Bryan Johnson: నిత్యం యవ్వనంగా ఉండేందుకు అమెరికన్ ప్రయత్నాలు.. కొడుకు రక్తంతో ఏం చేస్తున్నాడంటే..!

అమెరికాలోని ఓ టెక్కీ కొన్నేళ్లుగా వయసును నియంత్రించుకునే పనిలో చాలా చాలా బిజీగా ఉన్నాడు. స్వతహాగా ఆస్తిపరుడైన ఆయన.. ముసలితనం దరిచేరకుండా.. తాను ఎప్పుడూ యంగ్‍గా ఉంచుకోవటం కోసం మిలియన్ల కొద్దీ డాలర్లను ఖర్చు పెడుతున్నాడు.

  • Written By:
  • Publish Date - May 27, 2023 / 03:01 PM IST

Bryan Johnson‎: ధీర్ఘాయుష్మాన్‌భవ…!! నూరేళ్లు చల్లగా ఉండు..!! అని పెద్దలు పెద్దమనసుతో ఆశీర్వదిస్తూ ఉంటారు. ఎవరు ఎంత ప్రేమగా ఆశీర్వదించినా.. ఏదో ఒక రోజు జీవితాన్ని చాలించాల్సిందే. బాల్యం, యవ్వనం, మధ్యవయస్సు, వృద్ధాప్యం, మరణం..ఇదే జీవిత చక్రం.. ప్రకృతి ధర్మం. కానీ ఎప్పటికీ సజీవంగానే ఉండాలి. ఎంత వయసు మీద పడినా యంగ్‌గానే ఉండాలి అని ఎవరైనా అనుకుంటే సాధ్యమవుతుందా..? మరణాన్ని జయించడం, వయసును నియంత్రించడం జరిగే పనేనా..? ఈ ప్రశ్నలను ప్రపంచంలో ఎవరిని అడిగినా అసాధ్యమే అని చెబుతారు. కానీ అమెరికాలోని ఓ టెక్కీ మాత్రం కొన్నేళ్లుగా వయసును నియంత్రించుకునే పనిలో చాలా చాలా బిజీగా ఉన్నాడు. స్వతహాగా ఆస్తిపరుడైన ఆయన.. ముసలితనం దరిచేరకుండా.. తాను ఎప్పుడూ యంగ్‍గా ఉంచుకోవటం కోసం మిలియన్ల కొద్దీ డాలర్లను ఖర్చు పెడుతున్నాడు.
వయస్సుని వెనక్కి మళ్లించవచ్చా?
ఇతని పేరే బ్రియన్ జాన్సన్ (Bryan Johnson). వయసు 45 ఏళ్లు. కానీ, చూడటానికి చాలా స్మార్ట్‌గా, యంగ్‌గా కనిపిస్తున్నాడు కదా! జీవితాంతం ఇలానే ఉండాలన్నది అతని కోరిక. కాలచక్రం తిరిగే కొద్దీ సహజంగానే వయసు పెరుగుతుంది. అలా పెరిగినా సరే ఎప్పుడు నిత్య యవ్వనంగా కనిపించాలన్నది అతని తాపత్రయం. దాని కోసం మంచి ఆరోగ్య నియమాలు పాటించడం, జిమ్‌కి వెళ్లడం, పౌష్టికాహారం తినడం.. వీటికే పరిమితం కాలేదు బ్రియన్ జాన్సన్. వయసు పెరిగినా ఎప్పుడూ యంగ్‌గా కనిపించేందుకు ఏజ్ రివర్సల్ కాన్సెప్ట్‌ను ఎంచుకున్నాడు.
యంగ్‌గా ఉండేందుకు యంగ్ బ్లడ్
పిల్లల కోసం, వాళ్ల భవిష్యత్తు కోసం.. వాళ్ల సంక్షేమం కోసం అవసరమైతే ప్రాణ త్యాగానికైనా సిద్ధపడతారు తల్లిదండ్రులు. కానీ బ్రియన్ జాన్సన్ మాత్రం అందరి కంటే భిన్నమైన వ్యక్తి. తన జీవితం, తన యవ్వనం తనకు ముఖ్యం. తన వయసును నియంత్రించుకునేందుకు కన్న కొడుకునే పావుగా వాడుకున్నాడు. 17 ఏళ్ల కొడుకు రక్తంతో ట్రాన్స్‌ఫ్యూజన్ చేయించుకున్నాడు. యవ్వనంలో ఉన్న ఆరోగ్యవంతుల రక్తాన్ని ఎక్కించుకుంటే తన శరీరంలోని అవయవాలు కూడా యంగ్ గా ఉంటాయని భావించిన బ్రియన్ జాన్సన్.. కొడుకు టాల్మేజ్ రక్తాన్ని మార్పిడి చేయించుకున్నాడు. ఇప్పటి వరకు అజ్ఞాత వ్యక్తుల నుంచి ప్లాస్మాను కొనుక్కున్న జాన్షన్ ఈసారి తన కొడుకును ఈ ప్రయోగంలోకి లాగాడు. అంతంటితో ఆగకుండా.. తన తండ్రికి కూడా రక్తమార్పిడి చేయించాడు.
ప్లాస్మా మార్చుకుంటే వయసు వెనక్కి వెళుతుందా?
బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూజన్ ద్వారా ప్లాస్మా మార్పిడి చేయించుకుంటున్న బ్రయన్ జాన్సన్.. ఈ విధానం ద్వారా ఎప్పటికీ యంగ్‌గా ఉండొచ్చని భావిస్తున్నారు. అయితే దీనిపై ఇప్పటి వరకు కొన్ని ప్రయోగాలు జరిగి సానుకూల ఫలితాలు కనిపించినా వీటిని ప్రపంచ వైద్య రంగం ఇంకా ధృవీకరించలేదు. చిట్టెలుకల మీద జరిగిన పరిశోధనలు పాజిటివ్‌గా ఉండటంతో వాటిని జాన్సన్ ఫాలో అవుతున్నారు. ప్రస్తుతానికి జాన్సన్‌కు మెరుగైన ఫలితాలే వస్తున్నట్టు ఆయనకు వైద్యం చేస్తున్న డాక్టర్లు చెబుతున్నారు. శరీరం వయసు పెరగడానికి, వృద్ధాప్యానికి దగ్గరవడానికి కారణమైన సెల్యులర్స్‌ను ప్లాస్మా మార్పిడి ద్వారా నియంత్రించే పని చేస్తున్నారు. సెల్యులర్ డామేజ్‌ని అడ్డుకుంటే ఇక వయసు పెరగదనేది వీళ్ల నమ్మకం.
యాంటీ ఏజింగ్ ట్రీట్‌మెంట్ చేస్తున్నదెవరు ?
బ్రియన్ జాన్సన్ స్వతహాగా బిజినెస్ మాన్. వెంచర్ కాపిటలిస్ట్. అమెరికాలో చాలా వ్యాపారాలు నిర్వహిస్తున్నాడు. ఆయన బ్యాంకు అకౌంట్లలో కుప్పలు తెప్పలుగా డాలర్లు మూలుగుతున్నాయి. డబ్బుకు కొదవలేదు. అందుకే నిత్యనూతనంగా, ఎప్పటికీ యవ్వనంగా ఉండేందుకు ఎంతైనా ఖర్చు పెడుతున్నాడు. బ్రియన్ జాన్సన్ వయసు పెరిగినా అది కనపడకుండా, యంగ్‌గా ఉండేలా చూసేందుకు ఆయనకు 30 మంది వైద్యుల బృందం సహకరిస్తోంది.


ప్రాజెక్టు బ్లూ ప్రింట్ ఏంటి ?
ముందుకు వెళ్లాల్సిన వయసును వెనక్కి నెట్టి, ఎప్పుడూ యవ్వనంగా ఉండేందుకు బ్రియన్ జాన్సన్ చేపట్టిన ప్రాజెక్టు పేరే బ్లూ ప్రింట్. వైద్య బృందం ఇచ్చే సలహాలు, సూచనలు పాటిస్తూ తనపై తానే ప్రయోగాలు చేసుకుంటున్నాడు. శారీరకంగా తన వయసు 45 ఏళ్లు ఉన్నా 37 ఏళ్ల వయసున్న వ్యక్తికి ఉండాల్సిన శారీరక లక్షణాలే తనలో ఉన్నాయని చెబుతున్నాడు. ఒక వెబ్‌సైట్, యూట్యూబ్ చానల్ పెట్టి మరీ తన ప్రాజెక్టు గురించి ప్రచారం చేస్తున్నాడు. తన ఏజ్‌ని కంట్రోల్‌లో ఉంచేందుకు జాన్సన్ పర్ఫెక్ట్ ప్లాన్‌ను ఫాలో అవుతున్నాడు. ఉదయం 4.30కే ఆయన దినచర్య మొదలవుతుంది. దాదాపు మూడు గంటల పాటు శారీరక వ్యాయామం చేస్తాడు. పూర్తిగా వేగన్‌గా మారిపోయాడు. ఎప్పుడు నిద్రలేవాలి.. ఎప్పుడు నిద్రపోవాలి.. ఎప్పుడు, ఎంత, ఏం తినాలి.. అన్న విషయాలన్నీ పక్కా ప్లాన్ ప్రకారం ఫాలో అవుతాడు. జాన్సన్ శరీరంలో రోజు వారీ వచ్చే మార్పులను పరిశీలించడానికి, నమోదు చేయడానికి వైద్య బృందం ఎప్పుడూ ఆయనతోనే ఉంటుంది.
ఏజ్ పెరగకుండా ఎంత ఖర్చు చేస్తున్నాడో తెలుసా ?
అమెరికా సంపన్నుల్లో ఒకడిగా ఉన్న బ్రియన్ జాన్సన్ ఏజ్ రివర్సింగ్ కోసం ప్రతి యేటా 2 మిలియన్ డాలర్లు ఖర్చు పెడుతున్నాడు. అంటే ఏడాదికి సుమారు 17 కోట్ల రూపాయలు. ఎన్ని మిలియన్ డాలర్లు ఖర్చైనా పర్లేదు.. తాను మాత్రం ఎప్పటికీ యంగ్‌గానే ఉండిపోయాలన్నది జాన్సన్ లక్ష్యం. అందుకే తన కొడుకుని, తండ్రిని కూడా ఈ ప్రాజెక్టులో ఇన్వాల్వ్ చేసి ప్రయోగాలు చేస్తున్నాడు. ప్రాజెక్టు బ్లూ ప్రింట్ చెప్పుకుంటున్నట్టు సంవత్సరానికి 365 రోజుల్లో ప్రతి మనిషిలోనూ ఏదో ఒక మార్పు కనిపిస్తుంది. కానీ జాన్సన్ విషయంలో మాత్రం 277 రోజులు మాత్రమే ఏజ్ పెరుగుతుందట. ఆ విధంగా మిగతా రోజులను నియంత్రించగలిగినట్టు వైద్య బృందం చెబుతుంది. 45 యేళ్ల వయసులో జాన్సన్ ఫిట్‌నెస్ లెవల్ 18ఏళ్ల యువకుడికి ఉన్నట్టు ఉందట.
బ్రియన్ జాన్సన్ ఎప్పటికీ ఇలాగే ఉంటారా ?
ఈ ప్రశ్నకు కచ్చితంగా సమాధానం చెప్పలేం. ప్రాజెక్టు బ్లూ ప్రింట్ ద్వారా జాన్సన్ చేస్తున్న ప్రయోగాలన్నీ ఆయన వ్యక్తిగతమైనవే. వీటిని అంతర్జాతీయ వైద్య పరిశోధకులు ఇంకా ఆమోదించలేదు. ఆరోగ్యకరమైన లైఫ్ స్టైల్‌ని అలవాటు చేసుకోవడం ద్వారా యంగ్‌గా కనపడే ప్రయత్నం చేయవచ్చేమో గానీ జాన్సన్ అనుసరిస్తున్న విధానంలో అది సాధ్యమా.. కాదా అన్నది కాలమే తేల్చాలి.