Chandrayaan-3: భారత్ కీర్తి పతాకను చంద్రుని మీద ఎగరేసింది చంద్రయాన్. మామ దక్షిణ ధ్రువంపై చంద్రయాన్3 ల్యాండింగ్ కావడంపై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుతున్నాయి. చంద్రయాన్-3 గ్రాండ్ సక్సెస్ తర్వాత.. ఇస్రో ఇంజనీర్ల ఘనతను పలు దేశాలు అభినందిస్తున్నాయి. ఐతే బ్రిటీష్ మీడియా మాత్రం తన బుద్ది ఏంటో చూపించింది. భారత్ మీద అక్కసు వెళ్లగక్కింది. ఓ జర్నలిస్ట్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
దీంతో ఇండియా నుంచి బ్రిటిష్ వలస పాలకులు కొల్లగొట్టిన 45 ట్రిలియన్ డాలర్లు మళ్లీ ట్రెండింగ్‌లోకి వచ్చాయి. ఇంగ్లండ్‌కు చెందిన ఓ జర్నలిస్ట్.. చంద్రయాన్ గురించి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. భారత ఘనతపై అక్కసు వెళ్లగక్కుతున్న జర్నలిస్టు పాట్రిక్ క్రిస్టీస్‌పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎనిమిదేళ్లుగా యూకే నుంచి 2.5 బిలియన్ డాలర్ల విదేశీ సహాయాన్ని భారత్ వెనక్కి ఇవ్వాలంటూ ఆ జర్నలిస్ట్ మాట్లాడాడు. దీనిపై సుప్రీంకోర్టు లాయర్ శశాంక్ శంకర్ స్ట్రాంగ్‌గా రియాక్ట్ అయ్యారు. భారతీయుల నుంచి దోచుకున్న45 ట్రిలియన్ డాలర్లను తిరిగి ఇవ్వాలంటూ కౌంటర్ ఇచ్చారు. అంతరిక్షంలోని రాకెట్లను పంపించేందుకు ఇతర దేశాలకు యూకే సాయం అందించకూడదు అంటూ మరో బ్రిటీష్ జర్నలిస్ట్ సోఫియా కోర్కోరన్ ట్వీట్ చేశారు. దీనిపై ఇండియన్ యూజర్లు ఫైర్ అవుతున్నారు. భారతదేశం నుంచి దోచుకున్న 45 ట్రిలియన్ డాలర్ల సొమ్ము ఇచ్చేయండి అంటూ కామెంట్ పెడుతున్నారు.
మా కోహినూర్ మాకిచ్చేయండి అని మరికొందరు ట్వీట్ చేస్తున్నారు. 2015 తర్వాత యూకే నుంచి భారత్ ఎలాంటి సాయం తీసుకోలేదని ఇంకొందరు లెక్కలు బయటపెడుతున్నారు. 1765 నుంచి 1938 మధ్యకాలంలో భారతదేశం నుంచి బ్రిటీష్ దాదాపు 45 ట్రిలియన్ డాలర్ల మొత్తాన్ని దోచుకుందని ఈ మధ్య ఓ పరిశోధనలో తేలింది. చంద్రయాన్ మీద అక్కసుతో అక్కడి జర్నలిస్టులు అడ్డగోలు వాదలు చేస్తుంటే మనోళ్లు 45 ట్రిలియన్ డాలర్ల వ్యవహారం తెరమీదకు తెస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో కొత్త రచ్చ మొదలైంది.