Vaikom Satyagraha: దేవుడు ముందు అందరూ సమానమేనా? వందేళ్ల క్రితం జరిగిన ఉద్యమం గురించి ఈ తరం ఎందుకు తెలుసుకోవాలి?

ఈ ఏడాది నవంబర్ 29న ప్రత్యేక వైకోం సత్యాగ్రహ శతాబ్ది వేడుకలను నిర్వహించనుంది కేరళ ప్రభుత్వం. వైకోం అన్నది కేవలం ఓ ఊరి పేరు మాత్రమే కావొచ్చు. కానీ అదే కేరళ ప్రజల తలరాతను మార్చింది. సామాజిక న్యాయాన్ని సాధించి పెట్టింది.

  • Written By:
  • Updated On - April 1, 2023 / 05:48 PM IST

చరిత్రలో ఒక రోజు… కేరళ(Kerala)లోని కొట్టాయం(Kottayam)కు సమీపంలో ఉన్న ఓ ప్రాంతం..ముగ్గురు వ్యక్తులు చేతిలో చెయ్యి వేసుకుని ముందుకు కదులుతున్నారు.. ఆ ముగ్గురి లక్ష్యం ఒక్కటే… అక్కడ రాసి ఉన్న ఓ బోర్డును చేధించి ముందుకు సాగడం. చుట్టుపక్కల వాళ్లు భయంభయంగా వాళ్లనే చూస్తున్నారు.. ఏం జరగబోతుందోనని అందరిలోనూ ఒకటే ఆందోళన. వాళ్లు భయపడినంత పని జరిగిపోయింది. ఆ ముగ్గురు ఆ బోర్డు సమీపానికి రాకముందే పోలీసులు వాళ్లను అడ్డుకున్నారు. లాఠీలకు పని చెప్పి వాళ్లను చితకబాదారు. అక్కడ రాసి ఉన్న బోర్డును చేధించే దిశగా ఆ ముగ్గురు చేసిన ప్రయత్నం ఫలించి ఉండకపోవచ్చు. కానీ వందేళ్ల క్రితం వాళ్లు వేసిన ఆ అడుగులే దేశ చరిత్ర ను తిరగరాశాయి.
ఇంతకీ ఆరోజు ఏం జరిగింది ? అక్కడేం రాసుంది ?
అంటరానివాళ్లకు ఈ రోడ్లపైకి ప్రవేశం నిషిద్ధం… ఆ రోజు ఆ బోర్డుపై అదే రాసి ఉంది. అలా ఒక్కరోజు కాదు.. తరతరాలుగా అక్కడ అదే పరిస్థితి. రోడ్లపై నడవడానికి కూడా కులం(Caste), మతం (Religion) ఉంటుందా? రోడ్లపై కొన్ని కులాల వాళ్లు మాత్రమే నడవాలా ? అవును అంతే అంటుంది అప్పటి సమాజం. వందశాతం అక్షరాస్యత సాధించిన రాష్ట్రంగా కేరళ (Kerala) ఇప్పుడు కనిపిస్తున్నా.. వందేళ్ల క్రితం కేరళ సమాజం ఎన్నో అవలక్షణాలకు, అమానవీయ ఘటనలకు సాక్షిగా ఉండేది. అంటరానివాళ్లు అన్న పేరుతో దేవాలయాల్లోకే కాదు.. దేవాలయ వీధుల్లోకి కూడా కొన్ని వర్గాల ప్రజలను రానిచ్చేవారు కాదు. నాటి అసమానతలపై ఎక్కుపెట్టిన ఉద్యమమే “వైకోం సత్యాగ్రహం” (Vaikom Satyagraha).

చరిత్రను మలుపుతిప్పిన ఉద్యమం
వందేళ్ల క్రితం మాట. 1924… కేరళ ఆవిర్భవించక ముందు నాటి సంగతి.. అప్పుడు దేశవ్యాప్తంగా ఉన్నది సంస్థానాలే. అందులో ఒకటి ట్రావెన్‌కోర్ సంస్థానం (Travancore Kingdom). అది మహారాణి (Princess) గారి ఏలుబడిలో ఉండేది. ప్రస్తుతం కేరళలో ఉన్న కొట్టాయం జిల్లా ట్రావెన్‌కోర్ రాజ్యం పరిధిలోనే ఉండేది. ఆ ప్రాంతంలోనే ఉంది వైకోం (Vaikom) పేరుతో చిన్న ఊరు. అక్కడున్న మహాదేవన్( శివుడు) (Mahadevan Temple) ఆలయంలోకి అగ్రవర్ణాలకు మాత్రమే ప్రవేశం ఉండేది. అగ్రవర్ణాల్లో కూడా ఎక్కువ, తక్కువ అనే భావన ఉండేది. ఒక్కమహాదేవన్ టెంపుల్ మాత్రమే కాదు.. ట్రావెన్‌కోర్ మొత్తం ఇలాంటి కట్టుబాట్లే ఉండేవి. ఎజువా (Ya jua) అనే కులాన్ని చాలా తక్కువగా చూసేవాళ్లు. ఆలయంలోకి మాత్రమే కాదు… ఆలయాల చుట్టు పక్కల రోడ్లపై నడవడానికి కూడా అనుమతి ఉండేది కాదు. మనుషులను ఇలా తక్కువ, ఎక్కువ అని విభజించి పాలించే దురాచారాలకు నాటి ట్రావెన్‌కోర్ సంస్థానం కేరాఫ్‌గా ఉండేది.
603 రోజులు
మనిషిని మనిషిగా చూడని నాటి రాచరికపు పాలకులపై ఉద్యమం మొదలయ్యింది. దురాచార సంకెళ్లను తెంచేందుకు వైకోం మహాదేవన్ ఆలయ ప్రవేశం దిశగా వేసిన అడుగులు మహోద్యమం(Movement)గా మారాయి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 603 రోజుల పాటు పోరాటం సాగింది. నాటి ఉద్యమాన్ని కాంగ్రెస్ పార్టీ (Congress Party) నేతలు ముందుండి నడిపించారు. సంస్థానాధీశులు ఎంత అణచివేయాలని చూసినా… ఉద్యమకారులు వెనకడుగు వేయలేదు. సాంఘిక దురాచారాలను రూపుమాపాలని, కులంతో సంబంధం లేకుండా ఆలయ ప్రవేశాలు కల్పించాలని ఆందోళనలు మిన్నంటాయి. ఓవైపు బ్రిటిష్ (British) పాలకులకు వ్యతిరేకంగా స్వాతంత్రోద్యమం (Independence movement), మరోవైపు వైకోం ఆందోళనలు కేరళను దాటి ఇతర ప్రాంతాలకు కూడా వ్యాపించాయి. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వైకోం ఉద్యమానికి మద్దతు లభించింది. ఉద్యమంలో పాల్గొన్న ప్రముఖ నేతలను ఎక్కడక్కడ అరెస్ట్ చేసి జైళ్లలో పెట్టడంతో ఒకానొక దశలో ఉద్యమకారుల ఆశలు సన్నగిల్లాయి. తాము అనుకున్నది సాధిస్తామా.. ఇంకా ఎన్నిరోజులు పోరాడాలి అనే భావన కలిగింది. సరిగ్గా అదే సమయంలో ఉద్యమాన్ని మరో మలుపు తిప్పేందుకే అన్నట్టు ప్రముఖ తమిళ సంఘ సంస్కర్త (Tamil Social Reformer) పెరియార్ ఈవీ రంగస్వామి (Periyar E V Rangaswamy) రంగప్రవేశం చేశారు. ఆయన స్వయంగా వైకోం ఉద్యమంలో పాల్గొనడంతో కొత్త ఊపిరి వచ్చింది. వారాలు, నెలలు తరబడి మహాదేవన్ ఆలయం ముందు శిబిరాలు ఏర్పాటు చేశారు. పంజాబ్ (Punjab) నుంచి అకాలీలు (Akalis) బృందాలుగా ట్రావెన్‌కోర్ తరలివచ్చి ఉద్యమకారుల కోసం రోజుల తరబడి భోజన ఏర్పాట్లు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. చివరకు ఇతర అగ్రవర్ణ కులాలు కూడా వైకో మూమెంట్‌కు మద్దతు ప్రకటించాయి. 13 రోజుల పాటు ట్రావెన్‌కోర్‌కు మార్చ్ నిర్వహించారు. వైకోం ఉద్యమాన్ని ముందుండి నడిపించిన అప్పటి కాంగ్రెస్ నేత, ఎజవ సామాజిక వర్గానికి చెందిన టీకే మాధవ్ (T K Madhav) ట్రావెన్‌కోర్ ప్రభుత్వంలో సాగుతున్న సాంఘిక దురాచారాల గురించి మహాత్మాగాంధీ (Mahatma Gandhi) దృష్టికి కూడా తీసుకువెళ్లారు. 1923లో కాకినాడలో (Kakinada) జరిగిన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (Indian National Congress) సమావేశంలో అంటరానితనాన్ని నిర్మూలించే వరకు పోరాడాలని తీర్మానం కూడా చేశారు. 1925 మార్చిలో స్వయంగా గాంధీజీ వైకోం ఆందోళన శిబిరాన్ని సందర్శించారు. కేరళ సంఘ సంస్కర్త నారాయణ గురుతో (Naryana Guru) కలిసి పాలకులతో చర్చలు జరిపారు.
1924 మార్చి 30న ప్రారంభమైన వైకోం సత్యాగ్రహం సుధీర్ఘ ఆందోళన తర్వాత 1925 నవంబర్ 23న ముగిసింది. ట్రావెన్‌కోర్ మహారాణితో పాటు సంఘ సంస్కర్త నారాయణగురుతో గాంధీజీ జరిపిన చర్చలు ఫలించడంతో ట్రావెన్‌కోర్ ప్రభుత్వం దిగివచ్చింది. దేవాలయ వీధుల్లోకి ప్రవేశంపై ఉన్న ఆంక్షలను ఎత్తివేసింది. అలా ప్రారంభమైన వైకోం సత్యాగ్రహమే కేరళలో ఎన్నో సాంఘిక దురాచారాలు రూపుమాపడానికి దోహదపడింది. ఆలయాల్లోకి ప్రవేశాల పేరుతో కొంతమంది దీనిని మతపరమైన ఉద్యమంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించినా.. సోషల్ జస్టిస్ (Social justice) దిశగా పెనుమార్పులు రావడానికి మాత్రం నాంది వేసింది వైకోం ఉద్యమమే.


100 ఏళ్ల వైకోం సత్యాగ్రహం
సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా సాగిన వైకోం సత్యాగ్రహ మహోద్యమాన్ని కేరళ (Kerala), తమిళనాడు (Tamilnadu) ప్రభుత్వాలు వేడుకగా జరుపుకుంటున్నాయి. శతాబ్ది వేడుకల్లో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ (Kerala CM Pinarayi Vijayan) తో పాటు తమిళనాడు సీఎం స్టాలిన్ (Tamilnadu CM Stalin) కూడా పాల్గొన్నారు. శతాబ్ది వేడుకల లోగోను, హ్యాండ్ బుక్ ను ఆవిష్కరించారు. ఈ ఏడాది నవంబర్ 29న ప్రత్యేక వైకోం సత్యాగ్రహ శతాబ్ది వేడుకలను నిర్వహించనుంది కేరళ ప్రభుత్వం. వైకోం అన్నది కేవలం ఓ ఊరి పేరు మాత్రమే కావొచ్చు. కానీ అదే కేరళ ప్రజల తలరాతను మార్చింది. సామాజిక న్యాయాన్ని సాధించి పెట్టింది.

(HYMA)