Rice Shortage: ప్రపంచానికి అన్నం కొరత.. పడిపోయిన బియ్యం ఉత్పత్తి.. ఇండియా పరిస్థితి ఏంటి?

ఇప్పుడు ప్రపంచానికి అన్నం దొరకడం కష్టమవుతోంది. బియ్యం ఉత్పత్తి భారీగా తగ్గింది. ఇరవై ఏళ్లలో ఎప్పుడూ లేనంతగా బియ్యం ఉత్పత్తి పడిపోయింది. ఈ కారణంగా చాలా దేశాల్లో బియ్యం ధరలు పెరిగాయి. ఇది ఇలాగే కొనసాగితే ప్రపంచం ఆహార సంక్షోభాన్ని ఎదుర్కోక తప్పదు

  • Written By:
  • Updated On - April 19, 2023 / 06:46 PM IST

Rice Shortage: ప్రపంచంలో ఎక్కువ మంది తినేది అన్నమే. అనేక దేశాల్లో ఇదే ప్రధాన ఆహారం. అందుకే డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది కాబట్టి.. ఇండియా సహా అనేక దేశాలు వరి పంట పండిస్తున్నాయి. అయితే, ఇప్పుడు ప్రపంచానికి అన్నం దొరకడం కష్టమవుతోంది. బియ్యం ఉత్పత్తి భారీగా తగ్గింది. ఇరవై ఏళ్లలో ఎప్పుడూ లేనంతగా బియ్యం ఉత్పత్తి పడిపోయింది. ఈ కారణంగా చాలా దేశాల్లో బియ్యం ధరలు పెరిగాయి. ఇది ఇలాగే కొనసాగితే ప్రపంచం ఆహార సంక్షోభాన్ని ఎదుర్కోక తప్పదు. దీనిపై ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ పరిస్థితికి కారణమేంటి? ఇంతకీ బియ్యం విషయంలో ఇండియా పరిస్థితి ఏంటి?

ఇరవై ఏళ్లలో ఎప్పుడూ లేనంతగా ఇటీవల ప్రపంచవ్యాప్తంగా బియ్యం ఉత్పత్తి తగ్గిందని వివిధ సంస్థల నివేదికలు తెలియజేస్తున్నాయి. దీనికి వాతావరణ మార్పులు, అధిక ఉష్ణోగ్రతలు, యుక్రెయిన్ యుద్ధం, వరదలు వంటివి కారణాలు. అత్యధిక జనాభా ఉన్న చైనాలో అన్నం ఎక్కువగా తింటారు. అందుకే అక్కడ వరి ఎక్కువగా పండిస్తారు. కానీ, గత ఏడాది కాలంగా చైనాలో వరి ఉత్ప్తత్తి భారీగా తగ్గిపోయింది. గత ఏడాది అక్కడ సంభవించిన భారీ వరదలు, వాతావరణ మార్పులే ఇందుకు కారణాలు. వీటివల్ల పంటకు తీవ్ర నష్టం కలిగింది. చైనా భూభాగం ఎక్కువే అయినా, వ్యవసాయానికి అనువైన భూమి 11 శాతం మాత్రమే. ఇది కూడా అక్కడ వరి ఉత్పత్తి తగ్గడానికి మరో కారణం. బియ్యం ఎక్కువగా ఉత్పత్తి చేసే మరో దేశం పాకిస్తాన్. ఆ దేశాన్ని గత ఏడాది భారీగా వరదలు ముంచెత్తిన సంగతి తెలిసిందే. దీంతో వేల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. పాకిస్తాన్‌లో దాదాపు 31 శాతం వరి దిగుబడి తగ్గిపోయింది. అలాగే యుక్రెయిన్‌లో కూడా యుద్ధం కారణంగా వరి పంట ఉత్పత్తి తగ్గింది.


ఊక తినండి అంటున్న చైనా
వరి ఉత్పత్తి తగ్గడంతో చైనాలో ఆహార కొరత ఏర్పడుతోంది. ఈ విషయాన్ని ముందే గుర్తించిన చైనా ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టింది. వరి నుంచి వచ్చే ఊకను కూడా ఆహారంలో చేర్చుకోవాలని అక్కడి ప్రజలకు చెబుతోంది. దీని ద్వారా ఎన్నో పోషకాలు అందుతాయని మూడేళ్లుగా ప్రచారం చేస్తోంది. అలాగే గోధుమ ఊక, ఇతర ప్రధాన పంటల నుంచి వచ్చే నూనెలు, వీటితో తయారయ్యే అనుబంధ ఆహారాలు కూడా తీసుకోవాలని అక్కడి వాళ్లకు సూచించింది. కోవిడ్ కారణంగా కూడా చైనాలో వరి దిగుబడి తగ్గిపోయింది. అమెరికా కూడా వరి ఎక్కువగానే ఉత్పత్తి చేస్తుంది. అయితే, అక్కడ కూడా గత 30 ఏళ్లలో ఎప్పుడూ లేనంతగా వరి దిగుబడి తగ్గిందని అధికారులు తెలిపారు.
ఇండియా పరిస్థితి ఏంటి?
మన దేశంలో వరి ప్రధాన పంట.. ప్రధాన ఆహారం. ప్రపంచంలో వరి ఎక్కువగా ఉత్పత్తి చేసే దేశం ఇండియా. విదేశాలకు ఎక్కువ ఎగుమతి చేసేది కూడా మనమే. దేశంలో కూడా గత ఏడాది వరి ఉత్పత్తి తగ్గింది. ఈ పరిస్థితిని ముందుగానే గమనించిన కేంద్రం వరి ఎగుమతులపై ఆంక్షలు విధించింది. బ్రోకెన్ రైస్ ఎగుమతులపై నిషేధం విధించింది. కొన్ని రకాల రైస్ ఎగుమతులపై 20 శాతం వరకు ఎగుమతి సుంకం విధించింది. సాధారణంగా ఇతర దేశాలకు ఇండియా ఎగుమతి చేసే బియ్యం.. అమెరికా, పాకిస్తాన్, థాయ్‌లాండ్, వియత్నాం దేశాలు కలిపి చేసే ఎగుమతులకన్నా ఎక్కువగా ఉంటుంది. దీంతో విదేశాలకు ఇండియా నుంచి ఎగుమతులు తగ్గాయి. దేశంలో బియ్యానికి కొరత రాకూడదని కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ఇండియాలో ఎలాంటి సంక్షోభం తలెత్తలేదు. పైగా తక్కువ దిగుబడి కారణంగా అనేక దేశాల్లో బియ్యం ధరలు పెరిగాయి. కానీ, మనదేశంలో మాత్రం స్థిరంగానే ఉన్నాయి.


మిల్లెట్స్‌తో మేలు
కేంద్ర ప్రభుత్వం ఇటీవల మిల్లెట్స్ ఉత్పత్తిని పెంచుతున్న సంగతి తెలిసిందే. వరికి ప్రత్యామ్నాయంగా కూడా మిల్లెట్స్‌ను కేంద్రం ప్రోత్సహిస్తోంది. పైగా ఇవి బియ్యం, గోధుమల కన్నా చాలా ఆరోగ్యకరమైనవి. వరికి ప్రత్యామ్నాయంగానే కాకుండా ప్రపంచ ఆహార కొరతను మిల్లెట్స్ తీర్చగలవని కేంద్రం భావిస్తోంది. దేశంలో సగటున ఐదు కిలోల గోధుమల ఉత్పత్తి జరిగితే, ఒక కిలో మిల్లెట్స్ ఉత్పత్తి జరుగుతోంది. ఈ ఏడాదిని మిల్లెట్స్ ఇయర్‌గా గుర్తించేందుకు ఐక్యరాజ్య సమితి అంగీకరించిన సంగతి తెలిసిందే. మిల్లెట్స్ ఉత్పత్తిని ప్రోత్సహించే ఉద్దేశంతో కేంద్రం ఐరాసలో ఈ ప్రతిపాదన తెచ్చింది. 2026 వరకు 4.5 శాతం ఆహారం మిల్లెట్స్ వల్లే ఉంటుందని కేంద్రం అంచనా.