UAPA: ప్రజాస్వామ్యంలో అణచివేత చట్టాలు ఎందుకు? హరగోపాల్‌, స్టాన్‌ స్వామి ఎపిసోడ్‌లు ఏం చెబుతున్నాయి?

నిజానికి ఇప్పటికీ దేశద్రోహం చట్టం (ఐపీసీ సెక్షన్‌ 124ఎ)పై స్టే మాత్రమే ఉంది. పూర్తిగా ఎత్తివేయలేదు. బ్రిటీష్‌ వలసవాద చట్టానికి జస్టిస్‌ ఎన్వీరమణ ఓ అడుగు ముందుకేసి తాత్కాలిక బ్రేకులు వేయగా.. మరోవైపు మన ప్రభుత్వాలే ఆయాసపడి తెచ్చుకున్న 'UAPA-చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం' మాత్రం బుసలు కొడుతూనే ఉంది.

  • Written By:
  • Publish Date - June 16, 2023 / 09:48 AM IST

UAPA: ప్రశ్నించే గొంతులను నొక్కుతున్నారు..! ప్రజాసంఘాలపై ఉక్కుపాదం మోపుతున్నారు! దేశద్రోహం చట్టానికి సుప్రీంకోర్టు తాళాలు వేయడంతో ‘ఉపా’ చట్టం బుసలు కొడుతోంది..! అసలేంటి ఈ రెండు ఈ చట్టాలకు తేడా.? హరగోపాల్‌పై ‘ఉపా’ చట్టం కింద కేసు ఎందుకు పెట్టారు?
స్వతంత్రం రాకముందు దేశ వ్యతిరేక కార్యకాలపాలకు పాల్పడితే దేశద్రోహం కేసులు పెట్టేవాళ్లు. అంటే బ్రిటీష్‌ వాళ్లకు వ్యతిరేకంగా పోరాడితే అది దేశద్రోహం, రాజద్రోహమే అవుతుంది. గాంధీ, తిలక్‌ లాంటి వాళ్ల ఎందరినో ఈ చట్టం కింద ఏళ్ల పాటు జైల్లో పెట్టారు. ఇక్కడ గాంధీ, తిలక్‌లు నిజానికి దేశానికి వ్యతిరేకంగా పని చేయలేదు. పరాయి దేశానికి పోయి అక్కడి వాళ్లతో చేతులు కలిపి బ్రిటీష్‌ ప్రభుత్వంపై అక్కడి ప్రజలను, సైనికులను, ప్రభుత్వాన్ని ఎగదోశారా అంటే అదీ లేదు. ఈ గడ్డపైనే ఉంటూ తెల్ల పాలకులపై పోరాడారు. ఇది దేశద్రోహం ఎలా అవుతుందో తెలియదు. దాన్ని స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా గతేడాది వరకు ఎందుకు కొనసాగించారో తెలియదు. నిజానికి ఇప్పటికీ దేశద్రోహం చట్టం (ఐపీసీ సెక్షన్‌ 124ఎ)పై స్టే మాత్రమే ఉంది. పూర్తిగా ఎత్తివేయలేదు. బ్రిటీష్‌ వలసవాద చట్టానికి జస్టిస్‌ ఎన్వీరమణ ఓ అడుగు ముందుకేసి తాత్కాలిక బ్రేకులు వేయగా.. మరోవైపు మన ప్రభుత్వాలే ఆయాసపడి తెచ్చుకున్న ‘UAPA-చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం’ మాత్రం బుసలు కొడుతూనే ఉంది. దానికి తాజా ఉదాహరణే ప్రొఫెసర్ హరగోపాల్‌పై ‘ఉపా’ కింద కేసు నమోదు చేయడం.
రెండింటికీ తేడా ఏంటి?
ఒక వ్యక్తిని విచారణ లేకుండా, బెయిల్‌ ఇవ్వకుండా ఏళ్ల తరబడి నిర్బంధించే చట్టం ‘ఉపా’. చివరికి విచారణలో ఆ వ్యక్తి అమాయకుడని తేలితే, అతడు కోల్పోయిన అన్ని సంవత్సరాల జీవితానికి ప్రభుత్వం ఎలాంటి నష్టపరిహారాన్ని చెల్లించకుండా అనుమతించే చట్టం ఇది. బ్రిటిష్‌ వలసవాద ప్రభుత్వం తెచ్చిన దేశద్రోహం చట్టం కూడా ఇన్ని అధికారాలను కలిగి లేదు. దేశద్రోహ చట్టం కింద ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని విచారణ కోసం సంవత్సరాల తరబడి నిర్బంధంలో ఉంచకుండా వేగంగా విచారణ చేపట్టేవారు. గాంధీ, నెహ్రు లాంటి నేతలు ఈ చట్టం కింద మూడేళ్లకు మించి ఎక్కువగా నిర్భందంలో గడపలేదు. ఇటు ఉపా చట్టంలో మాత్రం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అపరిమిత అధికారులున్నాయి. ‘ఉపా’ కింద ఎలాంటి విచారణా లేకుండా దీర్ఘకాలం నిర్బంధంలో ఉంచవచ్చు. నేరం జరగకుండా నిరోధించడానికే అరెస్టు అనే వాదనతో ప్రివెంటివ్‌ డిటెన్షన్‌ను ప్రభుత్వం సమర్ధించుకుంటోంది. కానీ ప్రివెంటివ్‌ డిటెన్షన్‌ విధానం అప్రజాస్వామికమైన చర్యగా చాలా దేశాలు దాన్ని ఎప్పుడో రద్దు చేశాయి. ఇక్కడ మాత్రం మరింత విస్తరించేలా ప్రభుత్వాల ఆలోచనా తీరు ఇప్పటికీ కొనసాగుతోంది.
నిజానికి విచారణ ముగిసేసరికి నిందితుడు దోషిగా తేలకపోతే అతడిని నిర్దోషిగానే భావించాల్సి ఉంటుంది. కానీ ‘ఉపా’ చట్టం ప్రకారం అలా ఉండదు. విచారణ ముగిసేసరికి దోషిగా నిర్థారణ కాకపోతే, నిందితుడిని నిర్దోషిగా భావించాలనే ప్రాథమిక సూత్రానికిది విరుద్ధంగా ఉంటుంది. 1967లో ఈ చట్టాన్ని తెచ్చారు. 2004లో ఈ చట్టానికి సవరణ చేశారు. 2008లో ‘ఉపా’ కింద వచ్చే నేరాలను పరిశోధించే పనిని ఎన్‌ఐఎ (NIA)కు బదలాయించారు. 2012లో ఆర్థిక నేరాలను నియంత్రించే పేరుతో ఇంకొకసారి ‘ఉపా’ను విస్తరించారు. పోలీసు శాఖ, శాంతి భద్రతలు రాష్ట్ర పరిధిలోని అంశాలు. కానీ ఎన్‌ఐఎ ద్వారా రాష్ట్రాల వ్యవహారాల్లో కేంద్రం తల దూర్చడానికి నేరుగా వీలు కలిగింది. 2019లో మరోసారి సవరణ చేశారు. ప్రభుత్వాలకు, అప్పటివరకు సమాజంలో తిష్టవేసుకుని కుర్చున్న, కాలం చెల్లిన నమ్మకాలకు వ్యతిరేకంగా మాట్లాడేవారినిసైతం ఈ చట్టం కింద కేసులు నమోదు చేస్తుండడం విడ్డూరం. ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 21కి విరుద్ధం.
తాజాగా ప్రొఫెసర్ హరగోపాల్‌పై ‘ఉపా’ చట్టం కింద కేసు నమోదు చేయడాన్ని ప్రజాసంఘాలు మండిపడుతున్నాయి. తెలంగాణ కోసం ప్రొ.జయశంకర్ లాంటి వారితో కలిసి పోరాటాలు చేసిన ఉద్యమ కారుడు హరగోపాల్. గతంలో నక్సలైట్లు ప్రజా ప్రతినిధులను కిడ్నాప్ చేస్తే ప్రభుత్వం కోరిక మేరకు మధ్యవర్తిత్వం వహించి వారి విడుదలకు సహకరించారు హరగోపాల్. ఇదే విషయాన్ని ప్రతిపక్షాలు కూడా ప్రస్తావిస్తున్నాయి. చాలా కాలంగా.. చెప్పాలంటే మొదటి నుంచి హరగోపాల్‌ ఇటు సీఎం కేసీఆర్‌, అటు ప్రధానీ మోదీ పాలనా తీరును వ్యతిరేకిస్తూ వస్తున్నారు. తీవ్రమైన విమర్శలు గుప్పిస్తున్నారు. మావోయిస్టులు రాసుకున్న పుస్తకాల్లో హరగోపాల్ పేరు ఉందంటూ ఆయనపై ఈ కేసు పెట్టారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం, ఆయుధాల ద్వారా రాజ్యాధికారాన్ని చేజిక్కించుకోవడం, ప్రభుత్వాన్ని కూలదోయడం, పార్టీకి నిధులు సమకూర్చుకోవడం, అమాయక యువకులను మావోయిస్టు పార్టీలోకి రిక్రూట్‌ చేసుకోవడం వంటి పనులు చేసినట్లు పోలీసులు అభియోగాలు నమోదు చేశారు. వీటికి సరైన ఆధారాలు ఉన్నా లేకపోయినా హరగోపాల్‌పై కేసు అలానే ఉంటుంది. పోలీసులు తమకు నచ్చింది చేసే అధికారముంది.. ఎందుకంటే అది ‘ఉపా’ చట్టం..!