స్పెయిన్ ఎడారిగా ఎందుకు మారుతుంది ?
స్పెయిన్ అనగానే అందమైన సముద్ర తీరాలు.. మధ్యయుగం నాటి చారిత్రక కట్టడాలు.. మనసు దోచే పూలతోటలు..భిన్న నిర్మాణ శైలితో కనిపించే భవనాలు..విశాలమైన పర్వత శ్రేణులతో పాటు నోరూరించే యూరోపియన్ స్టైల్ డిషెస్‌తో స్వాగతం పలికే ప్రజల జీవన విధానం కళ్ల ముందు కనిపిస్తుంది. కానీ ఇదంతా చరిత్రలో కలిసిపోవడానికి ఎక్కువ రోజులు పట్టే సమయం కనిపించడం లేదు. మనిషి జీవనానికి అవసరమైన నీటి చుక్కను చూసి స్పెయిన్ చాలా కాలమైంది. కారణాలు ఏమైనా కావొచ్చు స్పెయిన్‌ను వరుణ దేవుడు పలకరించడం మానేశాడు. స్పెయిన్ చరిత్రలోనే ఎప్పుడూ లేనంతగా ఈసారి భానుడు భగభగ మండిపోతున్నాడు. ఏప్రిల్ విల్ రెయిన్ అంటూ ప్రతి ఏటా ఏప్రిల్ లో వర్షాల కోసం ఎదురుచూసే స్పెయిన్ వాసులకు ఈసారి నిరాశే ఎదురయ్యింది. స్పెయిన్ భూభాగం నుంచి నీటి వనరులు దాదాపుగా కనుమరుగయ్యే పరిస్థితికి చేరుకుంది. దేశంలోని చాలా ప్రాంతాల్లో నీటి నిల్వలు 25 శాతం కంటే తక్కువకు పడిపోయాయి.
స్పెయిన్‌లో కరవు సాధారణమైపోయింది
దూరపు కొండలు నునుపు అన్నట్టు యూరోపియన్ దేశాలన్నీ సుభీక్షంగా ఉన్నాయని చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ ఇథియోఫియా వంటి ఆఫ్రికన్ దేశాల్లో ఉండే కరవు పరిస్థితులు ఇప్పుడు యూరోప్‌లోనూ కనిపిస్తున్నాయి. అందుకు స్పెయిన్ పెద్ద ఉదాహరణ. గ్లోబల్ వార్మింగ్ తో పాటు వాతావరణ మార్పుల వల్ల ఏర్పడే ప్రతికూల పరిణామాలను స్పెయిన్ 1961 నుంచే అనుభవిస్తోంది. మొదటల్లో అడపాదడపా నీటి ఎద్దడిని, కరవు పరిస్థితులను చూసిన స్పెయిన్ గడిచిన కొన్ని సంవత్సరాలుగా తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. స్పెయిన్ వాసులకు కరవు సర్వసాధారణమైపోయింది. మంచి రోజులు రాకపోతాయా అంటూ ఏటికేడు ఆశగా ఎదురుచూస్తున్న స్పెయిన్ వాసులకు నిరాశే ఎదురవుతుంది. గడిచిన దశాబ్దికాలంగా ఒక్కసీజన్ లో కూడా సాధారణ వర్షపాతం నమోదైన చరిత్ర స్పెయిన్‌లో లేదు. నీటికి కటకట పెరగడంతో భూగర్భ జలాల వినియోగం పెరిగిపోయింది. చివరకు స్పెయిన్ తన అస్థిత్వాన్ని కాపాడుకోవాలంటే భూగర్భ జలాల వినియోగం ఒక్కటే మార్గమైంది. గ్రౌండ్ వాటర్‌ను పరిమితికి మించి వాడటం మొదలవడంతో ప్రకృతి సమతుల్యత కూడా దెబ్బతింది.
తీవ్ర సంక్షోభంలో వ్యవసాయం
భారత్ లాంటి దేశాలకు వ్యవసాయమే వెన్నెముక. వ్యవసాయం పూర్తిగా సంక్షోభంలో చిక్కుకుని రైతులు పంటలు పండించలేని పరిస్థితి వస్తే మనదేశం దుస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. ఇంచుమించు ఇలాంటి సంక్షోభాన్నే అనుభవిస్తోంది స్పెయిన్. యూరోపియన్ యూనియన్‌లోనే పళ్లు, కూరగాయలు పెద్ద మొత్తంలో పండించే ఏకైక దేశం స్పెయిన్. స్పెయిన్‌లో పండే పళ్లు, కూరగాయలు ఇతర దేశాలకు ఎక్స్‌పోర్టు అవుతూ ఉంటాయి. అందుకే స్పెయన్‌ను యూరోప్‌స్ బ్యాక్ గార్డెన్ అని పిలుస్తారు. ఆస్థాయిలో అక్కడ ప్రజలు వ్యవసాయాన్ని నమ్ముకున్నారు. కానీ కొన్ని సంవత్సరాలుగా పరిస్థితులు మారిపోయాయి. ఏదేశమైతే యూరోప్‌లోని ఇతర దేశాలకు తిండిపెడుతుందో అదే దేశం ఇప్పుడు తిండిలేక కన్నీరు కారుస్తోంది. ఓవైపు తట్టుకోలేని ఎండలు..మరోవైపు పెరిగిన భూతాపం…ఇంకోవైపు… జీవం కోల్పోయిన నదులు.. ఇలా స్పెయిన్‌పై ప్రకృతి తిరగబడింది. దీంతో వ్యవసాయం తీవ్ర సంక్షోభంలో చిక్కుకుంది. గోధమలు, బార్లీ నుంచి పళ్లు, కూరగాయలు వరకు దేనిని పండించే పరిస్థితులు ఇప్పుడు స్పెయిన్‌లో లేవు. వాతావరణం అనుకూలించక, వర్షం అన్నదే కానరాక… స్పెయిన్ రైతుల పొలాలు బీడు భూములుగా మారిపోయాయి. స్పెయిన్ వ్యాప్తంగా 30లక్షల 50 వేల హెక్టార్లలో పంట నీటి ఎద్దడికి బలైపోయింది. అంటే స్పెయిన్‌లో 60 శాతం భూభాగం వ్యవసాయానికి నిరుపయోగంగా మారిపోయింది.
జనజీవనం అస్తవ్యస్తం
ఓవైపు తీవ్రమైన కరవు పరిస్థితులు…మరోవైపు ఆహార సంక్షోభం..స్పెయిన్‌లో జన జీవనాన్ని అస్తవ్యస్తంగా మార్చేసింది. చివరకు రైతులు తమ పశువులను పోషించే పరిస్థితిలో కూడా లేరు. ఎప్పుడైతే వ్యవసాయం దెబ్బతిని కరవు పరిస్థితులు ఏర్పడ్డాయో ఆర్థికవ్యవస్థ కూడా చిన్నాభిన్నమైపోయింది. ధరలు ఆకాశానికంటాయి. ఆహార పదార్థాలను కొనుక్కొని తినే పరిస్థితుల్లో ప్రజలు లేరు. ఇతర యూరోపియన్ యూనియన్‌లోని ఇతర దేశాలకు వలసలు పెరిగిపోయాయి. వ్యవసాయ భూములు నిరుపయోగంగా మారిపోయాయి. దేశం సంక్షోభంలో చిక్కుకోవడంతో జనం ఆకలితో విలవిలలాడుతున్నారు. ఏదో అద్భుతంగా జరగకపోతుందా అని ఎదురుచూస్తున్నారు.
స్పెయిన్ చరిత్రలోనే అతిపెద్ద సంక్షోభం
పచ్చటి భూములు ఎడారులను తలపిస్తున్నాయి.. పంటపొలాలు.. బీడు భూములుగా మారిపోయాయి…జీవ నదులు ఎండిపోయి పిల్ల కాలువలను తలపిస్తున్నాయి. కొన్ని సంవత్సరాలుగా స్పెయిన్ తన సహజ స్వరూపాన్ని కోల్పోతోంది. దేశ భూభాగంలో ఇప్పటికే 75 శాతం ఇలా మారిపోయింది… ఇక మిగిలిన 25 శాతం కూడా ఎడారిగా మారిపోతే… స్పెయిన్ అస్థిత్వమే ప్రమాదంలో పడుతుంది. దాదాపు 30 నెలలుగా స్పెయిన్‌లో మేఘం ఆచూకీనే లేదు. కొద్దిపాటి పంటలు కూడా నీటిఎద్దడి కారణంగా చేతికి రావడం లేదు.
అద్భుతం జరగకపోతే స్పెయిన్ చరిత్రలో కలిసిపోయినట్టే
సంక్షోభం నుంచి బయటపడేందుకు స్పెయిన్ ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా సానుకూల ఫలితాలు రావడంలేదు. ప్రజలను కరవు బారి నుంచి తాత్కాలికంగా బయటపడేసేందుకు 2.2 బిలియన్ యూరోల అత్యవసర ప్యాకేజ్‌ను ప్రకటించింది. జనానికి మంచి నీరు కూడా అందే పరిస్థితి లేకపోయే సరికి మురుకి నీటిని శుభ్రం చేసుకుని తాగాల్సి వస్తుంది. ప్రభుత్వం కూడా వేస్ట్ వాటర్ ట్రీట్‌మెంట్ కోసం బిలియన్ యూరోలను ఖర్చు చేస్తోంది. ఒకదేశం పూర్తిగా ఎడారిగా మారే పరిస్థితి వచ్చిందంటే దానికి మానవ తప్పిదాలే కారణమవుతున్నాయి. తన అవసరాల కోసం ప్రకృతిని విధ్వంసకరంగా ఉపయోగిస్తే ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో స్పెయిన్‌ను చూసి నేర్చుకోవాలి. గ్లోబల్ వార్మింగ్ అనే భూతం దేశానికి దేశాన్నే మింగేస్తుందంటే.. ప్రపంచం ఇప్పటికైనా మేల్కోవాలి. భవిష్యత్తు తరాల కోసం సహజ వనరులను కాపాడుకోవాలి. విధ్వంసకర విధానాలకు స్వస్తి పలకాలి. లేదంటే… స్పెయిన్ తరహాలో మరో దేశం…లేదా దేశాలు కాలగర్భంలో కలిసిపోయే ప్రమాదం కచ్చితంగా ఉంటుంది.