Whats App: వాట్సాప్‌లో త్వరలో ఎడిట్ ఆప్షన్‌..

ఎప్పటికప్పుడు అప్డేట్‌లతో యూజర్లను మెస్మరైజ్ చేస్తున్న వాట్సాప్‌.. మరో కీలక అప్డేట్‌ తీసుకురాబోతోంది. కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు రెడీ అవుతోంది. పొరపాటున ఏదైనా మెసేజ్‌ అవతలి వారికి పంపిస్తే దాన్ని డిలీట్‌ చేసుకునే ఆప్షన్‌ ఉంది ఇప్పుడు. ఐతే ఒకప్పుడు అది కూడా ఉండేది కాదు. ఇప్పుడు మనం పంపించిన మెసేజ్‌లో ఏదైనా చిన్నపాటి తప్పు ఉంటే సరిచేసుకునేందుకు వీలుగా ఎడిట్‌ ఆప్షన్‌ను వాట్సాప్‌ తీసుకొస్తోంది.

  • Written By:
  • Publish Date - May 15, 2023 / 04:11 PM IST

ప్రస్తుతానికి వాట్సాప్‌ ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ బీటా యూజర్లకు అందుబాటులోకి వచ్చింది. త్వరలో అందరికీ ఈ ఫీచర్‌ రానుంది. వాట్సాప్‌ తీసుకొస్తున్న కొత్త ఫీచర్‌ కింద ఏదైనా మెసేజ్‌ను 15 నిమిషాల వరకు ఎడిట్‌ చేసుకోవచ్చు. దీనికోసం మనం పంపిన మెసేజ్‌పై క్లిక్‌ చేసి కాసేపు హోల్డ్‌ చేయాలి. అప్పుడు కాపీ అనే ఆప్షన్‌తో పాటు ఎడిట్‌ అనే ఆప్షన్‌ కూడా కనిపిస్తుంది. ఎడిట్‌ ఆప్షన్‌ ఎంచుకోవడం ద్వారా మార్పులు చేసుకోవచ్చు. 15 నిమిషాల్లోపు ఎన్ని సార్లయినా ఎడిట్‌ చేసుకునే చాన్స్ ఉంటుంది.

ఒకసారి ఎడిట్‌ చేశాక ఎడిటెడ్‌ అనే సందేశం అవతలి వ్యక్తికి ఈ మెసేజ్‌ కింద కనిపిస్తుంది. ఆండ్రాయిడ్‌ యాప్‌తో పాటు, ఐఓఎస్‌, వెబ్‌ యూజర్లకు కూడా ఈ సదుపాయం అందుబాటులోకి రానుంది. ఎప్పటి నుంచి అందుబాటులోకి వచ్చేదీ మాత్రం వాట్సాప్ బయటపెట్టలేదు. మరోవైపు అంతర్జాతీయ కాల్స్‌ బెడద ఎక్కువకాగా.. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే కాల్స్‌కు రింగ్‌ రాకుండా చేసే ఆప్షన్‌ కూడా ప్రస్తుతం బీటా టెస్టింగ్‌ దశలో ఉంది.