Food Crisis: అందరికీ అన్నం పెట్టే అన్నపూర్ణమ్మ ఉన్నట్టుండి అన్నం వండటం మానేస్తే ఎలా ఉంటుంది. ఆమె మీదే ఆధారపడి కడుపు నింపుకునే వాళ్లు అర్థాకలితో అలమటిస్తారు. ప్రస్తుతం ప్రపంచ దేశాల పరిస్థితి ఒకరకంగా ఇలాగే ఉంది. ఇక్కడ అన్నపూర్ణమ్మ అంటే ఎవరో కాదు.. మన దేశమే. అవును.. ప్రపంచ వ్యాప్తంగా మెజార్టీ దేశాలకు రైస్‌ను ఎగుమతి చేసే భారత్.. ఈ మధ్య రైస్ ఎగుమతులపై నిషేధం విధించడంతో ప్రపంచం ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. భారత్ నుంచి బియ్యం సరఫరా ఆగిపోతే చాలా దేశాల్లో ప్రజల జీవితాలు తలకిందులైపోతాయి. ఓవైపు ఉక్రెయిన్, రష్యా యుద్ధం కారణంగా కొన్ని నెలలుగా ఆహారోత్పత్తుల ఎగుమతులు, దిగుమతులు ఇబ్బందికరంగా మారిన పరిస్థితుల్లో భారత్ తీసుకున్న నిర్ణయం ప్రపంచదేశాలను మరింత ఆహార సంక్షోభంలోకి నెట్టే ప్రమాదం కనిపిస్తోంది
భారత్ ఎందుకు నిషేధం విధించింది..?
బాసుమతేతర బియ్యం ఎగుమతులపై నిషేధం విధిస్తూ జులై 20న కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశీయంగా ఆహారోత్పత్తుల ధరలు విపరీతంగా పెరగడంతో కేంద్రం విదేశాలకు బియ్యం రవాణాను తాత్కాలికంగా నిలిపివేసింది. గడిచిన ఏడాది కాలంగా మనదేశంలో వ్యవసాయోత్పత్తుల ధరలు 11 శాతం పెరిగాయి. దీంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీటికి తోడు ఆలస్యంగా వచ్చిన ఈశాన్య రుతుపవనాలు ఉత్తర, దక్షిణ భారతంలో వ్యవసాయ రంగానికి భారీ నష్టం కలిగించాయి. పంట వరదపాలు కావడంతో ఆహారోత్పత్తుల ధరలు ఆకాశాన్నంటాయి. వీటిని నియంత్రించే ఉద్దేశంతో బాసుమతేతర బియ్యాన్ని ఎగుమతి చేయకూడదని కేంద్రం నిర్ణయించింది.
ఎందుకంత ప్రభావం చూపిస్తోంది..?
ప్రపంచంలోనే రైస్ ఎక్స్‌పోర్టులో ఇండియా మొదటి స్థానంలో ఉంది. ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల మధ్య జరిగే రైసు ఎగుమతుల్లో 40 శాతం వాటా మనదే. థాయ్‌లాండ్, వియత్నాం, పాకిస్థాన్, అమెరికా తర్వాత స్థానాల్లో ఉన్నాయి. భారత్ నుంచి ఎక్కువగా రైస్‌ను దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో చైనా, ఫిలిప్పీన్స్, నైజీరియా ఉన్నాయి. ఇండోనేషియా, బంగ్లాదేశ్ లాంటి దేశాలు.. వాళ్లకు కొరత ఉన్నప్పుడల్లా భారత్ నుంచే రైస్ తీసుకుంటాయి. ఆఫ్రికా దేశాల్లో రైస్ వినియోగం చాలా ఎక్కువ. క్యూబా, పనామా దేశాలు పూర్తిగా రైస్ పైనే ఆధారపడుతున్నాయి. గతేడాది భారత్ 140 దేశాలకు 22 మిలియన్ టన్నుల రైస్‌ను ఎగుమతి చేసింది. వీటిలో సగం తెల్లబియ్యమే ఉన్నాయి.
బియ్యం ఎగుమతి ఆగిపోతే ఏం జరుగుతుంది..?
వివిధ దేశాల మధ్య సప్లై చెయిన్ సక్రమంగా నడిచినంత కాలమే ధరలు అదుపులో ఉంటాయి. ఎప్పుడైతే ఎగుమతులు, దిగుమతులు ఆగిపోయాయో.. ఆ ప్రభావం వెంటనే ఆయా దేశాల్లో ధరల పెరుగుదలకు దారి తీస్తుంది. భారత్ నుంచి బియ్యం ఎగుమతి ఆగిపోవడంతో వీటిపైనే ఆధారపడిన దేశాల్లో ఆహారోత్పత్తుల ధరలు 15 శాతం వరకు పెరిగినట్టు ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అంచనా వేసింది. 2022 నుంచి అంతర్జాతీయంగా రైస్ ధరలు పెరుగుతూ వస్తున్నాయి. దీనికి భారత్ విధించిన ఎగుమతుల నిషేధం కూడా తోడవడంతో ఆ ప్రభావం ఇంకా పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా మారుతున్న వాతావరణ పరిస్థితులు.. రైస్ పండించే ఇతర దేశాలు ఎదుర్కొంటున్న సమస్యలు.. యుద్ధం కారణంగా ఉక్రెయిన్ నుంచి ధాన్యాలు బయటకు రాకపోవడం.. ఇలా అనేక కారణాలు ప్రపంచ దేశాలకు చుక్కలు చూపిస్తున్నాయి. మనదేశంలో ధరలు తగ్గుముఖం పట్టిన తర్వాత ఎగుమతులపై నిషేధం ఎత్తివేసినా.. ఈలోపే ఆ ప్రభావాన్ని అన్ని దేశాలు ఎదుర్కొంటున్నాయి. భారత్ తీసుకున్న నిర్ణయం కారణంగా అనేక ఆఫ్రికా దేశాలు ఇప్పటికే ఆహార భద్రతా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. దేశీయంగా ధరలు అదుపులోకి వస్తే తప్ప కేంద్రం నిషేధాన్ని ఉపసంహరించుకునే పరిస్థితులు లేవు. అంతవరకు అంతర్జాతీయ సమాజానికి ఆహార సంక్షోభం తప్పదు.