Peru GBS: పెరూను వణికిస్తున్న నరాల వ్యాధి జీబీఎస్.. ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం..

జీబీఎస్ (గిలియన్ బారే సిండ్రోమ్) చాలా అరుదైన నరాల సంబంధిత వ్యాధి. శరీరంలోని వ్యాధి నిరోధక వ్యవస్థ నేరుగా నాడీ వ్యవస్థపై పని చేసి, బలహీనపరుస్తుంది. ఫలితంగా కండరాలు మొత్తం బలహీనమవుతాయి. దీంతో ఆయాసం, నిస్సత్తువ, అవయవాలు మొద్దుబారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

  • Written By:
  • Updated On - July 11, 2023 / 02:50 PM IST

Peru GBS: దక్షిణ అమెరికా దేశం పెరూను కొత్త రకం వ్యాధి వణికిస్తోంది. దీని పేరు జీబీఎస్ (గిలియన్ బారే సిండ్రోమ్). దీని ప్రభావం అక్కడ ఎంతగా ఉందంటే.. ఏకంగా ప్రభుత్వం మూడు నెలలపాటు హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది. ఇప్పటికే ఈ వ్యాధి కారణంగా దేశంలో 165 మంది మరణించారు. వ్యాధిగ్రస్తులు మరింత మంది పెరుగుతుండటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. 90 రోజులపాటు హెల్త్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేసింది. ఇంతకీ జీబీఎస్ అంటే ఏంటి..? ఎందుకు అది అంత ప్రమాదకరం..?
అరుదైన వ్యాధి జీబీఎస్
జీబీఎస్ (గిలియన్ బారే సిండ్రోమ్) చాలా అరుదైన నరాల సంబంధిత వ్యాధి. శరీరంలోని వ్యాధి నిరోధక వ్యవస్థ నేరుగా నాడీ వ్యవస్థపై పని చేసి, బలహీనపరుస్తుంది. ఫలితంగా కండరాలు మొత్తం బలహీనమవుతాయి. దీంతో ఆయాసం, నిస్సత్తువ, అవయవాలు మొద్దుబారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ సమస్య మొదట కాళ్లలో మొదలువుంది. కాలి కండరాలు బలహీనంగా మారుతాయి. క్రమంగా శరీరమంతా వ్యాపిస్తుంది. ఈ వ్యాధి ఇంకా ముదిరితే పక్షవాతం కూడా రావొచ్చు. ఈ వ్యాధి ఎక్కువగా పెద్ద వయసు వారికి, మగవారికి సోకుతోంది. అన్ని వయసుల వారికీ సోకే అవకాశం ఉంది.
కారణాలేంటి..?
జీబీఎస్ ఎందుకు వస్తుంది అనే దానిపై ఇంకా స్పష్టత లేదు. ఎక్కువగా ఇన్ఫెక్షన్లకు గురవ్వడం, కాంపిలోబాక్టర్ బెజునీ బ్యాక్టీరియా బారిన పడటం వల్ల కూడా ఈ వ్యాధి రావొచ్చు. అలాగే ఇన్‌ఫ్లుయెంజా వైరస్, సైటోమెగలూ, ఎప్‌స్టెయిన్ బర్, కోవిడ్ వైరస్‌ కూడా దీనికి కారణం కావొచ్చని వైద్య నిపుణులు అనుమానిస్తున్నారు. శరీరంలో కావాల్సిన స్థాయిలో యాంటీబాడీస్ ఉత్పత్తి కాకపోవడం వల్ల ఈ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయంటున్నారు నిపుణులు. ఆరు వారాల్లోనే ఇది ముదురుతోంది. స్పైనల్ ట్యాప్, ఎలక్ట్రోమియోగ్రఫీ వంటి పరీక్షల ద్వారా ఈ వ్యాధిని గుర్తించవచ్చు.
లక్షణాలు
జీబీఎస్ సోకిన వ్యక్తి బలహీనంగా మారుతారు. మెదడు నుంచి శరీరానికి సంకేతాలు అందడం తగ్గిపోతుంది. ఈ పరిస్థితిని పరేస్తేసియాస్ అంటారు. మెట్లు ఎక్కడంలో, నడవడంలో ఇబ్బంది పడతారు. శ్వాస సంబంధిత సమస్యలు రావొచ్చు. హార్ట్ బీట్, బీపీ పెరుగుతాయి. లివర్, కిడ్నీ సంబంధ సమస్యలొస్తాయి. చేతులు, కాళ్లలో సూదులు గుచ్చినట్లు బాధగా ఉంటుంది. కంట కండరాలు దెబ్బతినడం వల్ల చూపు మందగిస్తుంది. గొంతు సమస్యలు, నమలడం, మింగడం కష్టంగా ఉంటుంది. రాత్రి సమయంలో బాడీ పెయిన్స్ ఎక్కువగా వస్తాయి. సాధారణంగా ఈ లక్షణాలు మొదలైన రెండు వారాల్లోనే వ్యాధి తీవ్రంగా ముదురుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు.
చికిత్స ఏంటి..?
ప్రస్తుతానికి దీనికి పూర్తి స్థాయి చికిత్స అయితే అందుబాటులో లేదు. అయితే, వ్యాధి లక్షణాల ఆధారంగా తీవ్రతను తగ్గించే చికిత్స అందిస్తున్నారు. ఇంట్రావీనస్ ఇమ్యునోగ్లోబులిన్ (ఐవీఐజీ) చికిత్సను ఎక్కువగా అందిస్తున్నారు. ఆరోగ్యకరమైన రక్తదాతల నుంచి సేకరించిన ప్లాస్మా చికిత్సను కూడా ఉపయోగిస్తున్నారు. రోగ నిరోధక శక్తిని పెంచేందుకు కావాల్సిన చికిత్సను అందిస్తున్నారు. దీన్నుంచి కోలుకోవడానికి సాధారణంగా రెండు నుంచి మూడు వారాల సమయం పడుతుంది. కానీ, పూర్తిగా కోలుకుని ఆరోగ్యంగా మారడానికి సంవత్సరాలు కూడా పట్టవచ్చని నిపుణుల అంచనా. కొంత మంది మరణిస్తుంటే, ఇంకొందరిలో నరాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి. దీనికి వ్యాక్సిన్ కూడా అందుబాటులో లేకపోవడం మరింత ఆందోళన కలిగిస్తోంది. అమెరికాలోనూ ఈ తరహా కేసులు కనిపిస్తుంటాయి. ప్రతి లక్ష మందిలో ఒకరు దీని బారిన పడుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.
ఎమర్జెన్సీ ప్రకటించిన పెరూ
దేశంలో జీబీఎస్ కేసులు పెరుగుతుండటంపై అక్కడి ప్రభుత్వం అప్రమత్తమైంది. 90 రోజులపాటు జాతీయ హెల్త్ ఎమర్జెన్సీ విధించింది. ప్రజలందరూ అప్రమత్తంగా ఉంటూ, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. నిజానికి అక్కడ ఈ సమస్యను ఎదుర్కొనేందుకు తగిన వైద్య సదుపాయాలు లేవు. అందుకే వీటిని మెరుగుపర్చుకోవడంపై ప్రభుత్వం దృష్టిపెట్టింది.