాలంగా తైవాన్‌పై కన్నేసిన చైనా ఇప్పుడు ఎందుకింత దూకుడుగా వ్యవహరిస్తోంది అంటే దానికి పెద్ద కారణమే ఉంది. తైవాన్ అధ్యక్షురాలు త్సాయి యింగ్‌ వెన్‌ అమెరికాలో పర్యటించారు. ఇది చైనాకు కోపాన్ని తెప్పించింది. పైగా యింగ్‌వెన్‌కు అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్‌ కెవిన్‌ మెకార్దీ విందు ఇవ్వడాన్ని అసలు తట్టుకోలేకపోయింది. తిరిగి వచ్చాక అమెరికా అధికారులకు తైవాన్‌ అధ్యక్షురాలు ప్రతి విందు కూడా ఇచ్చారు. దీనిపై బహిరంగంగానే తన ఆగ్రహాన్ని వెళ్లగక్కిన కమ్యునిస్టు పాలకులు.. తైవాన్‌కు బుద్ధిచెప్పాలన్న నిర్ణయానికి వచ్చారు. అందులో భాగమే ఈ డ్రిల్స్‌… తైవాన్‌కు అన్నివైపులా చైనా యుద్ధనౌకలు మోహరించాయి. తమ యుద్ధ సన్నద్ధతను పరీక్షించుకునేందుకు తమ పరిధిలోనే వీటిని నిర్వహిస్తామని చెప్పుకుంటోంది. అంతేకాకుండా తైవాన్‌ స్వతంత్రత పేరుతో చైనా సౌర్వభౌమత్వానికి భంగం కలిగించే చర్యలు తీసుకుంటే మాత్రం అందుకు ఫలితాన్ని అనుభవించాల్సి ఉంటుందని తైవాన్‌కు వార్నింగ్ కూడా జారీ చేసింది. న్యాయబద్ధంగా తమ ప్రాంతాన్ని కాపాడుకునే హక్కు తమకు ఉందంటూ తైవాన్‌ తమదేనని చెప్పడానికి ప్రయత్నించింది డ్రాగన్.
చైనా, తైవాన్ సంబంధాలు ఇప్పటివి కాదు. క్వింగ్ రాజవంశం 1683లో తైవాన్‌ను ఆక్రమించింది. 1894లో చైనాను ఓడించిన జపాన్.. తైవాన్‌ను తన అధీనంలోకి తీసుకుంది. రెండో ప్రపంచయుద్ధ సమయంలో ఓడిపోయిన జపాన్‌ తిరిగి తైవాన్‌ను చైనాకు అప్పగించాల్సి వచ్చింది. అయితే అంతర్యుద్ధం సమయంలో చియాంగ్‌ వర్గం తైవాన్‌కు పారిపోయింది. అప్పట్నుంచి ఇరుదేశాల మధ్య వివాదం నడుస్తోంది. తైవాన్‌కు అమెరికా అండగా నిలబడింది. తూర్పు ఆసియాలో చైనాను అడ్డుకోవడానికి తైవాన్‌ను అమెరికా ఉపయోగించుకుంది. పైగా  తైవాన్‌ సెమీకండక్టర్ల ఉత్పత్తిలో ముందుంది. అది అమెరికాకు కీలకం. అయితే తైవాన్‌ను ఆక్రమించి చైనా పునరేకీకరణ పూర్తి చేయాలన్నది జిన్‌పింగ్‌ పట్టుదల. టిబెట్‌ను ఎప్పుడో కమ్యునిస్టు పాలకులు ఆక్రమించారు. అరుణాచల్‌ప్రదేశ్‌, సిక్కీంలో కొంత భాగాలను ఆక్రమించేందుకు ఇప్పుడు ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి. హాంకాంగ్‌ తమ పరిధిలోకి వచ్చేసింది. ఇప్పుడు తైవాన్‌ను కూడా తమలో కలిపేసుకుంటే గ్రేట్ చైనా ఆశలు తన హయాంలో పూర్తయ్యాయన్న కీర్తి ఎప్పటికీ ఉండిపోతుందని జిన్‌పింగ్ ఆలోచిస్తున్నారు. తైవాన్‌లో చైనా అనుకూల వర్గానికి ఎప్పటికప్పుడు సహాయ సహకారాలు అందిస్తూనే వస్తున్నారు. మొత్తంగా డ్రాగన్ దూకుడు చూస్తుంటే ఏ క్షణమైనా తైవాన్‌ దురాక్రమణకు తెగబడినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. అంతర్జాతీయ సమాజం నుంచి వ్యతిరేకత వస్తుందన్న భయంతోనే ఇన్నాళ్లూ కమ్యునిస్టు పాలకులు వెనకడుగు వేశారు. కానీ ప్రపంచదేశాలను పట్టించుకునే స్టేజ్‌ త్వరలోనే చైనా దాటిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే జరిగితే తైవాన్ చైనా ఏలుబడిలోకి వచ్చేస్తుంది.