స్వలింగ సంపర్కం నేరం కాదు అని.. సెక్షన్ 377ను సుప్రీంకోర్టు కొట్టేసి ఐదేళ్లు అవుతుంది.. అయినా స్వలింగ సంపర్కులను సమాజం ఇంకా వివక్షతోనే చూస్తుంది కదా? ఇక గతేడాది అబార్షన్ మహిళల హక్కు అంటూ దేశ సర్వోన్నత న్యాయస్థానంపై ఇచ్చిన తీర్పును విమర్శించేవాళ్లు మన కళ్ల ముందే కనిపిస్తున్నారు కదా.
‘కన్యాదానం అర్థం తెలుసా’? ‘ఇదేం తీర్పు’ అంటూ ఛాందసవాదులు మనముందే తిరుగుతున్నది నిజం కాదా..? ఇక తాజాగా విడాకుల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో సమాజం ఏం మారుతుందో ఏమో తెలియదు కానీ.. ఈ మూడు తీర్పులు మాత్రం నిజంగా చారిత్రాత్మకం.. విప్లవాత్మకం!
వివక్షలేని న్యాయం.. సెక్షన్-377 తీర్పు:
ప్రకృతంటే అందులో మనుషులు మాత్రమే ఉండరు.. ఈ భూమ్మిద అనేక జీవరాశులున్నాయి.. మనిషి మాత్రం తానొక్కడే తోపులా ఫీల్ అవుతుంటాడు.. అందుకే తనకు నచ్చని దాన్ని ప్రకృతికి నచ్చదంటాడు..! హోమో సెక్స్ చాలా జంతువుల్లో కనిపించేదే..అయితే ప్రకృతి విరుద్ధమంటూ చట్టాలు చేశాడు..అయితే కాలం ఎప్పుడూ ఓకేలా ఉండదు.. అప్పుడెప్పుడో యూరప్, అమెరికాలో మొదలైన ఎల్జీబీటీక్యూ(LGBTQ) విప్లవాలు నేడు ప్రపంచం నలుములలకు పాకాయి..మనదేశంలో కూడా తమ హక్కుల కోసం LGBTQ ఇప్పటికీ పోరాడుతూనే ఉంది.. అయితే ఐదేళ్ల క్రితం 2018లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో వారికి స్వేచ్ఛకు రెక్కలొచ్చాయి.. అప్పటివరకు చట్టం ప్రకారం నేరంగా ఉన్న స్వలింగ సంపర్కానికి సంబంధించిన సెక్షన్ 377ను దేశ సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసింది. 1861 నాటి చట్టం ప్రకారం గే సెక్స్‌లో పాల్గొనే వారికి గరిష్టంగా పదేళ్ల జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. అది బ్రిటిష్ వాళ్లు చేసిన చట్టం..వాళ్ల మతగ్రంధాల ప్రకారం అది నేరం.. దాన్ని ప్రకృతికి ఆపాదించేసి అసహజమంటూ మనుషులపై రుద్దారు.. మతపరంగా కూడా మూడిపడి ఉన్న ఈ కేసు దాదాపు 17ఏళ్ల పాటు అనేక కోర్టుల్లో నలిగింది..రాజ్యాంగం కల్పించిన హక్కులను సెక్షన్ 377 కాలరాస్తోందని పిటీషనర్లు గట్టిగా వాదించారు. వారితో ఏకీభవించిన సుప్రీంకోర్టు సెప్టెంబర్ 6, 2018న హోమోసెక్సువాలిటీ నేరం కాదని తీర్పు వెలువరించింది.
అబార్షన్ మహిళల హక్కు:
వైవాహిక లైంగికదాడి కూడా రేప్ లాంటిదే.. ప్రేమికుడి చేతిలో మోసపోయిన ప్రియురాలు ఎంతమంది ఉంటారో కూడా చెప్పడం కష్టమే..! సురక్షిత గర్భ విచ్ఛిత్తి కూడా హక్కేనేని గతేడాది సెప్టెంబర్ 29న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పెద్ద సంచలనమే రేపింది. అబార్షన్లు చేయించుకోవడానికి పెళ్లితో సంబంధం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ విషయంలో వివాహితులు, అవివావాహితులు అంటూ తేడా చూపడం రాజ్యాంగవిరుద్దమని తేల్చేసింది. పెళ్ళైన తర్వాత కూడా భార్య సమ్మితి లేకుండా భర్త వ్యవహరిస్తే అత్యాచారంగానే భావించాలని, ఆ సమయంలో ఆమె గర్భం దాల్చితే దానిని తొలగించుకోవచ్చని తెలిపింది. పెళ్లయినా, కాకపోయినా గర్భం దాల్చిన 24 వారాల వరకు అబార్షన్ చేయించుకోవచ్చని చెప్పింది. ఇప్పుడు కాలం మారిందని.. చట్టం స్థిరంగా ఎప్పుడూ ఒకేలా ఉండదని సుప్రీంకోర్టు న్యాయమూర్తులే అభిప్రాయపడ్డారు. ఇది అక్షరాల నిజం.. ఒకప్పుడు చట్టబద్దంగా ఉన్న అనే మూఢాచారాలు ఇప్పుడు నేరాలుగా ఉన్న విషయాన్ని గుర్తుపెట్టుకొవాలని సుప్రీంకోర్టు పరోక్షంగా ఈ వ్యాఖ్యలు చేసింది. సామాజిక వాస్తవాలకు అనుగుణంగా నిబంధనలు మారుతాయన్న విషయాన్ని కూడా దేశ సర్వోన్నత న్యాయస్థానం ఈ తీర్పులో స్పష్టం చేసింది.
అలాంటి జంటకు వెంటనే విడాకులు!
భర్త శాడిస్ట్ అయితే ఏం చేయాలి? భార్య నిత్యం వేధిస్తూంటే ఏం చేయాలి? కలిసి కాపురం చేయాల్సిందేనా? పెద్దలు చేసినా పెళ్లే కావొచ్చు.. లేక ప్రేమించి చేసుకున్న వివాహమే కావొచ్చు.. ఆ బంధం టాక్సిక్‌గా మారితే కలిసి జీవించడం కష్టమే.. విడాకులను నార్మలైజ్ చేసి చూడాలని చాలా కాలంగా మాటలు వినిపిస్తున్నాయి.. అదేం పెద్ద విషయం కాదు అన్న వాళ్ల సంఖ్య కూడా కాస్త పెరిగిందనే చెప్పాలి.. సరిగ్గా ఇదే సమయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. విడాకుల ప్రక్రియను సులభతరం చేస్తూ ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం సంచలన తీర్పు వెలువరించింది. దంపతులు పరస్పర అంగీకారంతో విడిపోవాలి అనుకుంటే విడాకుల కోసం 6 నెలలు ఆగాల్సిన అవసరం లేదని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. కొన్ని షరతులతో ఆరునెలల నిరీక్షణ నిబంధనలను సడలించిన సుప్రీంకోర్టు..దంపతులు కోరుకుంటే వెంటనే విడాకుల మంజూరు చేయాలని స్పష్టమైన ఆదేశాలిచ్చింది.
కోర్టు తీర్పులతో ప్రజల్లో మార్పు వస్తుందా?
ప్రపంచానికే పెద్దన్నలమంటూ.. నాగరికతకు బ్రాండ్ అంబాసిడర్లమంటూ బిల్డప్ ఇచ్చే అగ్రరాజ్యలు, అభివృద్ధి చెందిన దేశాలు కూడా ఇవ్వని తీర్పులు మన సుప్రీంకోర్టు ఇచ్చింది.. అబార్షన్ చట్టబద్ధత విషయంలో అమెరికా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు మన న్యాయస్థానం ఇచ్చిన తీర్పు పూర్తిగా భిన్నం.. అయితే కోర్టులు ఏ తీర్పునిస్తే ఏంటి..మేం మాత్రం ఇలానే ఉంటాం.. వివక్షతోనే బతుకుతామనుకుంటే కోర్టులు చేయగలిగిందేమీ లేదు.. బాల్య వివాహాలు చట్టవిరుద్ధమన్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే.. వరకట్నం చట్టవిరుద్ధమని కూడా అందిరికి తెలిసిందే.. అయితే అవి జరగాని ఊర్లు ఉన్నాయా అంటే అసలు లేనే లేవనే సమాధానమే వస్తుంది.. పబ్లిక్‌గానే కట్నం గురించి డిస్కషన్స్ పెడుతుంటారు.. అసలు జరిగేది పెళ్లా లేక వ్యాపారమానని డౌట్ కూడా వచ్చేలా పెళ్లి చర్చలు జరుగుతుంటాయి..అటు బాల్యవివాహాలు కూడా ఊర్లలో ఇంకా కనిపిస్తూనే ఉన్నాయి. మరి ఈ మూడు కోర్టు తీర్పులతో ప్రజల ఆలోచనాతీరులో మార్పు వస్తుందా అంటే చెప్పలేని దుస్థుతి..