మాల్దీవ్స్, లక్షద్వీప్.. ఇంటర్నెట్‌లో ఇప్పుడు ఈ రెండే హాట్ టాపిక్. ప్రధాని మోదీ లక్షద్వీప్ వెళ్లి ఆ ఫొటోలు ఇంటర్నెట్‌లో షేర్ చేయడంతో లక్షద్వీప్ ఒక్కసారిగా హాట్ టాపిక్‌గా మారింది. దీనిపై మాల్దీవ్స్ మంత్రులు వివాదాస్పద కామెంట్స్ చేయడం ఇండియన్స్‌ను ఆగ్రహానికి గురి చేసింది. దీంతో సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ అంతా మాల్దీవ్స్‌ను వ్యతిరేకిస్తున్నారు. బైకాట్ మాల్దీవ్స్ హ్యాష్‌ట్యాగ్‌ను ఇంటర్నెట్‌లో ట్రెండ్ చేస్తున్నారు. మాల్దీవ్స్ కంటే లక్షద్వీప్ బెటర్ అంటూ ప్రమోట్ చేస్తున్నారు. ఈ వివాదాన్ని కాసేపు పక్కన పెడితే.. అసలు మాల్దీవ్స్‌లో ఏముంది.. లక్షద్వీప్‌లో ఏముంది. ఈ రెండిటిలో ఏది మంచి డెస్టినేషన్ స్పాట్.. ఇప్పుడిదే ఇంటర్నెట్‌లో హాట్ టాపిక్. కేరళలోని కొచ్చి నుంచి మాల్దీవులు సుమారు వెయ్యి కిలో మీటర్ల దూరంలో ఉంటాయి. క్రూయిజ్ షిప్ ద్వారా, ఫైట్ ద్వారా మాల్దీవ్స్‌కు చేరుకోవచ్చు. మాల్దీవ్స్ 12 వందల ద్వీపాల సమూహం. అందులోని చాలా ద్వీపాల్లో జనావాసాలు లేవు. మాల్దీవుల వైశాల్యం 3 వందల చదరపు కిలో మీటర్లు. అంటే అది పరిమాణంలో ఢిల్లీ కంటే దాదాపు 5 రెట్లు చిన్నది. ఇక్కడ దాదాపు 4 లక్షల మంది జనాభా ఉంటారు. దివేహి, ఇంగ్లీష్ ఇక్కడి ప్రధాన భాషలు. మాల్దీవుల్లోని ఏ ద్వీపం కూడా సముద్ర మట్టానికి 6 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో లేదు. ఈ దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా టూరిజం మీదే ఆధారపడి ఉంది. మాల్దీవుల ఆర్థిక వ్యవస్థలో, జాతీయ ఆదాయంలో నాలుగింట ఒక వంతు కంటే ఎక్కువగా టూరిజం నుంచే వస్తుంది.
2019 వరకు ప్రతి సంవత్సరం మాల్దీవులకు వచ్చే టూరిస్టుల సంఖ్య దాదాపు 20 లక్షలు ఉండేది. కానీ కరోనా తరువాత ఈ సంఖ్య చాలా తగ్గిపోయింది. ఇక్కడ అన్నికంటే ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటి అంటే.. మాల్దీవులకు వెళ్లే టూరిస్టుల్లో భారత టూరిస్టులే అధికం. గతేడాది భారత్ నుంచి దాదాపు 2 లక్షల మంది మాల్దీవులకు వెళ్లారు. కానీ అదే ఇండియన్స్‌ను తక్కువ చేసి మాట్లాడారు మాల్దీవ్స్ మంత్రులు. అదే ఇప్పుడు ఆ కంట్రీ టూరిజంను చిక్కుల్లో పడేసింది. ఇక మన లక్షద్వీప్ మాల్దీవ్స్‌కు ఏమాత్రం తీసిపోదు. పైగా ఇది మన ఇండియన్ టెరిటరీ. భారత్‌లో అతి తక్కువ జనాభా కలిగిన కేంద్ర పాలిత ప్రాంతం లక్షద్వీప్. అరేబియా సముద్రంలో కేరళ నుంచి సుమారు 3 వందల కిలోమీటర్ల దూరంలో లక్షద్వీప్ ఉంది. ఇక్కడ పది దీవుల్లో మాత్రమే జనావాసం ఉంది. మిగిలిన 17 దీవుల్లో ఎలాంటి జనావాసం లేదు. ఇంకా లెక్కలోకి తీసుకోని చాలా దీవులు ఇక్కడ ఉన్నాయి. లక్షద్వీప్ రాజధాని నగరం కవరట్టి. కవరట్టి, ఆగట్టి, మినీకాయ్, అమిని ఇవే ఇక్కడి ప్రధానమైన దీవులు. 2001 నాటి జనాభా లెక్కల ప్రకారం ఈ కేంద్రపాలిత ప్రాంతం మొత్తం జనాభా 60 వేల 595 మంది. ఆగట్టిలో ఒక ఎయిర్‌పోర్ట్ ఉంది. ఇక్కడికి కొచ్చిన్ నుంచి ఇక్కడికి చాలా ఫ్లైట్స్ అందుబాటులో ఉన్నాయి.
కేరళ నుంచి క్రూయిజ్ షిప్స్ కూడా ఉంటాయి. మాల్దీవుల మాదిరిగానే లక్షద్వీప్‌లో కూడా తెల్లటి ఇసుక బీచ్‌లు ఉంటాయి. ఇక్కడ కూడా హోటల్స్, గెస్ట్ హైజ్‌లు, రిసార్ట్‌లు, డైవ్ సెంటర్లు ఏర్పాటు చేసింది భారత ప్రభుత్వం. మే నుంచి సెప్టెంబర్ మధ్యకాలం ఇక్కడకు వెళ్లడానికి బెస్ట్ టైం. ఇక్కడ టెంపరేచర్ కూడా చాలా నార్మల్‌గా 22 నుంచి 36 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది. డిసెంబర్, ఫిబ్రవరి మధ్య ఇక్కడ టూరిస్టుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. దీన్ని బెస్ట్ డెస్టినేషన్ సెంటర్‌గా మార్చేందుకు భారత ప్రభుత్వం సన్నాహాలు మొదలు పెట్టింది. రీసెంట్‌గా లక్షద్వీప్‌లో పర్యటించిన ప్రధాని మోదీ.. కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. త్వరలోనే ఇక్కడ ఆప్టికల్ ఫైబర్ ప్రాజెక్ట్ ద్వారా హైస్పీడ్ ఇంటర్నెట్ అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. రీసెంట్‌గా భారత్ మీద.. మోదీ మీద మాల్దీవ్స్ మినిస్టర్స్ చేసిన కామెంట్స్.. ఇండియన్స్‌లో కోపం తెప్పించాయి. దీంతో మాల్దీవ్స్‌ను బైకాట్ చేయాలంటూ ఇండియన్స్ కోరుతున్నారు. ఇక మోదీ పర్యటన తరువాత లక్షద్వీప్‌ను సర్చ్ చేసేవాళ్ల సంఖ్య 3 వేల 4 వందల శాతం పెరిగింది. ఇక్కడికి వెళ్లే టూరిస్టులకు కూడా ఆఫర్స్ ప్రకటిస్తున్నాయి ట్రావెల్స్ సంస్థలు. భారత్ గవర్నమెంట్ ప్రారంభించిన ఆప్టికల్ ఫైబర్ ప్రాజెక్ట్ కంప్లీట్ ఐతే ప్రపంచంలోని బెస్ట్ టూరిస్ట్ ప్రాంతాల్లో లక్షద్వీప్ ఒకటి కాబోతోంది.