Gender Parity: లింగ సమానత్వం సాధించడానికి 131 ఏళ్లు పడుతుందా..? లేటెస్ట్ సర్వేలో సంచలన నిజాలు

పూర్తి సాధికారత, లింగ సమానత్వం సాధించడానికి మరో 131 ఏళ్లు పడుతుందట. ఇది సామాన్యులెవరో చెబుతున్న మాట కాదు. గ్లోబల్ జెండర్ గ్యాప్‌పై వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (డబ్ల్యూఈఎఫ్) రూపొందించిన నివేదిక ద్వారా ఈ విష‍యం వెల్లడైంది.

  • Written By:
  • Publish Date - June 22, 2023 / 10:55 AM IST

Gender Parity: మహిళా సాధికారత, లింగ సమానత్వం కోసం శతాబ్దాలుగా మహిళలు సాగిస్తున్న పోరాటానికి ఇప్పట్లో తెరపడే అవకాశాలే లేవు. మహిళలు ఎంతో ప్రగతి సాధిస్తున్నారు అని చెప్పుకొంటున్నప్పటికీ.. సాధించిన దానికి.. సాధించాల్సినదానికి ఎంతో వ్యత్యాసముంది. పూర్తి సాధికారత, లింగ సమానత్వం సాధించడానికి మరో 131 ఏళ్లు పడుతుందట. ఇది సామాన్యులెవరో చెబుతున్న మాట కాదు. గ్లోబల్ జెండర్ గ్యాప్‌పై వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (డబ్ల్యూఈఎఫ్) రూపొందించిన నివేదిక ద్వారా ఈ విష‍యం వెల్లడైంది. పురుషులతో అన్ని రంగాల్లో సమానంగా నిలబడాలంటే మరో 131 ఏళ్లు పడుతుందని డబ్ల్యూఈఎఫ్ రూపొందించిన నివేదిక తేల్చింది.
భారత స్థానం ఎంతో తెలుసా..?
ఈ నివేదిక ప్రకారం.. 2154లోనే పురుషులు, స్త్రీలు సమానంగా నిలబడే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా అనేక అంశాల్ని పరిశీలించి ఈ నివేదిక రూపొందించారు. ఆర్థిక అంశాలు, రాజకీయాలు, విద్య, ఆరోగ్యం వంటి అంశాల్ని పరిగణనలోకి తీసుకున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 0.3 శాతం లింగబేధం తగ్గింది. లింగ సమానత్వం నివేదికలో భారత స్థానం చాలా తక్కువగా ఉంది. ఈ జాబితాలో ఇండియా 127వ స్థానంలో ఉంది. గతేడాదితో పోలిస్తే ఎనిమిది స్థానాలు మెరుగైంది. పట్టికలోని వివిధ అంశాల పరంగా 1.4 పాయింట్ల లింగబేధం తగ్గింది. మన దేశంలో లింగబేధం 64.3 శాతం ఉంది. అంటే స్త్రీలు ఇంకా ఎంత వివక్షకు గురవుతున్నారో అర్థం చేసుకోవచ్చు. విద్యలో మాత్రం ఇండియా సమానత్వం దిశగా దూసుకెళ్తోంది.

ఆర్థిక స్వేచ్ఛ, సమానత్వం, అవకాశాలు వంటి విషయంలో మాత్రం ఇంకా 36.7 శాతం సమానత్వం కొనసాగుతోంది. వేతనాలు, ఆదాయంలో మాత్రం పురుషులతో పోటీపడేస్థాయికి మహిళలు చేరుకున్నారు. అనేక రంగాల్లో మహిళలకు మంచి స్థాయి లభిస్తోంది. ఐటీ వంటి సాంకేతిక రంగాల్లో దూసుకెళ్తున్నారు. సీనియర్ స్థాయికి చేరుకుంటున్నారు. గత ఏడాది మాత్రం ఈ పెరుగుదల కొద్దిగా తగ్గింది. దేశ ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న సంక్షోభం కూడా దీనికి కారణమే అయ్యుండొచ్చు. రాజకీయాల్లో 25.3 శాతం సమానత్వం ఉంది. పార్లమెంటులో 15.1 శాతం మహిళా సభ్యులున్నారు. 2006 తర్వాత పార్లమెంటులో ఈ స్థాయిలో సభ్యులుండటం ఇదే మొదటిసారి. ఆరోగ్య పరంగా చూస్తే 1.9 శాతం సమానత్వం పెరిగింది. బాలికా జననాలు పెరిగాయి.

లింగ నిష్పత్తి సమానంగా మారుతోంది. ఈ విషయంలో 92.7 శాతం సమానత్వం సాధించాం. మరోవైపు మన దేశంలో ప్రభుత్వం కూడా లింగ సమానత్వానికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపింది. లింగ అసమానత సూచికలో ఇండియా 0.490 విలువ కలిగి ఉంది. ఈ విషయంలో దక్షిణాసియా సగటు విలువ 0.508కాగా, ప్రపంచ సగటు 0.465గా ఉంది. మొత్తం 146 దేశాల్లో సర్వే నిర్వహించి డబ్ల్యూఈఎఫ్ ఈ నివేదిక విడుదల చేసింది. లింగ అసమానత సూచిక గురించి 190 దేశాల్లో సర్వే నిర్వహించగా, ఇండియా ఇందులో 122వ స్థానంలో ఉంది.