ఊళ్లోకి ఉన్నట్టుండి ఎలుగుబంటి వస్తుంది.. జనాన్ని పరుగులు తీయిస్తుంది. అప్రమత్తంగా లేకపోతే దాడులు కూడా చేస్తుంది.. మరోచోట ఏనుగుల మంద ఊరిపై పడుతుంది. పంటపొలాలలను నాశనం చేస్తుంది. మరోచోట నగరం నడిబొడ్డున చిరుత పరుగులు తీస్తుంది. దాన్ని బంధించేందుకు అధికారులు ఆపసోపాలు పడతారు. కరీంనగర్ జిల్లాలో ఎలుగుబంటి ప్రజలను పరుగులు పెట్టింది. తిరుమలలో ఓ చిరుత చిన్నారిని బలితీసుకుంది. ఇలా ఎందుకు జరుగుతుంది ? దట్టమైన అడవుల్లో ఉండాల్సిన క్రూరమృగాలు మనుషుల మధ్యకు ఎందుకొస్తున్నాయి. ? ఎక్కడో అడవుల సమీపంలో ఉన్న గ్రామాల్లోకి జంతువులు వస్తున్నాయంటే.. అనుకోవచ్చు…కానీ మహానగరాల్లోకి కూడా ఈ మధ్య వణ్యప్రాణాలు వస్తున్నాయి. మనం వాళ్లింటికి వెళ్తే.. అవి కూడా మన ఇంటికి కచ్చితంగా వస్తాయి. అవును నిజమే.. ప్రకృతిలో భాగంగా అడవుల్లో , కొండకోనల్లో ఉండే జంతువులు ఇప్పుడు మనుషుల మధ్యకు రావడానికి ముమ్మాటికీ మనిషే కారణం. వాటి మానాన వాటిని బతకనీయకుండా అభివృద్ధి పేరుతో మనిషి చేస్తున్న విధ్వంసం చివరకు వణ్య ప్రాణులకు నిలువు నీడ లేకుండా చేస్తున్నాయి. ఈ విపరిణామం ఇలానే కొనసాగితే ప్రకృతి సమతుల్యం దెబ్బతింటుంది. అప్పుడు మానవ సమాజమే కాదు.. యావత్ జంతుజాలం కూడా తీవ్రంగా నష్టపోతుంది.
అడవుల నరికివేతలో మనమే టాప్
పచ్చని అటవీ ప్రాంతం ఎప్పుడైతే మనిషి స్వార్థానికి కనుమరుగైపోతుందో… అప్పుడు జీవ వైవిధ్యం దెబ్బతింటుంది. ముఖ్యంగా మనదేశంలో వణ్యప్రాణులు జనావాసాల మధ్యకు రావడానికి ప్రధాన కారణం అడవుల నరికివేత. అభివృద్ధి పేరుతో, సహజవనరులను వెలికితీసే పేరుతో మనిషి తన పరిధిని క్రమంగా విస్తరించుకుంటూ అడవులను కూడా తన భూభాగంలోకి కలిపేసుకుంటున్నాడు. దీంతో దేశవ్యాప్తంగ అటవీ ప్రాంతం క్రమంగా కనుమరుగవుతుంది. గడిచిన మూడు దశాబ్దాల్లో అడవుల నరికివేతలో ప్రపంచంలోని అన్ని దేశాలతో పోల్చితే భారత్ అగ్రస్థానంలో ఉంది. 2015 నుంచి 2020 మధ్య కాలంలో దేశవ్యాప్తంగా 6 లక్షల 68 వేల 400 హెక్టార్ల అటవీ ప్రాంతాన్ని కోల్పోయాం. బ్రెజిల్ తర్వాత ఎక్కువగా అడవులను కోల్పోతున్న దేశంగా భారత్ చరిత్రలో నిలిచిపోయింది. ప్రపంచంలో అత్యధిక జనాభా గల దేశంగా మారిన ఇండియా… పెరుగుతున్న ప్రజల అవసరాలను తీర్చేందుకు అటవీ భూములను సర్వనాశనం చేసేస్తున్నాం.
నాగరీకరణతో సర్వం నాశనం
ఆధునిక మానవుడి జీవితం మొత్తం నగరాల చుట్టూనే తిరుగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఏ దేశంలో చూసుకున్నా.. పల్లెలు నగరాలుగా..నగరాలు.. పెద్ద పట్టణాలుగా.. పట్టణాలు మెగా సిటీలుగా అవతరిస్తున్నాయి. అర్బనైజేషన్ పెరిగే కొద్దీ వ్యవసాయ భూములు కూడా వాటిలో కలిసిపోతున్నాయి. దీంతో వ్యవసాయం కోసం అడవులను నరికేస్తున్నారు. దీంతో వణ్యప్రాణాలు తమ అవాశాలను కోల్పోతున్నాయి. ఎప్పుడైతే అడవులు మైదాన ప్రాంతాలుగా మారుతున్నాయో… మూగజీవాలు ఆహారం కోసం, నీడ కోసం ఇతర సమీప ప్రాంతాల వైపు వెళ్తున్నాయి.
అర్బనైజేషన్ కారణంగా.. పచ్చని అటవీ ప్రాంతమే కనిపించకుండాపోయే సరికి.. చివరకు అవి జనావాసాల మధ్య తేలుతున్నాయి.
గ్లోబల్ వార్మింగ్
అడవులను నాశనం చేయడం ఒక్కటే కాదు.. మనిషి తన అవసరాలను కోసం మనుగడ కోసం పర్యావరణానికి కూడా ఎంత డ్యామేజ్ చేయాలో అంత ఇప్పటికే చేసేశాడు. గ్లోబల్ వార్మింగ్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ సమతుల్యం దెబ్బతిన్నది. కార్బన్ ఉద్గారాలతో వాతావరణం నిండిపోయింది. వణ్యప్రాణులు నివాస ప్రాంతాలను కోల్పోవడంతో పాటు పర్యావరణ సమస్యల కారణంగా తీవ్రంగా నష్టపోతున్నాయి. గ్లోబల్ వార్మింగ్ కారణంగా పర్యావరణలో ఎన్నో మార్పులు జరుగుతున్నాయి. వెదర్ కండిషన్స్ మారిపోతున్నాయి. టెంపరేచర్స్
పెరిగిపోతున్నాయి. ఇవన్నీ వణ్యప్రాణులపై నేరుగా ప్రభావం చూపిస్తున్నాయి. తీవ్ర వాతావరణ పరిస్థితుల మధ్య ఆహారం కోసం అన్వేషిస్తూ నగరాల బాట పడుతున్నాయి. వీటికి తోడు ప్రకృతి ప్రకోపాలు కూడా వణ్యప్రాణుల పాలిట శాపంగా మారుతున్నాయి. భారీ వర్షాలు, వరదలు అటవీ సంపదను నాశనం చేస్తున్నాయి. ప్రకృతి విపత్తుల కారణంగా అడవుల్లో ఉండలేని పరిస్థితులు తలెత్తుతున్నాయి…
అన్నింటికీ మూలం మనిషే
ఈ ప్రకృతిలో జీవరాశులన్నింటికీ బతికే హక్కు ఉంది. కానీ మనిషి మాత్రం భూమి, ఆకాశం మొత్తం తనదేనని భావిస్తాడు. అక్కడితో ఆగకుండా వాటిని ఆక్రమించుకునే క్రమంలో జీవజాతులకు హాని చేస్తున్నాడు. చివరకు వణ్యప్రాణులకు నిలువ నీడలేకుండా అడవులను కూడా దోచుకుంటున్నాడు. చిరుత పులుల నుంచి ఏనుగులు, ఎలుగుబంటి వరకు నగరాలవైపునకు వస్తున్నాయంటే అది ముమ్మాటికి వణ్యప్రాణులకు మనిషి చేసిన ద్రోహమే. ఏదో ఒక దశలో ఈ విధ్వంసం ఆగకపోతే.. భవిష్యత్తు మరింత ప్రమాదకరంగా మారుతుంది. తన ఆధిపత్యాన్ని ప్రదర్శించే క్రమంలో మానవుడు వణ్యప్రాణులకు హాని చేయడం మొదలు పెడితే.. జీవసమతుల్య పరంగా ఆనష్టం ఎవరూ పూడ్చలేరు.